Railway Track Blast: రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్ రైల్వే ట్రాక్ పేలుడు కేసులో భద్రతా దళాలు పురోగతి సాధించాయి. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఒక యువతి సహా ఇద్దరు నిందితులను పంజాబ్‌లో అరెస్ట్ చేశారు. రాజస్థాన్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ (ATS), శ్రీగంగానగర్ – పంజాబ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో 21 ఏళ్ల మహక్‌దీప్ కౌర్, 22 ఏళ్ల దవీందర్ సింగ్ పట్టుబడ్డారు.
నిందితురాలు మహక్‌దీప్ కౌర్ పాకిస్థాన్‌కు చెందిన ఇద్దరు హ్యాండ్లర్లతో నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు పోలీసుల విచారణలో తేలింది. ‘చాచా’, ‘షా’ అనే పేర్లతో ఉన్న ఆ ఇద్దరు వ్యక్తులు కౌర్‌తో ప్రేమగా మాట్లాడుతూ డబ్బు ఆశ చూపి తమ ఉచ్చులోకి లాగారని పోలీసులు వెల్లడించారు. పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ (ISI) ఇటీవల కాలంలో అమాయక మహిళలను ఇలాగే వలలో వేసుకుంటోందని అధికారులు తెలిపారు. గతంలో గంగానగర్‌కు చెందిన బబిత అనే మహిళను కూడా ఐఎస్ఐ ఇదే తరహాలో ట్రాప్ చేసినట్లు పోలీసులు గుర్తుచేశారు.
కాగా మహక్‌దీప్ కౌర్ భర్త డ్రగ్స్ కేసులో జైలుకు వెళ్లడంతో ప్రస్తుతం ఆమె ఒంటరిగా ఉంటోంది. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకున్న పాక్ హ్యాండ్లర్లు ఆమెకు డబ్బు పంపించి, రైల్వే ట్రాక్‌పై పేలుడు జరిపేలా ప్రేరేపించారని దర్యాప్తులో స్పష్టమైంది. అరెస్ట్ సమయంలో నిందితురాలి వద్ద నుంచి రెండు ఆయుధాలు, 46 తూటాలు, రూ.30,000 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరితో పాటు నిందితులకు ఆశ్రయం కల్పించడం, బైక్ సమకూర్చడం, ఘటనా స్థలానికి వెళ్లడానికి రవాణా సదుపాయం అందించారనే అనుమానంతో మరో ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Also Read: ప్రేమ కాటుకు బలైన సుస్మిత.. మృతదేహానికి చెట్టుతో పెళ్లి.. అసలేం జరిగిందంటే?
నవంబర్ 3వ తేదీ రాత్రి 9:45 గంటల ప్రాంతంలో రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్ జిల్లా రామ్‌సింగ్‌పూర్ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ట్రాక్ దెబ్బతినడంతో పాటు అక్కడ సుమారు 2.5 అడుగుల లోతైన గొయ్యి ఏర్పడింది. అయితే ఈ పేలుడు జరగడానికి సరిగ్గా 75 నిమిషాల ముందే అదే ట్రాక్‌పై నుంచి అనూప్‌గఢ్-సూరత్‌గఢ్ ప్యాసింజర్ రైలు వెళ్లడంతో ప్రాణనష్టం తప్పింది.
Also Read: స్పామ్ కాల్స్ లొల్లి.. జియో vs ఎయిర్‌టెల్ vs వీఐ.. ట్రాయ్ షాకింగ్ రిపోర్ట్!