South Central Railway: సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో సిగ్నలింగ్ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నిన్న(ఆదివారం) ఉదయం టెక్నికల్ సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో బల్లార్ష మీదుగా వెళ్లే చాలా రైళ్లు హనుమకొండ జిల్లా ఉప్పల్ రైల్వే స్టేషన్ లో నిలిచిపోయాయి. అన్ని ట్రాక్ ల మీద రెడ్ సిగ్నల్స్ పడటంతో బల్లార్ష నుంచి వచ్చిన రైళ్లను నిలిపివేశారు. చాలా సేపటి తర్వాత స్టేషన్ మాస్టర్ పీఎల్ షీట్( రెళు వెళ్లేందు ఇచ్చే పర్మీషన్ లెటర్) ఇచ్చి రైళ్లను పంపించారు. అటు కాజీపేట, వరంగల్ వైపు నుంచి వస్తున్న రైళ్లను హసన్ పర్తి స్టేషన్ నుంచి వేగం తగ్గించేలా లోకో పైలెట్లకు రైల్వే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వారికి వాకీటాకీల్లో ఎప్పటికప్పుడు తగిన సూచనలు ఇస్తూ రాకపోకలు కొనసాగించేలా జాగ్రత్తలు తీసుకున్నారు.
ఉదయం 9 గంటల నుంచి సిగ్నలింగ్ సమస్యలు
నాగ్ పూర్ నుంచి సికింద్రాబాద్ కు వచ్చే వందేభారత్ రైలు ఉప్పల్ స్టేషన్ కు రాగానే సిగ్నలింగ్ వ్యవస్థలో సమస్యలు తలెత్తాయి. ఉదయం 9.49 గంటలకు వచ్చి ట్రాక్ మీదే నిలిచిపోయింది. సుమారు అరగంట తర్వాత స్టేషన్ అధికారులు పీఎల్ షీట్ ఇచ్చి అక్కడి నుంచి పంపించారు. ఆ తర్వాత రాజధాని ఎక్స్ ప్రెస్ తో పాటు ఇతర ఎక్స్ ప్రెస్ రైళ్లు, ప్యాసింజర్ రైళ్లు, గూడ్స్ రైళ్లు కూడా నిలిచిపోయాయి. సిర్పూర్ కాగజ్ నగర్- సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు సుమారు రెండు గంటల పాటు ఉప్పల్ సమీపంలోనే ఆగిపోయింది.
కేబుల్ తెగిపోవడంతో సిగ్నలింగ్ సమస్యలు
నిన్న ఉదయం మొదలైన సిగ్నలింగ్ సమస్యలు అర్థరాత్రి వరకు కొనసాగాయి. చాలా సేపు అసలు సమస్య ఏంటో తెలియక రైల్వే టెక్నికల్ అధికారులు ఇబ్బందులు పడ్డారు. కాజీపేట, సికింద్రాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, సిగ్నలింగ్, టెక్నికల్ అధికారులతో పాటు రైల్వే పోలీసు అధికారులు ఉప్పల్ సమీపంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జి గేటు నుంచి స్టేషన్ వరకు సిగ్నలింగ్ వ్యవస్థను పరిశీలించారు. రీసెంట్ గా సిగ్నలింగ్ కోసం వేసిన కేబుల్ లో ఎక్కడో లింక్ తెగిపోయిందని భావిస్తున్నారు. తాత్కాలికంగా సిగ్నలింగ్ వ్యవస్థను మెరుగుపరిచారు. అర్ధరాత్రి వరకు సమస్యను సరిచేయలేకపోవడంతో చాలా రైళ్ల ఆలస్యంగా నడిచాయి.
రహదారిపై రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు
సిగ్నలింగ్ సమస్య కారణంగా హుజూరాబాద్-పరకాల హైవే లెవల్ క్రాసింగ్ దగ్గర ఉదయం నుంచి గేటు తెరవలేదు. ఈ మార్గంలో కరీంనగర్ నుంచి మహారాష్ట్ర వైపు వెళ్లే భారీ రవాణ వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. హుజూరాబాద్, పరకాల మధ్య తిరిగే బస్సులు ఉప్పల్ స్టేజీ వరకు వచ్చి ప్రయాణికులను దింపి, వెనక్కి వెళ్లిపోయాయి. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణాలు కొనసాగించారు. చాలా దూరం తిరిగి వెళ్లాల్సి రావడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాత్రి 7.30కు గేటు ఓపెన్ చేయడంతో వాహనాల రాకపోకలు యథావిధిగా కొనసాగాయి.
Read Also: ఇంజిన్ లేకుండా వందే భారత్ ట్రైన్ అంత వేగంగా ఎలా ప్రయాణిస్తోంది? సాధారణ రైలుకి దీనికి తేడా ఏమిటి?