Black Magic Village Mayong: చేతబడి, బాణామతి, మంత్రవిద్య.. ఈ పేరు వింటేనే వెన్నులో వణుకుపుడుతుంది. అదే, ఒక ఊరు ఊరంతా మంత్రగాళ్లతో నిండి ఉంటే? ఊహించడానికే భయంగా ఉందా? కానీ, ఇది నూటికి నూరుపాళ్లు నిజం. మయోంగ్ అనే గ్రామంలో ఇంటికో మంత్రగాడు ఉంటాడు. ఏ ఇంట్లో చూసినా మంత్రాలు చేసిన ఆనవాళ్లే కనిపిస్తాయి. ఏ గుడిసె చూసినా పుర్రెలు, ఏ ఇల్లు చూసినా ఎముకలు, చెట్టూ, పుట్టా ఎక్కడ చూసినా నిమ్మకాయలు, జీడి గింజలే కోకొల్లలుగా దర్శనం ఇస్తాయి. ఈ ఊరును దేశంలోనే చేతబడికి కేరాఫ్ అడ్రస్ గా చెప్తారు.
ఊరంతా తాంత్రిక శక్తితో దిగ్బంధనం
అస్సాంలోని మోరిగావ్ జిల్లా బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉన్న ఒక చిన్న గ్రామం మయోంగ్. ఈ ఊరు పేరు వింటేనే అస్సాం వణికిపోతుంది. ఈ గ్రామానికి వెళ్లాలంటేనే ప్రాణాలు పోయినట్లుగా ఫీలవుతారు. ఈ ఊరు ఊరంతా తాంత్రిక శక్తితో నిండిపోయి ఉందని భావిస్తారు. ఇక్కడ గాలి, నీరు, భూమి, అంతా మాయలతోనే నిండి ఉందంటారు. ఈ ఊరుపేరు కూడా తాంత్రిక శక్తి అనే అర్థం వచ్చేలా ఉంటుంది. మయోంగ్ అనేది సంస్కృత పదం. మాయ నుండి ఉద్భవించిన పదమే మయోంగ్ అని కొందరు అంటారు. దీనికి ‘భ్రమ’ అనే అర్థం ఉందని మరికొంత మంది చెప్తుంటారు.
గాలిలోకి వెళ్లి మాయం..
మంత్ర విద్య నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నవాళ్లు మయోంగ్ గ్రామానికి వస్తారనే ప్రచారం ఉంది. ఇక్కడికి వచ్చి మంత్ర విద్య, బాణామతి, వశీకరణ లాంటి విద్యలను నేర్చుకుంటారట. గతంలో ఇక్కడ పురావస్తుశాఖ త్రవ్వకాల్లో దేశంలోని ఇతర ప్రాంతాలలో నరబలి ఆచారాల సమయంలో ఉపయోగించిన కత్తులు, ఇతర వస్తువులు బయటపడ్డాయి. ఒకప్పుడు మయోంగ్ ప్రజలు తమ మాంత్రిక శక్తులతో గాలిలోకి వెళ్లి అదృశ్యం అయ్యారని, మరికొంత మంది జంతువులుగా మారారని ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో ఇతర ప్రదేశాల నుంచి వచ్చిన వ్యక్తులు ఈ ఊరికి వెళ్లేందుకు భయపడతారు.
ఇప్పటికీ మూలికా వైద్యమే..
ఇక్కడి ప్రజలు ఇప్పటికీ మూలికా వైద్యం మీదే ఆధారపడుతున్నారు. చాలా వ్యాధులకు, పాము కాటుకు మంత్రాల ద్వారానే నయం చేస్తారు. పగిలిన గాజు ముక్కల ద్వారా భవిష్యత్ అంచనాలు వేసే పద్దతి ఇప్పటికీ ఇక్కడ ఉంది. 30 సంవత్సరాల క్రితం వరకు మాయోంగ్‌లో చేతబడి బాగా ఆచరించేవారని పరిసర గ్రామ ప్రజలు చెప్తున్నారు. అప్పట్లో దాదాపు ప్రతి ఇంట్లో ఓ మంత్రగాడు ఉండేవాడట. కానీ, ఇప్పుడు ప్రజల్లో మార్పు వస్తున్నట్లు చెప్తున్నారు. అయితే, ఇప్పటికీ కొంతమంది మంత్రాలు చేస్తారనే ప్రచారం ఉంది. అయితే, తమ మంత్రశక్తులను ఇతరుల ముందు ప్రదర్శించేందుకు ఇష్టపడరు. అలా చేయడం వల్ల తమ మంత్రశక్తులకు ఉన్న శక్తి తగ్గిపోతుందని భావిస్తారు.
ఇక్కడ మంత్ర విద్యకు సంబంధించిన గ్రంథాలతో కూడిన ఒక మ్యూజియం కూడా ఉండటం విశేషం. మయోంగ్ లో ఇప్పటికీ కచారి గిరిజనులను పాలించేందుకు రాజు ఉన్నారు. ఆయనను ఇప్పుడు 40వ రాజుగా స్థానికులు గుర్తించారు.
Read Also: చందమామపై ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయో తెలుసా? మనిషి తట్టుకోగలడా?