Sankranti 2027 Train Tickets: సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్న హైదరాబాద్ వాసులకు బ్యాడ్ న్యూస్. పండుగకు ఇంకా రెండు నెలల సమయం ఉన్నప్పటికీ, హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో టికెట్లు దొరకడం కష్టంగా మారింది. ముఖ్యంగా జనవరి 11, 12, 13 తేదీల్లో ప్రయాణించాలనుకునే వారికి నిరాశే ఎదురవుతోంది. చాలా రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ వందల్లో ఉండగా, మరికొన్ని రైళ్లలో ఏకంగా ‘రిగ్రెట్’ (Regret) స్టేటస్ కనిపిస్తోంది.
రైల్వే నిబంధనల ప్రకారం ప్రయాణానికి 60 రోజుల ముందే రిజర్వేషన్ చేసుకునే అవకాశం ఉంది. అయితే, సంక్రాంతి రద్దీ కారణంగా బుకింగ్స్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే సీట్లు నిండిపోయాయి. సికింద్రాబాద్, హైదరాబాద్, మహబూబ్‌నగర్ నుంచి బయలుదేరే రైళ్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఖమ్మం, విజయవాడ, రాజమహేంద్రవరం, కాకినాడ, నరసాపురం, విశాఖపట్నం, శ్రీకాకుళం, నెల్లూరు, తిరుపతి వెళ్లే ప్రయాణికులకు టికెట్ల కొరత ఎక్కువగా ఉంది.
ఈసారి స్లీపర్ క్లాస్‌తో పాటు ఏసీ కోచ్‌లలో కూడా రిజర్వేషన్లు వేగంగా నిండిపోతున్నాయి. విశాఖపట్నం దురంతో, గరీబ్ రథ్ లాంటి రైళ్లలోనూ టికెట్లకు తీవ్ర కొరత ఏర్పడింది. వందే భారత్ రైళ్లకు కూడా డిమాండ్ ఏమాత్రం తగ్గడం లేదు. జనవరి 10, 12, 13 తేదీల్లో కొన్ని సర్వీసులకు వెయిటింగ్ లిస్ట్ 100 నుంచి 270 వరకు ఉన్నట్లు సమాచారం. గౌతమి, నారాయణాద్రి, శబరి, కోణార్క్, విశాఖ, గోదావరి, నరసాపూర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
అన్ని రైళ్లలోనూ ఇదే పరిస్థితి లేదు. కృష్ణ ఎక్స్‌ప్రెస్‌లో జనవరి 9, 10, 11 తేదీలకు టికెట్లు అందుబాటులో ఉండగా, 12, 13 తేదీలకు వెయిటింగ్ లిస్ట్ చూపిస్తోంది. మరోవైపు హైదరాబాద్ నుంచి నల్లగొండ, గుంటూరు మీదుగా తిరుపతి వెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో జనవరి 8 నుంచి 13 వరకు టికెట్లు అందుబాటులో ఉన్నట్లు సమాచారం. ప్రయాణికులు తమ ప్రయాణ తేదీలను బట్టి రైల్వే రిజర్వేషన్ వెబ్‌సైట్‌లో కరెంట్ స్టేటస్ చెక్ చేసుకోవాలి.
ప్రతి సంక్రాంతికి హైదరాబాద్ నుంచి వేలాది మంది ఆంధ్రప్రదేశ్, ఒడిశాలోని తమ స్వస్థలాలకు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ముందుగానే ప్రత్యేక రైళ్లను ప్రకటించాలని ప్రయాణికులు కోరుతున్నారు. అదనంగా జన సాధారణ్ రైళ్లను కూడా నడిపితే సాధారణ ప్రయాణికులకు కొంత ఉపశమనం లభిస్తుందని అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు రైళ్లలో టికెట్లు దొరకకపోవడంతో చాలామంది బస్సులు, ప్రైవేట్ వాహనాల వైపు చూస్తున్నారు. అయితే, సంక్రాంతి సమయంలో బస్సులకూ డిమాండ్ పెరిగి టికెట్ ధరలు అధికమయ్యే అవకాశం ఉంది. దీంతో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఈసారి ప్రయాణం ఖర్చుతో పాటు కష్టంగానూ మారేలా కనిపిస్తోంది.
Read Also: బ్రేకులు ఫెయిలైనా 463 కి.మీ. ప్రయాణం.. వందే భారత్ లో ఇంత నిర్లక్ష్యమా?