Pamban Railway Bridge Incident: సముద్రం మధ్యలో నిర్మించిన పంబన్ రైల్వే బ్రిడ్జిపై వరుసగా రెండు విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. వేర్వేరు రైళ్లలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అకస్మాత్తుగా సముద్రంలోకి దూకేశారు. ఈ ఘటనల్లో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరో మహిళ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండు రోజుల వ్యవధిలో జరిగిన ఈ ఘటనలు స్థానికంగా కలకలం రేపాయి.
శనివారం రాత్రి రామేశ్వరం నుంచి మధురై వెళ్తున్న ప్యాసింజర్ రైలు పాంబన్ రైలు వంతెనపై ప్రయాణిస్తోంది. ఆ సమయంలో రైలులో ఉన్న ఓ యువకుడు అకస్మాత్తుగా సముద్రంలోకి దూకేశాడు. ప్రయాణికులు ఈ విషయాన్ని గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే గాలింపు చర్యలు ప్రారంభించారు. అయితే, రాత్రి సమయం కావడంతో యువకుడి ఆచూకీ గుర్తించడం కష్టంగా మారింది.
ఆదివారం ఉదయం పాంబన్‌లోని ముల్లిమునై ప్రాంతం సమీపంలో సముద్ర తీరానికి ఓ యువకుడి మృతదేహం కొట్టుకొచ్చింది. సమాచారం అందుకున్న మెరైన్ పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు పాంబన్ వంతెనపై నుంచి దూకిన యువకుడేనా? అనే విషయాన్ని నిర్ధారించేందుకు పోలీసులు విచారణ చేపట్టారు. అతడి పేరు, స్వస్థలం తదితర వివరాలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.
అటు ఆదివారం ఉదయం మరో ఘటన చోటుచేసుకుంది. కేరళలోని పాలక్కాడ్ నుంచి రామేశ్వరం వైపు వస్తున్న అమృత ఎక్స్‌ప్రెస్ రైలు పాంబన్ వంతెనపై ప్రయాణిస్తున్న సమయంలో ఓ మహిళ అకస్మాత్తుగా రైలు నుంచి సముద్రంలోకి దూకింది. ఆమె సముద్రంలో పడే సమయంలో వంతెన గోడకు బలంగా తగలడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయాన్ని గుర్తించిన రైల్వే పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.
తీవ్ర గాయాలతో ఉన్న మహిళను పోలీసులు రక్షించి రామనాథపురం ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు అక్కడ చికిత్స అందిస్తున్నారు. మహిళ అపస్మారక స్థితిలో ఉండటంతో ఆమె పేరు, ఇతర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
పాంబన్ రైలు వంతెనపై వరుసగా జరిగిన ఈ రెండు ఘటనలు రైల్వే, పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఒకే ప్రాంతంలో వేర్వేరు రైళ్ల నుంచి ఇద్దరు ప్రయాణికులు సముద్రంలోకి దూకడం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
#SHOCKING: Woman Jumps From Moving Train Into Sea While Crossing Pamban Bridge
A woman passenger was seriously injured after jumping from a moving train while it was crossing the new Pamban Railway Bridge in Tamil Nadu on November 15, 2026.
Interestingly, this was the second… pic.twitter.com/T8Z8PfF3WH
— upuknews (@upuknews1) November 15, 2026
Read Also: రైల్లో తాగుబోతు వీరంగం.. మైనర్ బాలికలతో అసభ్య ప్రవర్తన, వీపు చింతపండు చేసిన ప్రయాణికులు!