దీపావళి, ఛత్ పూజ లాంటి పండుగలను కుటుంబ సభ్యులతో జరుపుకునేందుకు దేశ వ్యాప్తంగా ప్రజలు తమ సొంత ప్రాంతాలకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో నార్త్, సౌత్ అనే తేడా లేకుండా ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. రైళ్లు ప్రయాణీకులతో కిటకిటలాడుతున్నాయి. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండ భారతీయ రైల్వే దేశ వ్యాప్తంగా 12,011 ప్రత్యేక రైళ్లను నడిపిస్తోంది. ఈ రైళ్లు సెప్టెంబర్ 21 నుంచి నవంబర్ 30 వరకు నడవనున్నాయి.
అటు సౌత్ సెంట్రల్ రైల్వే కూడా హైదరాబాద్ నుంచి పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. తన పరిధిలో మొత్తం 973 ప్రత్యేక రైళ్లను నడిపిస్తోంది. 21 సెప్టెంబర్ నుంచి 30 నవంబర్ వరకు పలు జోన్లకు సంబంధించిన స్పెషల్ ట్రైన్స్ తో కలిపి.. మొత్తం 2,285 రైళ్లు దక్షిణ మధ్య రైల్వే మీదుగా రాకపోకలు కొనసాగించనున్నాయి. గతేడాది.. పండుగ సీజన్ లో 1,924 రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది 19% ఎక్కువగా ప్రత్యేక రైళ్లు దక్షిణ మధ్య రైల్వే మీదుగా ప్రయాణం సాగిస్తున్నాయి. ఈ రైళ్లన్నీ ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల మీదుగా ప్రయాణం సాగిస్తున్నాయి.
21 సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 20 మధ్య నెల రోజుల సమయంలో దక్షిణ మధ్య రైల్వే.. పెరిగిన రద్దీని దృష్టిలో ఉంచుకుని మొత్తం 1,010 ప్రత్యేక రైళ్లను నడిపింది. ఇందులో 399 రైళ్లను జోన్ పరిధిలో నడపగా, 611 రైళ్లను ఇతర జోన్లకు నడిపింది. గత ఏడాదితో పోల్చితే 47% ఎక్కువ రైళ్లు కావడం విశేషం. ఈ సమయంలో రోజు వారీ రైళ్లతో పాటు, స్పెషల్ ట్రైన్స్ సేవలను దాదాపు 5 కోట్ల మంది ప్రయాణీకులు వినియోగించుకున్నారు. గతేడాది ఈ పండుగల సమయంలో 1 అక్టోబర్ నుంచి అక్టోబర్ 31 వరకు దాదాపు 4.5 కోట్ల మంది దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ ట్రైన్స్, రెగ్యులర్ ట్రైన్స్ సేవలను పొందారు. హైదరాబాద్ నగరంలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో రద్దీని నివారించడానికి లింగంపల్లి, హైటెక్ సిటీ, చర్లపల్లి, మల్కాజ్ గిరి వంటి రైల్వేస్టేషన్లలో అదనపు స్టాప్ లను ఏర్పాటు చేశారు అధికారులు. రైల్వేశాఖ అందిస్తున్న సేవల పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: స్లీపర్ క్లాస్ టికెట్ తో ఏసీ కోచ్ ప్రయాణం, రైల్వే క్రేజీ స్కీమ్ గురించి తెలుసా?
రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ రైల్వే స్టేషన్లను, రైళ్లను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. పండుగ వేళ రైల్వే ప్రయాణికులకు అందిస్తున్న సేవల పట్ల వారి అభిప్రాయాలను నేరుగా అడిగి తెలుసుకుంటున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
Read Also: మరో ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభించిన IRCTC, ‘పవిత్ర కాశీ’ ప్యాకేజీ పేరుతో 4 పుణ్యక్షేత్రాల దర్శనం!