South Central Railway: సంక్రాంతి పండుగ నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పలు ప్రత్యేక రైళ్లను ప్రకటించగా, తాజాగా మరో 4 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారిక ప్రకటన విడుదల చేసింది. అయితే.. ఈ రైళ్లు ఏ తేదీన, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాయి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
సంక్రాంతి స్పెషల్ రైళ్ల వివరాలు..
తాజాగా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించిన నాలుగు ప్రత్యేక రైళ్లు.. హైదరాబాద్ లోని కాచిగూడ, చర్లపల్లి స్టేషన్ల నుంచి ఏపీలోని శ్రీకాకుళం రోడ్ స్టేషన్ కు రాకపోకలు కొనసాగిస్తాయి. 07615/07616 నెంబర్ గల ప్రత్యేక రైళ్లు కాచిగూడ నుంచి శ్రీకాకుళం రోడ్ స్టేషన్ మధ్య కొనసాగుతాయి. అటు 07617/07618 నెంబర్ గల రైళ్లు తాజాగా ప్రారంభించిన చర్లపల్లి స్టేషన్ నుంచి శ్రీకాకుళం రోడ్ స్టేషన్ వరకు వెళ్లి వస్తాయి. ఈ నెల 8న చర్లపల్లి నుంచి ఏపీలోని శ్రీకాకుళం రోడ్ స్టేషన్ కు ఓ స్పెషల్ రైలు నడుపుతారు. ఇది సాయంత్రం 7.20కి చర్లపల్లిలో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు శ్రీకాకుళం రోడ్ కు చేరుతుంది. అటు 9న శ్రీకాకుళం రోడ్ స్టేషన్ లో మధ్యాహ్నం 2.45కు బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 6.30కి చర్లపల్లికి చేరుకోనుంది. మరోవైపు ఈ నెల 14, 15 తేదీల్లో కాచికూడ-శ్రీకాకుళం రోడ్ స్టేషన్ కు మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నారు అధికారులు. ఈ రెండు రైళ్లు కాచిగూడలో సాయంత్రం 5.45కి బయల్దేరి, తర్వాతి రోజు ఉదయం 9 గంటలకు శ్రీకాకుళం రోడ్ స్టేషన్ కు చేరుకుంటాయి. అటు ఈనెల 12, 16 తేదీల్లో శ్రీకాకుళం రోడ్ స్టేషన్ లో మధ్యాహ్నం 2.45కు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.35కి కాచికూడకు చేరుకుంటాయి.
ఈ ప్రత్యేక రైళ్లు ఏ స్టేషన్లలో ఆగుతాయంటే?
కాచిగూడ – శ్రీకాకుళం రోడ్ – కాచిగూడ ప్రత్యేక రైళ్లు మల్కాజిగిరి, చర్లపల్లి, నల్లగొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లె స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైళ్లలో అన్ని 3AC కోచ్ లు ఉంటాయి. అటు చర్లపల్లి – శ్రీకాకుళం రోడ్ – చర్లపల్లి ప్రత్యేక రైళ్లు నల్లగొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లె, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లె, పొందూరు స్టేషన్లలో ఆపబడతాయి. ఈ రైళ్లలో 1AC, 2AC, 3AC, స్లీపర్, జనరల్ కోచ్ లు ఉంటాయి.
స్పెషల్ రైళ్ల బుకింగ్ షురూ
ఇక సంక్రాంతికి హైదరాబాద్ నుంచి ఏపీకి బయల్దేరే ప్రత్యేక రైళ్లకు సంబంధించిన బుకింగ్స్ ను అధికారులు ఇప్పటికే ప్రారంభించారు. చాలా మంది ప్రయాణీకులు టికెట్లు బుక్ చేసుకోవడం మొదలు పెట్టారు. తెలంగాణతో పోల్చితే ఏపీకి వెళ్లే ప్రయాణీకులు చాలా ఎక్కువ స్థాయిలో టికెట్లు బుక్ చేసుకుంటున్నారు.
Read Also: కాకినాడ-షిర్డీ ఎక్స్ ప్రెస్ టైమింగ్స్ పై రైల్వే అధికారులు స్పష్టత!