తెలంగాణ నుంచి శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. భక్తులు ఇబ్బంది లేకుండా అయ్యప్ప స్వామిని దర్శించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. వ్యక్తిగత వాహనాలు లేని భక్తులు ఇప్పటికే రైళ్లు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో వెళ్లేందుకు రెడీ కాగా, ఆర్టీసీ కూడా భక్తులకు ప్రత్యేక సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తోంది. తెలంగాణ నుంచి శబరిమలకు 200 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒక్కో డిపో నుంచి కనీసం రెండు బస్సులను శబరిమలకు కేటాయించాలని ఆర్టీసీ అధికారులకు సర్క్యులర్ జారీ అయ్యింది.
ఈ ప్రత్యేక బస్సులను అద్దె ప్రాతిపదికన నడపాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. ఈ బస్సుల ద్వారా సుమారు లక్ష మంది అయ్యప్ప భక్తులకు రవాణా సౌకర్యాన్ని కల్పించనున్నట్లు తెలిపారు. ఈ ప్రత్యేక బస్సులలో ఎక్స్ ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని బస్సులు ఉంటాయని ప్రకటించారు. ఇక ఈ బస్సులకు సంబంధించి ఛార్జీలను ఖరారు చేశారు. బస్సు రకం, ప్రయాణ దూరాన్ని బట్టి కిలో మీటరుకు ఇంత అని ఛార్జ్ వసూళు చేస్తారు. బస్సులు ఆగిన సమయానికి వెయిటింగ్ ఛార్జీ గంటకు రూ. 300 చెల్లించాల్సి ఉంటుంది. భక్తులు సూపర్ లగ్జరీ బస్సును బుక్ చేసుకుంటే.. ఆ బస్సు రానుపోను 3000 కి.మీ తిరిగినట్లు అయితే, ప్రయాణ సమయం 6 రోజులు పడితే, బేస్ ఛార్జ్, వెయిటింగ్ ఛార్జ్, పర్మిట్ ఛార్జ్, జీఎస్టీ లాంటి అన్ని ఖర్చులు కలిపి సుమారు రూ. 1, 97, 000 అవుతుంది. గురు స్వామి పేరుతో బస్సు బుక్ చేసుకుంటే ఓ వ్యక్తికి ఉచితంగా జర్నీ చేసే అవకాశం ఉంటుంది.
శబరిమలకు బస్సును బుక్ చేసుకోవాలనుకునే భక్తులు ముందుగా రూ. 10 వేల కాషన్ డిపాజిట్ చెల్లించాలి. ఈ మొత్తాన్ని యాత్ర పూర్తి అయిన తర్వాత ఆర్టీసీ తిరిగి చెల్లిస్తుంది. ఛార్జీల విషయానికి వస్తే రాజధాని బస్సుల్లో 40 సీట్లు ఉంటాయి. కిలో మీటరకు రూ. 77 వసూళు చేస్తారు. సూపర్ లగ్జరీ బస్సుల్లో 36 సీట్లు ఉంటాయి. కిలో మీటరకు రూ. 59 వసూళు చేస్తారు. డీలక్స్ బస్సుల్లో 40 సీట్లు ఉంటాయి. కిలో మీటరుకు రూ. 57 వసూళు చేస్తారు. ఎక్స్ ప్రెస్ బస్సులో 50 సీట్లు ఉంటాయి. కిలో మీటరుకు రూ. 62 వసూళు చేస్తారు. ఆయా రాష్ట్రాల రవాణాశాఖ వసూళు చేసే ఛార్జీలను కూడా భక్తులే చెల్లించాల్సి ఉంటుంది.
శబరిమలకు వెళ్లే బస్సు బుక్ చేసుకున్న గురుస్వామికి భక్తులతో పాటు అదే బస్సులో ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉంటుంది. భక్తులతో పాటు వచ్చే లగేజ్ అటెండెంట్లు, వంట మనుషులు ఉచితంగా వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే, వీరికి సీట్లు ఉండవు. ప్రయాణ సమయంలో వినోదం కోసం ఆడియో, వీడియో సిస్టమ్ ఏర్పాటు చేస్తారు.
Read Also: రైల్లో పిల్లలకు టికెట్ ఉచితమేనా.. కొత్త రూల్స్ ఏం చెబుతున్నాయంటే?