Yadagirigutta MMTS Rail: MMTS సేవలను ఘట్ కేసర్ నుంచి యాదగిరిగుట్ట వరకు పెంచేందుకు 2016లో కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అంతేకాదు, తన వాటా కింద ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను మంజూరు చేయకపోవడం వల్ల ఈ పనులు నిలిచిపోయినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వే మంత్రి తాజాగా సమాధానం ఇచ్చారు.
రూ. 412 కోట్ల వ్యయంతో రైల్వే ప్రాజెక్టు విస్తరణ
ఘట్కేసర్ నుంచి యాదాద్రి వరకు 33 కి.మీ. మార్గాన్ని కవర్ చేసే ఈ ప్రాజెక్టుకు రూ. 412 కోట్ల వ్యయంతో కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా తన వాటా నిధులను జమ చేయలేదు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. తాజాగా హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట వరకు MMTS పనులు ఎప్పటి వరకు పూర్తయ్యే అవకాశం ఉందో చెప్పాలని ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టుతో యాదాద్రి వాసులకు ఉద్యోగ అవకాశాలు కలగడంతో పాటు ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ ప్రశ్నకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక సమాధానం చెప్పారు. ప్రాజెక్ట్ పురోగతి, ఆర్థిక స్థితి గురించి వివరించారు.
రైల్వే మంత్రి ఏం చెప్పారంటే?
ఘట్ కేసర్ నుంచి యాదగిరిగుట్ట వరకు MMTS పనులను 1:2 నిష్పత్తిలో రైల్వే మంత్రిత్వశాఖ, తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందన్నారు అశ్విని వైష్ణవ్. 2016లో MMTS ప్రాజెక్టును ప్రారంభించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద చెల్లించాల్సిన రూ. 279 కోట్లు ఇంకా చెల్లించలేదన్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం 2016లోనే నిధులు మంజూరు చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా నిధులు చెల్లించకపోవడంతో ప్రాజెక్టు పెండింగ్లో ఉందని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులను జమ చేస్తే పనులు పూర్తవుతాయని వెల్లడించారు. అయితే, కేంద్ర ప్రభుత్వం పూర్తి నిధులతో ఘట్కేసర్- యాదగిరిగుట్ట MMTS ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని ఎంపీ చామల కోరారు.
గత MMTS పనులు పూర్తి
హైదరాబాద్, సికింద్రాబాద్ మధ్య MMTS ప్రాజెక్ట్ ను మొదట రూ.1,169 కోట్లతో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. దీనిని కాస్ట్ షేరింగ్ బేసిస్ న నిర్మించారు. తెలంగాణ ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖ కంటే రెండింతలు మొత్తాన్ని 1:2 నిష్పత్తిలో అందించింది. మొత్తం విస్తరణ మార్చి 2024లో ప్రారంభించబడింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం రూ.279 కోట్లు చెల్లించాల్సి ఉంది.
మొత్తం 82 కి.మీ పరిధిలో MMTS విస్తరణ
ఇప్పటి వరకు MMTS విస్తరణ 82 కి.మీ పరిధిలో పూర్తయ్యింది.
1.ఘట్కేసర్ – మౌలా అలీ సి క్యాబిన్ క్వాడ్రప్లింగ్ (12 కి.మీ)
2.తెల్లాపూర్ – రామచంద్రపురం కొత్త లైన్ (5 కి.మీ)
3.మేడ్చల్ – బోల్లారం డబ్లింగ్ (14 కి.మీ)
4.ఫలక్‌నుమా – ఉమ్దానగర్ డబ్లింగ్ (14 కి.మీ)
5.సనత్‌నగర్ – మౌలా అలీ సి క్యాబిన్ బైపాస్ లైన్ డబ్లింగ్ (22 కి.మీ)
6.సికింద్రాబాద్ – బోలారం విద్యుదీకరణ (15 కి.మీ)
యాదగిరిగుట్ట MMTS లైన్‌లో జాప్యానికి కారణాలు
ఈ ప్రాజెక్టు 2016లో మంజూరు చేయబడినప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం నుండి ఆర్థిక సహకారం లేకపోవడం వల్ల ఘట్కేసర్-యాదాద్రి రైలు మార్గం ముందుకు సాగలేదు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు జమ చేయకపోవడంతో ఈ ప్రాజెక్ట్ నిలిచిపోయిందని మంత్రి అశ్విని వైష్ణవ్ ధృవీకరించారు.
Read Also: సరస్వతి పుష్కరాలకు ప్రత్యేక రైలు.. కేవలం తెలుగువారి కోసమే, ఎక్కడెక్కడ ఆగుతుందంటే?