ఆపద సమయంలో ఓ తాతకు వచ్చిన ఆలోచన ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యింది. కంటికి కనిపించకుండా పోవాల్సిన ఊరు.. ఇప్పుడు ప్రసిద్ధ పర్యాటక ప్రాంతంగా మారింది. ఇంతకీ ఆ తాత ఎవరు? ఆయన రంగుల కథ ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఊరిని కూల్చేందుకు డెవలపర్ల ప్రయత్నం
తైవాన్ లోని నాన్టున్ జిల్లాలో ఉన్న రెయిన్ బో విలేజ్ గురించి ఇప్పుడు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఇప్పుడు ఈ ఊరు వరల్డ్ ఫేమస్. దానికి కారణంగా 99 ఏళ్ల వృద్ధుడు హువాంగ్ యుంగ్ ఫు. ఒకప్పుడు ఈ ఊరు 1,200 ఇళ్లతో కళకళలాడేది. కానీ, నెమ్మది నెమ్మదిగా.. ఇక్కడి కుటుంబాలు సమీప పట్టణానికి వెళ్లడం మొదలుపెట్టాయి. ఊరంతా ఖాళీ అవుతూ వచ్చింది. చివరకు 11 ఇళ్లు మిగిలాయి. ఈ నేపథ్యంలో ఊరిని కూల్చేసి ఈ భూమిలో కొత్త నిర్మాణాలు చేపట్టాలని కొంతమంది డెవలపర్లు ప్రయత్నించారు. ఊరిలో ఉన్న యజమానులకు ఎంతో కొంత డబ్బులు ఇచ్చి తమ ఆధీనంలోకి తీసుకోవడం మొదలు పెట్టారు.
ఊరును కాపాడుకునేందుకు వృద్ధుడి వినూత్న ప్రయత్నం
అందరి లాగే ఊరిలో నివాసం ఉంటున్న 11 కుటుంబాల వారికి డబ్బులు ఇచ్చి ఖాళీ చేయించే ప్రయత్నం చేశారు. కానీ, మాజీ సైనికుడు, 99 ఏళ్ల వృద్ధుడు హువాంగ్ యుంగ్-ఫునకు తన ఇల్లు ఖాళీ చేయడం అస్సలు ఇష్టం లేదు. ఎలాగైనా ఈ ఊరిని కాపాడుకోవాలి అనుకున్నాడు. ఏం చేయాలా? అని బాగా ఆలోచించాడు. తమ ఊరికి గుర్తింపు రావాలనుకున్నాడు. అందులో భాగంగానే తన ఇంటిలోపలి భాగంలో అద్భుతమైన రంగులు వేశాడు. నెమ్మదిగా తన ఇంటి బయట కూడా రంగులు వేయడం మొదలు పెట్టాడు. తన ఇల్లుకు రంగు వేయడం పూర్తయిన తర్వాత పొరుగు ఇళ్లకు కూడా రంగులు వేస్తూ వెళ్లాడు. అలా తన గ్రామంలోని చాలా ఇళ్లను రంగులతో అద్భుతంగా తీర్చిదిద్దాడు.
రెయిన్ బో విలేజ్ గా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు
హువాంగ్ యుంగ్-ఫు తన గ్రామాన్ని కాపాడుకునేందుకు చేస్తున్న ప్రయత్నం గురించి సమీపంలోని యూనివర్సిటీకి చెందిన విద్యార్థులకు తెలిసింది. వాళ్లంతా ఆ ఊరికి వెళ్లి ఆయనతో మాట్లాడారు. ఆయన బాధను తెలుసుకున్నారు. ఈ వయసులో తాను ఊరిని వదిలి ఎక్కడికీ వెళ్లలేని, దాన్ని కాపాడుకునేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు. విద్యార్థులు ఆయన వేసిన పెయింటింగ్ ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఆయన బాధను సోషల్ మీడియా ద్వారా అందరికీ చెప్పే ప్రయత్నం చేశారు. ఈ విలేజ్ ఫోటోలు, వీడియోలు బాగా పాపులర్ అయ్యాయి. ఆ ఊరు రెయిన్ బో విలేజ్ గా గుర్తింపు తెచ్చుకుంది. హువాంగ్ యుంగ్-ఫు బాధ ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. ఆ గ్రామాన్ని అలాగే ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ఆ గ్రామం ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంగా గుర్తింపు తెచ్చుకుంది. హువాంగ్ యుంగ్-ఫు ఇప్పుడు రెయిన్ బో తాతగా గుర్తింపు తెచ్చుకున్నారు. తన పుట్టిన ఊరిని కాపాడుకునేందుకు ఆయన చేసిన ప్రయత్నాన్ని అందరూ అభినందిస్తున్నారు. రియల్ ‘గేమ్ ఛేంజర్’ అంటూ ఆ తాతను తెగ పొగిడేస్తున్నారు.
Read Also: ఈ ఊర్లో ఇంటికో మంత్రగాడు, అంతా చేతబడులే చేస్తారు.. ధైర్యం ఉంటేనే వెళ్లండి!