IRCTC Punya Kshetra Yatra: పుణ్యక్షేత్రాలను సందర్శించుకోవాలనుకునే వారి కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ‘పుణ్యక్షేత్ర యాత్ర’ పేరుతో ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందిస్తున్నది. ఈ ప్యాకేజీలో భాగంగా కాశీ, గయ, పూరీ, అయోధ్య లాంటి 6 ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను దర్శించుకునే అవకాశం ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు రైల్వే స్టేషన్లను కలుపుతూ ఈ రైలు ప్రయాణం కొనసాగుతుంది. ఈ టూర్ 9 నైట్స్ తో కలిపి 10 రోజుల పాటు కొనసాగుతుంది.
10 రోజుల ‘పుణ్యక్షేత్ర యాత్ర’
‘పుణ్యక్షేత్ర యాత్ర’ తొలి రోజు సికింద్రాబాద్ నుంచి మొదలవుతుంది. కాజీపేట, ఖమ్మం, విజయాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్లలో యాత్రికులు ఎక్కే అవకాశం ఉంది. రెండో రోజు పెందుర్తి, విజయనగరం మీదుగా మాల్తీపాట్పూర్ కు ఉదయం 9 గంటలకు చేరుతుంది. ఇక్కడి నుంచి పూరీకి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ హోటల్ లో బస చేసే అవకాశం కల్పిస్తారు. లంచ్ తర్వాత జగన్నాథ ఆలయ దర్శనం ఉంటుంది. ఆ రోజు రాత్రి అక్కడే ఉండాలి. మూడో రోజు అల్పాహారం పూర్తయ్యాక కోణార్క్ లోని సూర్యదేవాలయాన్ని సందర్శించుకోవాలి. ఆ తర్వాత మాల్తీపాట్పూర్ స్టేషన్ నుంచి గయకు బయల్దేరాలి. నాలుగో రోజు ఉదయం 8:30 గంటలకు గయకు చేరుకుంటారు. పొద్దున్నే బ్రేక్ ఫాస్ట్ చేశాక విష్ణుపాద దేవాలయ దర్శనం ఉంటుంది. అనంతరం వారణాసి ప్రయాణం మొదలవుతుంది. ఐదో రోజు ఉదయం 6 గంటలకు వారణాసి చేరుకుంటారు. అక్కడ బ్రేక్ ఫాస్ట్ చేసి కాశీనాథుడి పుణ్యక్షేత్రం, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణాదేవీ ఆలయాల సందర్శన ఉంటుంది. సాయంత్రం గంగా హారతిని చూసే అవకాశం ఉంటుంది. ఆ రోజు రాత్రి వారణాసిలోనే బస చేయాలి. ఆరో రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత వారణాసిలోని ప్రముఖ దేవాలయాలు, ఘాట్లను చూసే అవకాశం ఉంటుంది. ఆ రోజు రాత్రి కూడా అక్కడే ఉండాలి.
ఏడో రోజు అయోధ్యకు చేరుకుంటారు. బాల రాముడి ఆలయంతో పాటు, హనుమాన్ ఆలయాలను దర్శించుకుంటారు. సాయంత్రం సరయూ నదిలో హారతిని చూస్తారు. డిన్నర్ తర్వాత ప్రయాగ్ రాజ్ కు బయల్దేరుతారు. ఎనిమిదో రోజు ఉదయం ప్రయాగ్ రాజ్ చేరుకుంటారు. అల్పాహారం తర్వాత హనుమాన్ ఆలయం, శంకర్ విమన్ మండపాన్ని చూస్తారు. అక్కడి నుంచి త్రివేణి సంగమాన్ని చూసి రిటర్న్ అవుతారు. తొమ్మిదో రోజు విజయనగరం, పెందుర్తి, సామర్లకోటకు రైలు చేరుకుంటుంది. పదో రోజు రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఖమ్మం, కాజీపేట మీదుగా సికింద్రాబాద్ కు చేరడంతో టూర్ కంప్లీట్ అవుతుంది.
‘పుణ్యక్షేత్ర యాత్ర’ ప్యాకేజీ ఛార్జీలు
‘పుణ్యక్షేత్ర యాత్ర’ రైళ్లో ఒకరు ప్రయాణించాలంటే కంఫర్ట్ లో రూ.34,910; స్టాండర్డ్ లో రూ.25,650; ఎకానమీ క్లాస్‌లో రూ.16,800 చెల్లించాలి. 5 నుంచి 11 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకైతే కంఫర్ట్ లో రూ.33,330; స్టాండర్డ్ లో రూ.25,340; ఎకానమీ క్లాస్ లో రూ.15,690 చెల్లించాలి. ట్విన్ షేరింగ్, ట్రిపుల్ ఆక్యుపెన్సీ బట్టి ఛార్జీలు మారుతాయి.
ప్యాకేజీలో ఏం అందిస్తారంటే?
ఎంచుకున్న ప్యాకేజీని బట్టి రైలులో 2AC, 3AC, స్లీపర్ క్లాస్ ప్రయాణం ఉంటుంది. ప్యాకేజీని బట్టి సందర్శనకు తీసుకెళ్లే వాహనం ఉంటుంది. పొద్దున్నే కాఫీ, బ్రేక్ ఫాస్ట్, భోజనం ఉంచితంగా అందిస్తారు. ఆయా ఆలయాల్లో ఎంట్రీ ఫీజులు, బోటింగ్ ఫీజులు ప్రయాణీకులే చెల్లించాల్సి ఉంటుంది. IRCTC వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ప్యాకేజీకి సంబంధించిన టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.
Read Also: షిరిడీ భక్తులకు గుడ్ న్యూస్, తక్కువ ధరలో IRCTC సూపర్ ప్యాకేజీలు!