Pawan Kalyan: ఏపీ శాసనమండలిలో మంగళవారం ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సాధారణంగా ప్రభుత్వం ప్రవేశపెట్టే తీర్మానానికి, ప్రతిపక్ష సభ్యులు అడ్డుకోవడం, నినాదాలు చేయడం వంటివి సాగుతూ ఉంటాయి. కానీ ఏపీ శాసనమండలిలో మంగళవారం అందుకు భిన్నమైన వాతావరణం లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీ పంచాయతీరాజ్ సవరణ చట్టం 2024 ను ప్రవేశపెట్టారు.
శాసనమండలి సమావేశాలు ప్రారంభమైన అనంతరం కొద్దిసేపు టీడీపీ కూటమి వర్సెస్ వైసీపీ మధ్య పలు అంశాలపై వాదోపవాదాలు సాగాయి. అనంతరం శాసనమండలిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి హోదాలో ఏపీ పంచాయతీరాజ్ సవరణ చట్టం 2024 ను ప్రవేశపెట్టారు. ఈ చట్టం ప్రకారం ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉన్నప్పటికీ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేలా సవరణ చేసి పవన్ కళ్యాణ్ చట్టాన్ని ప్రవేశపెట్టారు.
అంటే స్థానిక సంస్థల ఎన్నికలలో ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు కలవారు పోటీ చేసేందుకు అర్హులవుతారు. మండల, జిల్లా ప్రజా పరిషత్ ఎన్నికల సమయంలో గతంలో ఇద్దరి కంటే ఎక్కువగా సంతానం కలవారు పోటీలో పాల్గొనే అవకాశం ఉండేది కాదు. తాజాగా శాసనమండలిలో ప్రవేశపెట్టిన చట్టం ద్వారా ఇద్దరికంటే ఎక్కువ మంది సంతానం కలవారు కూడా ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులవుతారు.
పవన్ కళ్యాణ్ సవరణ చట్టం పై ప్రసంగించిన అనంతరం వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. తాము ఈ బిల్లుకు ఆమోదం తెలుపుతున్నామని, తమకు ఎటువంటి అభ్యంతరం లేదని ప్రకటించారు. దీనితో స్పీకర్ చట్టాన్ని ఆమోదించి శాసనమండలి సమావేశాలను రేపటికి వాయిదా వేశారు.
పవన్ ట్వీట్..
వైసీపీ పాలనలో 30,000 మహిళలు, బాలికలు అదృశ్యం అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ పై ఇటీవల వైసీపీ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విమర్శలపై పవన్ తాజాగా ఓ ట్వీట్ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో మహిళల భద్రతను అస్సలు పట్టించుకోలేదని, మహిళల అదృశ్యంపై నాడు వైసీపీ ప్రభుత్వం ఒక్క ప్రకటన కూడా చేయలేదన్నారు.
కానీ తమ ప్రభుత్వంలో పటిష్టమైన లా అండ్ ఆర్డర్ పై దృష్టి సారించి, పాత కేసులను ఛేదించేందుకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామన్నారు. వైజాగ్ పోలీసులు తమ విధులలో భాగంగా మహిళల భద్రతకు సంబంధించి తీసుకుంటున్న చర్యలను తాను అభినందిస్తున్నట్లు పవన్ అన్నారు. అలాగే హోమ్ మంత్రి వంగలపూడి అనిత సారథ్యంలో పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలు భేష్ అంటూ పవన్ అన్నారు.