Indian Railways: గత కొద్ది కాలంగా రైళ్లలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. తాజాగా మరోసారి దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. నిన్న (జూలై 28న)తెల్లవారుజామున ఏసీ కోచ్ లను టార్గెట్ చేశారు. ప్రయాణీకుల మీద మత్తు మందు స్ప్రే చేసి, అందినకాడికి దోచుకెళ్లారు. ఈ ఘటన వెస్ట్ బెంగాల్ లోని మాల్దా రైల్వే డివిజన్ హౌరా-న్యూ జల్ పైగురి లైన్ లో జరిగింది.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
సోమవారం తెల్లవారుజామున మాల్డా టౌన్ కు వెళ్లే గౌర్ ఎక్స్ ప్రెస్ లోని AC-II టైర్, AC-ఫస్ట్ క్లాస్ కోచ్ లలో దోపిడీ జరిగింది. దొంగల ముఠా ఏడుగురు ప్రయాణీకుల వస్తువులతో పాటు బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. అనుకున్నట్లుగానే దొంగల ముఠా మల్డాకు వెళ్లడానికి కొద్ది కిలో మీటర్ల దూరంలో రెండు కోచ్ లో మత్తు పదార్థాన్ని స్ర్పే చేశారు. దొంగలు ప్రయాణీకులను నిద్రపోయేలా చేశారు. నిద్రపోయేలా చేసే ఏదో స్ప్రే చేశారని అనుమానిస్తున్నట్లు బాధిత ప్రయాణికులు తెలిపారు. మాల్దా స్టేషన్ కు వెళ్లగానే ప్రయాణీకులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రైల్వే పోలీసులు పోలీసులు ఏం చెప్పారంటే?
అటు ఈ ఘటనపై మాల్డా టౌన్ గవర్నమెంట్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ మొదలు పెట్టారు. ఈ సంఘటన రైలు ప్రయాణికుల భద్రతపై, ముఖ్యంగా ప్రీమియం కోచ్ లలో భద్రతపై ప్రయాణీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. “ప్రయాణీకులు చెప్పిన వివరాల ప్రకారం తెల్లవారుజామున 3 గంటల అంతా మామూలుగానే ఉంది. ఆ తర్వాత చాలా మంది ప్రయాణీకులు నిద్రపోయారు. వారు మేల్కొని చూసే సరికి బ్యాగులు, బంగారు ఆభరణాలు లేవు. స్టేషన్ కు రైలు వచ్చి ఆగిన వెంటనే ప్రయాణీకులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని విచారణ మొదలు పెట్టాం” అని పోలీసులు తెలిపారు.
ప్రయాణీకులు ఏమన్నారంటే?
ప్రయాణీకులలో ఇద్దరు టీచర్లు అయిన పృథ్వీరాజ్ రాయ్, అనుశ్రీ భట్టాచార్జీ దంపతులు తమ సెల్ ఫోన్లు, వాచ్ లు,డబ్బులు, క్రెడిట్ కార్డులు దొంగిలించబడినట్లు వెల్లడించారు. “దొంగలు ఏదో స్ప్రే చేసి ప్రయాణికులందరూ నిద్రపోయేలా చేశారని మేము అనుమానిస్తున్నాము. మేం రైలులోని A-2 కోచ్ లో ఉన్నాము. నిద్రపోయే ముందు.. కొంతమంది వ్యక్తులు కోచ్ లో అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించారు. బహుశా వాళ్లే ఈ దొంగతనానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నాం” అని” రాయ్ తెలిపారు. అటు రైలులోని H-1 కోచ్ లో ప్రయాణిస్తున్న మహిళా డాక్టర్ తెల్లవారుజామున టాయిలెట్‌కి వెళ్లింది. ఆమె తిరిగి వచ్చే సరికి తన బ్యాగ్ ఖాళీగా ఉన్నట్లు గుర్తించింది. మరికొందరు తమ ల్యాప్ టాప్ లు, నగదు, ఇతర విలువైన వస్తువులను పోగొట్టుకున్నారు. ప్రస్తుతం కేసు విచారణ జరుగతుందని పోలీసులు తెలిపారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామన్నారు.
Read Also: ఇండియాలో ఈ రైళ్లు ఎక్కాలంటే ఆస్తులు అమ్ముకోవాలి.. ఒక్క టికెట్ ధర ఎంతో తెలుసా?