Indian Railways: భారతీయ రైల్వే ప్రయాణీకులకు అత్యంత విలాసవంతమైన ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నది. ముఖ్యంగా ఆయా పర్యాటక ప్రదేశాలను సందర్శించాలనుకునే వారికి లగ్జరీ ప్రయాణ అనుభవాన్ని అందిస్తోంది. అయితే, ఈ రైళ్లలో ప్రయాణించడం సామాన్యులకు సాధ్యమయ్యే పని కాదండోయ్. ఇంతకీ ఆ లగ్జరీ రైళ్లు ఏవంటే..
⦿ మహారాజాస్ ఎక్స్ ప్రెస్
దేశంలో అత్యంత విలాసవంతమైన రైలు ఇది. ఈ రైల్లో ప్రయాణించే వారు మహా రాజుల మాదిరిగా సేవలను పొందే అవకాశం ఉంటుంది. అందమైన ప్రదేశాల మీదుగా ఈ రైలు కదులుతూ ఆహ్లాదకర ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది. విలాసవంతమైన బాత్రూమ్‌లు. అద్భుతమైన ఫైస్టార్ రెస్టారెంట్ భోజనం, నచ్చిన మద్యం తాగేలా బార్ ఉంటుంది. ఈ రైలు ప్రయాణంలో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా గుర్తించిన పలు ప్రసిద్ధ ప్రదేశాలను సందర్శించవచ్చు. ఈ రైలు టూర్ 3 నుంచి 7 రోజుల పాటు ఉంటాయి. రాజస్థాన్, మిడిల్ ఇండియా మీదుగా ఈ రైలు ప్రయాణం కొనసాగుతుంది. ఎంచుకున్న ట్రిప్, రూమ్ రకాన్ని బట్టి ధరలు ఉంటాయి. ప్రెసిడెన్షియల్ సూట్ లో ప్రయాణించాలంటే టికెట్ ధర సుమారు రూ. 12 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.
⦿ ప్యాలెస్ ఆన్ వీల్స్
ప్యాలెస్ ఆన్ వీల్స్ రైల్లో కూడా రాయల్టీగా ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ఈ ప్రసిద్ధ రైలును ఒకప్పుడు వివిధ రాష్ట్రాల రాజులు ఉపయోగించారు. ఇప్పుడు అదే తరహాలు ఈ రైలు కోచ్ లు ఉంటాయి. ఈ రైలు పలు ప్రముఖ ప్రాంతాలను కవర్ చేస్తుంది. అద్భుతమైన సర్వీసు, చక్కటి క్యాబిన్లు, రుచికరమైన భోజనం లభిస్తుంది. ఈ రైలు ప్రయాణం సుమారు వారం రోజుల పాటు ఉంటుంది. జైపూర్, ఉదయపూర్, జైసల్మేర్, ఆగ్రా లాంటి పెద్ద నగరాలను కవర్ చేస్తుంది. చారిత్రక కోటలు, రాజభవనాలు, తాజ్ మహల్ అందాలు చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు. క్యాబిన్ రకాన్ని బట్టి టికెట్ ధరలు రూ. 8 నుంచి 12 లక్షల వరకు ఉంటుంది.
⦿ డెక్కన్ ఒడిస్సీ
ఈ రైలు కూడా దేశంలోని అద్భుతమైన నగరాలను సందర్శించే అవకాశాన్ని కల్పిస్తుంది. మహారాష్ట్ర చారిత్రక గతాన్ని, గుజరాత్ అందాలు సహా దేశంలోని ప్రాంతాలను అన్వేషించేలా ఈ రైలు ఉపయోగపడుతుంది. ఈ రైలులో చక్కని క్యాబిన్‌లు, స్పా, చక్కటి ఫుడ్ లభిస్తుంది. ప్రయాణ మార్గంలో పురాతన గుహలు, గొప్ప కోటలు, రద్దీగా ఉండే మార్కెట్లను చూసే అవకాశం ఉంటుంది. చూస్తారు. మీరు ఎంచుకునే ట్రిప్, క్యాబిన్ ను బట్టి టికెట్ ధర రూ. 4 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.
⦿ గోల్డెన్ చారియట్
సౌత్ ఇండియాలోని ప్రసిద్ధ ప్రదేశాలను చూడాలంటే ఈ లగ్జరీ రైలు బెస్ట్. ఈ రైలు కర్ణాటక, కేరళ, తమిళనాడు లాంటి రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉంటుంది. విశాలమైన క్యాబిన్లు, అద్భుతమైన భోజనం, చారిత్రక ప్రదేశాలు, వన్యప్రాణుల ప్రాంతాలు, అందమైన దేవాలయాలను చూసి ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది. మీరు ఎంచుకునే క్యాబిన్ ను బట్టి టికెట్ ధర రూ. 4 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.
⦿ రాయల్ రాజస్థాన్ ఆన్ వీల్స్
రాయల్ రాజస్థాన్ ఆన్ వీల్స్ రాజస్థాన్ ను సందర్శించడానికి అనువైన లగ్జరీ రైలు. ప్యాలెస్ ఆన్ వీల్స్ లాగానే గొప్ప ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది. మృదువైన క్యాబిన్లు, ప్రత్యేక భోజనాన్ని ఆస్వాదించే అవకాశం ఉంటుంది. ఈ టూర్ లో రాజస్థాన్ లోని పెద్ద నగరాలైన జైపూర్, జోధ్ పూర్, ఉదయపూర్, రణతంబోర్ వన్యప్రాణుల ప్రదేశాన్ని చూసే అవకాశం ఉంటుంది. ఈ రైలు టికెట్ సుమారు రూ. 9 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.
⦿ ది ఫెయిరీ క్వీన్
మిగతా లగ్జరీ రైళ్లతో పోల్చితే ఇది చిన్నగా ఉంటుంది. 1855లో తయారు చేసిన పురాతనమైన స్టీమ్ రైళ్లలో ఒకటిగా ది ఫెయిరీ క్వీన్ ప్రత్యేక గుర్తింపును పొందింది. ఈ రైలు ప్రయాణం 2 రోజుల పాటు ఉంటుంది. ఇది ప్రయాణీకులను ఢిల్లీ నుండి అల్వార్ కు తీసుకెళుతుంది. సరిస్కా టైగర్ రిజర్వ్ ను చూసే అవకాశం కల్పిస్తుంది. భిన్నమైన లగ్జరీని అనుభవించే అవకాశం ఉంటుంది. ఈ రైలు టికెట్ ధర రూ. 10 వేల నుంచి ప్రారంభం అవుతుంది.
Read Also: రైలులో గొడుగు వేసుకున్న ప్రయాణికుడు.. అతడికి ఏమైంది?