Secunderabad Railway Station : సికింద్రాబాద్ రైల్వే జంక్షన్. తెలుగు రాష్ట్రాల ప్రజలపై చెదరని ముద్ర వేసిన స్టేషన్. మిని ఇండియాలాంటి హైదరాబాద్‌కు కీలకమైన రైల్వే కూడలి. 150 ఏళ్లకు పైగా. నిజాం కాలంలో ప్రారంభమై.. ఈ రోజు భారత రైల్వేలలో అత్యంత రద్దీగా ఉండే జంక్షన్‌లలో ఒకటిగా నిలిచింది. 2025 ఫిబ్రవరి నుంచి ఆధునికీకరణ పనుల కొనసాగుతున్నాయి. రూ.700 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలతో కొత్త స్టేషన్ నిర్మాణం వేగంగా జరుగుతోంది. 2026 చివరి నాటికి పనులు పూర్తవుతాయని అంచనా. అప్పుడిక సరికొత్త సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆవిష్కృతం అవడం పక్కా.
అంతర్జాతీయ విమానాశ్రయం తరహాలో ప్రస్తుతం డెవలప్‌మెంట్ పనులు జరుగుతున్నాయి. 400 కార్ల సామర్థ్యంతో మల్టీ-లెవల్ పార్కింగ్, లగేజీ స్క్రీనింగ్ మిషన్లు, ఎస్కలేటర్లు, ఏసీ వెయిటింగ్ హాల్స్ వంటి సౌకర్యాలు ఏర్పాటవుతున్నాయి. రూ.700 కోట్లతో సికింద్రాబాద్ స్టేషన్ ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్‌గా మారనుంది. ఇది హైదరాబాద్‌కు గర్వకారణంగా నిలువనుంది.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రత్యేకతలు:
దక్షిణ మధ్య రైల్వే జోన్‌లోని ఈ జంక్షన్, భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు రైళ్ల ద్వారా అనుసంధానించారు. రోజూ 35 రైళ్లు ఇక్కడ నుండి బయలుదేరుతాయి, 35 రైళ్లకు ఇది గమ్యస్థానంగా ఉంది. 88 రైళ్లు ఇక్కడ హాల్ట్ చేస్తాయి. 10 ప్లాట్‌ఫారమ్‌లతో విశాలంగా, నిత్యం రద్దీగా ఉంటుంది.
ఎంఎంటీఎస్ ఇంటర్‌చేంజ్:
హైదరాబాద్ ఎంఎంటీఎస్ (మల్టీ-మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్) లోని నాలుగు రైలు మార్గాలకు అనుసంధానం కలిగిన ఏకైక స్టేషన్ ఇది. అలాగే, హైదరాబాద్ మెట్రో రైల్ మార్గాలు (మార్గం-2, మార్గం-3) దీని సమీపంలో ఉన్నాయి. టికెట్ బుకింగ్, పార్శిల్, సామాను నిర్వహణ, ప్లాట్‌ఫారం రైలు నిర్వహణలో నాణ్యత కోసం ఐఎస్‌ఓ-9001 సర్టిఫికేషన్ పొందింది.
నిజాంల వైభవం.. హైటెక్ హంగులు..
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అడుగుపెడితేనే ఆనాటి నిజాం కాలపు వైభవం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. స్టేషన్ భవనం, కోట లాంటి నిర్మాణంతో, హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాల్లో పర్యాటక ఆకర్షణగా నిలిచింది. కానీ, ఇప్పుడు అభివృద్ధి పనులతో హైటెక్ హంగులను అద్దుకుంటోంది ఈ బిల్డింగ్.
నిజాం కాలంలో ఆవిర్భావం
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చరిత్ర 19వ శతాబ్దంలో ఆరంభమైంది. 1870లో హైదరాబాద్ రాష్ట్రాన్ని పాలించిన ఆరవ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో ఈ స్టేషన్ నిర్మాణం ప్రారంభమైంది. బ్రిటిష్ పాలనలో భాగంగా హైదరాబాద్‌ను గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే (జీఐపీఆర్) ద్వారా కర్ణాటకలోని వాడి జంక్షన్‌తో అనుసంధానించేందుకు నిజాం ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది. 1874 అక్టోబర్ 9న సికింద్రాబాద్-వాడి రైలు మార్గం పూర్తయింది. అదే రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అధికారికంగా ప్రారంభమైంది.
Also Read : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో కొత్తగా అందుబాటులోకి వచ్చే వసతులు ఇవే..
సికింద్రాబాద్ స్టేషన్ నిజాం గ్యారెంటీడ్ స్టేట్ రైల్వే (ఎన్‌జీఎస్‌ఆర్)లో భాగంగా నిర్మించబడింది. 1916లో కాచిగూడ రైల్వే స్టేషన్ ప్రారంభమయ్యే వరకు.. సికింద్రాబాద్ స్టేషన్ నిజాం రైల్వేలకు ప్రధాన కేంద్రంగా ఉండేది. 1951లో ఎన్‌జీఎస్‌ఆర్ జాతీయం చేయబడినప్పుడు, ఈ స్టేషన్ భారతీయ రైల్వేల దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో భాగమైంది.
నిర్మాణం మరియు నిర్మాతలు:
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిర్మాణం నిజాం ప్రభుత్వం ఆర్థిక సహాయంతో జరిగినప్పటికీ, బ్రిటిష్ ఇంజనీర్లు దీని రూపకల్పన, నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. స్టేషన్ భవనం అసఫ్ జహీ (నిజామీ) నిర్మాణ శైలితో ఉంటుంది. ఇది హైదరాబాద్ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రధాన మంటపం, కోట లాంటి నిర్మాణం, స్థానిక కళాకారుల చేతివృత్తిని ప్రదర్శిస్తూ, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. గత వైభవం ఇక చరిత్రలో కలిసిపోనుంది.