Mysterious temples: మీ వెహికల్ తరచూ యాక్సిడెంట్‌కు గురవుతుందా? ఒక్కసారైనా వెళ్లొచ్చారా అటవీ ప్రాంతంలో కొండల మధ్య దాగున్న ఆ దేవాలయానికి? నంబర్ ప్లేట్ మీద ఉన్న అంకెలను అక్కడ రాయడం వల్ల.. ఇకపై ప్రమాదాలు దరిచేరవంటూ భక్తులు చెబుతున్న మాటలు విని ఒక్కసారి మీకూ ఆసక్తి కలగకమానదు. ప్రయాణంలో భద్రత కావాలంటే.. కొండల మద్యలోని ఆ గుహలో ఒక్కసారి అడుగుపెట్టాల్సిందేనని నమ్మే వారు ఎప్పటికప్పుడు పెరిగిపోతున్నారు. అసలు ఈ ఆలయం ఎక్కడుంది? అక్కడ ఏమైపోతుంది? ఎవరు ఈ విశ్వాసానికి ఊపిరినిస్తున్నారు? అనే కధ అంతా తెలియాలంటే.. ఈ కథనం పూర్తిగా చదవండి.
తలుపులమ్మలోవ గుడి.. ఎన్నో విశ్వాసాల గుహ
చాలా మందికి ఇది తెలియకపోవచ్చు. అన్నవరం మీదుగా ప్రయాణించినవారికి ఒక ప్రత్యేకమైన విశ్వాసం ఉన్న గుడి గురించి, అక్కడి విశేషాల గురించి విన్నవారు ఆశ్చర్యపోతారు. ఓ చోట, ఓ గుహలో, రెండు కొండల మధ్యలో వెలసిన దేవత.. తలుపులమ్మ. పేరు వినగానే అమ్మా! అనే మాట వస్తుంది. కానీ ఈ తలుపులమ్మ గుడి చుట్టూ ఉన్న విశ్వాసాలు, ఆచారాలు, భక్తుల భయాందోళనలు అన్నీ కూడా విన్నవారిని ఆశ్చర్యపరుస్తాయి. ఎందుకంటే ఇది కేవలం దేవాలయం మాత్రమే కాదు, నమ్మకాలు, ఆచారాలు, భయాల సమ్మేళనం.
గుహలో వెలసిన తలుపులమ్మ
తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సమీపంలో ఉన్న తలుపులమ్మలోవ గుడి సాధారణ గుడిలా ఉండదు. ఈ ఆలయం 2 పెద్ద కొండల మధ్యలో ఉంటుంది. ఆ మధ్యలో ఉన్న చిన్న గుహలో అమ్మవారు వెలిశారనే నమ్మకం ఉంది. అక్కడికి వెళ్లిన వారు, ఈ గుహకి చేరుకున్నవారు దీపాలు వెలిగిస్తూ, మొక్కులు పెట్టుకుంటూ అమ్మవారిని దర్శిస్తారు. కొండల మధ్య ఆ గుహలో నిలబడితే, ప్రకృతి శబ్దాలతో కలిసిన ఆ గంభీర నిశ్శబ్దం మనసును మంత్రముగ్దం చేస్తుంది.
సాయంత్రం 6 తర్వాత ఎవరూ ఉండరు!
ఈ ఆలయం గురించి మరొక విశేషం ఏమిటంటే.. సాయంత్రం 6 దాటితే ఎవరినీ లోపలికి అనుమతించరు. ఎందుకంటే ఆ సమయంలో అమ్మవారు కొండల మధ్య తిరుగుతారని భక్తుల విశ్వాసం. గుడికి వచ్చే దారిలో పోలీసులు, స్వయంగా భక్తులు కూడా ఈ నిబంధన పాటిస్తారు. ఎప్పుడూ ఎవరూ శీఘ్రంగా బయటకు రావాలనే ఆలోచనలో ఉంటారు.
Also Read: Water Metro: వాటర్ మెట్రో వచ్చేసింది.. ఇక ట్రాఫిక్‌కు గుడ్‌బై.. జర్నీ ప్లాన్ ఇదే!
వెహికల్ నెంబర్లు రాయడం.. ఒక నమ్మకమే కాదు?
ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. కొండపై ఉన్న ప్రతి రాయిపైన వెహికల్ నెంబర్లు రాసి కనిపిస్తాయి. బైకులు, కార్లు, లారీలు.. ఏ వాహనమైనా సరే.. వారి నంబర్లు తెలుపు రంగుతో రాయబడతాయి. ఎందుకంటే ఈ ఆలయం వద్ద వాహన నంబర్ రాస్తే యాక్సిడెంట్లు జరగవన్నది భక్తుల విశ్వాసం. ఈ నమ్మకంతోనే వేలాదిమంది తమ వాహన నంబర్‌ను కొండపై రాయిస్తారు. కొన్నిసార్లు ఇది వాహన భద్రతకు సంబంధించిన ఆధ్యాత్మిక చర్యలా మారుతుంది.
తమ్ముడు పోతురాజు – అక్క తలుపులమ్మ
ఈ గుడిలో అమ్మవారికి పక్కనే ఉన్నారు పోతురాజు. ఆయన అమ్మవారి తమ్ముడని నమ్ముతారు. కుడివైపు రూపు అనే మాత విగ్రహం కూడా ఉంది. వీరంతా స్వయంభువులుగా వెలిశారనే విశ్వాసం భక్తులలో బలంగా ఉంది. ఇక్కడ ప్రతి శివరాత్రికి, పౌర్ణమికి, పండుగ రోజుల్లో భక్తుల తాకిడి మామూలుగా ఉండదు.
ఎక్కడ ఉందంటే?
ఇన్ని విశేషాలతో, ఇన్ని విశ్వాసాలతో ఓ ఆలయం ఉండటం నిజంగా మన ఆశ్చర్యాన్ని కొల్లగొట్టేస్తుంది. ఇది కేవలం దేవాలయం మాత్రమే కాదు.. ఇది భయాన్ని తొలగించే విశ్వాస స్థలమూ, భద్రత కోసం భక్తులు ఆశ్రయించే శరణ్యమూ. ఇది ఏ గుడో తెలుసా? అన్నవరం నేషనల్ హైవే మీదుగా కొద్దిగా ఎడమవైపుకు తిరిగితే.. కొండల మధ్యలో వెలసిన ఈ పుణ్యక్షేత్రమే తలుపులమ్మలోవ గుడి. మీరు గోదావరిలో ట్రావెల్ చేస్తున్నప్పుడు తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించండి. వాహన నంబర్ రాయించండి. ఒకసారి వెళ్లిన తర్వాత.. మళ్లీ వెళ్లాలని మనసు తలపించే ఒక ఆధ్యాత్మిక యాత్రగా మీరు గుర్తిస్తారు!