Vietnam Love Market| ప్రేమించిన వ్యక్తితో పెళ్లి కాలేదని జీవితాంతం బాధపడాల్సిందేనా? కనీసం ఒక్కసారైనా వారిని కలుసుకుని పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకోవచ్చా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. వియత్నాంలోని ఓ ప్రాంతంలో ఇదే సంప్రదాయం కొనసాగుతోంది. ఇక్కడ మాజీ ప్రేమికులు ఏటా ఒకసారి కలుసుకుంటారు. పెళ్లయినవారు కూడా తమ తొలిప్రేమను గుర్తుచేసుకుంటూ ఈ వేడుకలో పాల్గొంటారు. అయితే, ఈ కలయికలు ప్రస్తుత వైవాహిక జీవితానికి ఇబ్బంది కలిగించవు. ఇంతకీ ఈ వింత సంప్రదాయం వెనుక కారణం ఏమిటో తెలుసుకుందాం.
వియత్నాం ఉత్తర ప్రాంతంలోని హా జియాంగ్లో ‘ఖావు వై’ లవ్ మార్కెట్ జరుగుతుంది. సాధారణ మార్కెట్లలో వస్తువులు కొనుగోలు చేస్తారు. కానీ ఇక్కడికి వచ్చే చాలామంది తమ మాజీ ప్రేమికులను కలుసుకోవడానికే వస్తారు. వివిధ తెగలకు చెందిన ప్రజలు ఈ వేడుకలో పాల్గొంటారు. కొందరు ఎన్నో ఏళ్ల తర్వాత తమ పాత ప్రేమికులను కలుస్తారు. మరికొందరు కొత్త పరిచయాలు చేసుకుంటారు. ఈ కార్యక్రమం స్థానిక సంస్కృతిలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
‘ఖావు వై’ లవ్ మార్కెట్ ప్రారంభం వెనుక ఓ ఆసక్తికరమైన ప్రేమకథ ఉందని స్థానికులు చెబుతారు. వేర్వేరు తెగలకు చెందిన ఓ యువకుడు, యువతి ప్రేమలో పడ్డారు. అయితే వారి కుటుంబాలు, సామాజిక పరిస్థితులు ఈ ప్రేమకు అడ్డుగా నిలిచాయి. పెళ్లి చేసుకోవడం సాధ్యం కాకపోవడంతో ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. కానీ ఒకరికొకరు దూరమైనా, ఏటా ఒక్కసారి కలుసుకోవాలని మాట ఇచ్చుకున్నారు. అందుకోసం ‘ఖావు వై’ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. వారి ఈ కలయిక క్రమంగా స్థానిక సంప్రదాయంగా మారిందని ఓ కథనం ప్రచారంలో ఉంది. అయితే, ఈ కథకు సంబంధించిన విభిన్న రూపాలు కూడా ఉన్నాయి.
ఈ మార్కెట్ కేవలం ప్రేమలో ఉన్నవారికే పరిమితం కాదు. పెళ్లయినవారు కూడా తమ పాత ప్రేమికులను కలుసుకోవడానికి ఇక్కడికి వస్తారు. కొన్నిసార్లు వారి జీవిత భాగస్వాములు కూడా తోడుగా వస్తారు. అంతా క్యాజువల్ కలుసుకుంటారు. ఈ కలయికలను ప్రస్తుత బంధాలకు ముప్పుగా కాకుండా, పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకునే సందర్భంగా చూస్తారు. అలాగే, పెళ్లికాని యువతీయువకులు కూడా ఈ వేడుకలో పాల్గొంటారు. కొత్త పరిచయాలు పెంచుకోవడానికి ఇది వారికి ఓ అవకాశంగా ఉంటుంది.
Also Read: ఇల్లు షిఫ్ట్ చేస్తుండగా వస్తువులు మాయం.. ఏసీ, టీవీ ధ్వంసం.. మూవర్స్, ప్యాకర్స్కు భారీ జరిమానా
‘ఖావు వై’ మార్కెట్కు గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం స్థిరమైన తేదీ ఉండదు. చంద్రమాన క్యాలెండర్లో మూడో నెల 27వ రోజున ఈ వేడుక నిర్వహిస్తారు. సాధారణంగా ఈ తేదీ ఏప్రిల్ లేదా మే నెలల్లో వస్తుంది.
Also Read: రైల్లో మీ వస్తువులు లేదా లగేజీ మర్చిపోతే ఏం చేయాలి? తిరిగి పొందడానికి వెంటనే ఇలా చేయండి
2021లో వియత్నాం సాంస్కృతిక శాఖ ‘ఖావు వై’ సంప్రదాయానికి నేషనల్ ఇంటాజిబుల్ కల్చరల్ హెరిటేజ్గా గుర్తింపు ఇచ్చింది. ఈ వేడుక స్థానిక చరిత్ర, సంస్కృతికి ప్రతీకగా నిలుస్తోంది.
ప్రేమ, జ్ఞాపకాలు, మానవ సంబంధాలకు ప్రత్యేక స్థానం ఇచ్చే ఈ సంప్రదాయం పర్యాటకులను కూడా ఆకర్షిస్తోంది. పాత ప్రేమను గౌరవిస్తూ ప్రస్తుత జీవితాన్ని కొనసాగించవచ్చనే భిన్నమైన ఆలోచనకు ప్రపంచం దృష్టికి తీసుకువచ్చింది.