Shardul Thakur: టీమిండియా స్టార్ క్రికెటర్ శార్దూల్ ఠాకూర్ గురించి తెలియని క్రీడాభిమాని ఉండరు. ఈ ఆల్ రౌండర్ ని టీమ్ ఇండియా అభిమానులు ముద్దుగా “లార్డ్” అని పిలుచుకుంటారు. జట్టు కష్టాలలో ఉన్నప్పుడు దేవుడిలా ఆదుకుంటాడు శార్దూల్. అయితే ఫిట్నెస్ ని వంకగా చూపి ఈ ఆల్రౌండర్ ని సైడ్ చేసింది బీసీసీఐ. ఇతనికి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ, అలాగే ఫిబ్రవరి 19 నుండి జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా అవకాశం దక్కలేదు. అంతేకాదు ఐపీఎల్ 2025 మెగా వేలంలో కూడా ఈ కీలక ఆటగాడు అమ్ముడుపోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది.
Also Read: Mohammed Shami: షమీకి మళ్లీ గాయం.. ఇంగ్లాండ్ సీరిస్ నుంచే దూరం ?
దీంతో తన కసినంతా రంజి ట్రోఫీలో చూపిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న శరత్ పవార్ క్రికెట్ అకాడమీ వేదికగా రంజి ట్రోఫీ 2024 – 25 లో జమ్మూ కాశ్మీర్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై కమ్ బ్యాక్ ఇచ్చింది. ఈ మ్యాచ్ లో శార్దూల్ ఠాకూర్ అదరగొట్టాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైష్వాల్, అజింక్య రహనే, శివం దుబే వంటి బ్యాటర్లు విఫలమైన అదే పీచ్ పై.. పరుగుల వరద పారించాడు శార్దూల్. ఈ టోర్నీలో ముంబై తరఫున బరిలోకి దిగి.. జమ్మూ కాశ్మీర్ పై సెంచరీ బాదాడు.
ఏకంగా ఎనిమిదవ స్థానంలో బ్యాటింగ్ కి దిగి వన్డే తరహాలో సెంచరీ మార్క్ ను అందుకున్నాడు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై మొదటి ఇన్నింగ్స్ లో 120 పరుగులకే ఆల్ అవుట్ అయింది. శార్దూల్ ఠాకూర్ మొదటి ఇన్నింగ్స్ లో 51 పరుగులు చేశాడు. ఇందులో 5 ఫోర్లు, 2 సిక్స్ లతో చెలరేగాడు. అనంతరం జమ్మూ కాశ్మీర్ ని ముంబై బౌలర్లు 206 పరుగులకు ఆల్ అవుట్ చేశారు. బౌలింగ్ లో శార్దూల్ రెండు వికెట్లు పడగొట్టాడు.
ఆ తర్వాత 86 పరుగుల లోటుతో రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన ముంబై 101 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో శార్దూల్ ఠాకూర్, తనుష్ కొట్టయాన్ ముంబై జట్టును ఆదుకున్నారు. శార్దూల్ ఠాకూర్ 119 బంతులలో 113 పరుగులు చేశాడు. ఇందులో 17 ఫోర్లు బాదాడు. తనుష్ కొట్టయాన్ కూడా 119 బంతులలో 6 ఫోర్లతో 58 పరుగులు చేశాడు. వీరిద్దరూ కలిసి 8 వ వికెట్ కి 173 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు.
దీంతో రెండవ ఇన్నింగ్స్ లో ముంబై భారీ స్కోర్ దిశగా సాగుతోంది. అయితే శార్ధూల్ గత 14 నెలలుగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నాడు. దేశవాళీ క్రికెట్ లో అద్భుత ప్రదర్శన చేస్తున్నప్పటికీ భారత జట్టులోకి పునరాగమనం చేయలేకపోతున్నాడు. ఈ ఏడాది ఇంగ్లాండ్ పర్యటనతో శార్దూల్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: IND vs ENG 2nd T20: ఇవాళ ఇంగ్లాండ్‌తో రెండో టీ20..టీమిండియా డేంజర్ ప్లేయర్ దూరం ?
ఎందుకంటే అతడికి టెస్టుల్లో ఇంగ్లాండ్ గడ్డపై అద్భుతమైన రికార్డు ఉంది. ఈ క్రమంలోనే సెలెక్టర్లు అతడిని జట్టులోకి తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే క్లిష్టమైన పరిస్థితులలో బ్యాటింగ్ చేయడం తనకు చాలా ఇష్టమని.. జట్టు కష్టాలలో ఉన్నప్పుడు చేసే సెంచరీలో కిక్ ఉంటుందని అన్నాడు శార్దూల్ ఠాగూర్.