Visakhapatnam-Kollam Weekly Special Trains: తెలుగు రాష్ట్రాల్లోని అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. కేరళ, విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైలు సేవలను పొడిగించింది. అయ్యప్ప భక్తులు శబరిమలకు వెళ్తున్న నేపథ్యంలో విశాఖపట్నం, కేరళ నడుమ కనెక్టివిటీని పెంచేందుకు ఈ నిర్ణయం తీసకుంది. 08539/08540 నెంబర్ గల విశాఖపట్నం-కొల్లాం-విశాఖపట్నం వీక్లీ స్పెషల్ రైలు సేవలను పెంచుతున్నట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది. ఇవాళ్టి (నవంబర్ 24) నుంచి బుకింగ్స్ మొదలు పెట్టినట్లు వెల్లడించింది. ఈ రైలు విశాఖ నుంచి ఎర్నాకులం, కొట్టాయం మీదుగా కొల్లాంకు చేరకోనుంది.
స్పెషల్ ట్రైన్ షెడ్యూల్
⦿ విశాఖపట్నం-కొల్లాం ప్రత్యేక రైలు
విశాఖపట్నం- కొల్లాం వీక్లీ స్పెషల్ ఎక్స్ ప్రెస్ (08539) రైలును డిసెంబర్ 4(2024) నుంచి ఫిబ్రవరి 26(2024) వరకు పొడిగిస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ రైలు ప్రతి బుధవారం ఉదయం 8.20 గంటలకు విశాఖపట్నం నుంచి బయల్దేరుతుంది. గురువారం మధ్యాహ్నం 12.55 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. డిసెంబర్ 4, 11, 18, 25, జనవరి 1, 8, 15, 22, 29, ఫిబ్రవరి 5, 12, 19, 26 తేదీల్లో ఈ రైలు విశాఖ నుంచి- కొల్లాంకు వెళ్తుంది.
⦿ కొల్లం- విశాఖపట్నం ప్రత్యేక రైలు
ఇక కొల్లాం- విశాఖపట్నం వీక్లీ స్పెషల్ ఎక్స్ ప్రెస్ (08540) రైలు సేవలను డిసెంబర్ 5(2024) నుంచి ఫిబ్రవరి 27(2025) వరకు పొడిగించారు. ఈ రైలు ప్రతి గురువారం కొల్లాం నుంచి రాత్రి 7.35 గంటలకు బయల్దేరుతుంది. మరుసటి రోజు అంటే.. శుక్రవారం రాత్రి 11.20 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైలు డిసెంబర్ 5, 12, 19, 26.. జనవరి 2, 9, 16, 23, 30.. ఫిబ్రవరి 6, 13, 20, 27 తేదీల్లో కొల్లాం నుంచి- విశాఖకు బయల్దేరుతుంది.
Read Also: 25న విజయవాడ మీదుగా నడిచే పలు రైళ్లు క్యాన్సిల్, కారణం ఏంటో తెలుసా?
ఈ స్పెషల్ రైలు ఎక్కడ ఆగుతుందంటే?
డిసెంబర్ 4 నుంచి ఫిబ్రవరి 27 వరకు అందుబాటులో ఉండే ఈ ప్రత్యేక రైలు పలు రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. అయ్యప్ప భక్తులు ఎక్కడి నుంచి అయినా ఈ రైల్లో ఎక్కే అవకాశం ఉంది. ఈ స్పెషల్ రైలు దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పొదునూరు, పాలక్కాడ్, త్రిచూర్, అలువూరు, త్రిచూర్ లో ఆగుతుంది. ఈ ప్రత్యేక రైలు శబరిమలకు వెళ్లే అయ్యప్ప మాలధారులతో పాటు అయ్యప్ప భక్తులు మరింత సౌకర్యంగా ఉంటుందని రైల్వే అధికారులు వెల్లడించారు. అయ్యప్ప భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ రైలును నడుపుతున్నట్లు తెలిపారు.
గత ఏడాది శబరిమలకు భక్తులు పొటెత్తారు. రైలు సర్వీసులు సరిపోకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. టికెట్లు దొరక్క చాలా మంది జనరల్ బోగీల్లో ప్రయాణించారు. చాలా దూరం నిలబడే ప్రయాణించాల్సిన దుస్థితి ఏర్పడింది. రైల్వే శాఖ అయ్యప్ప భక్తుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందనే విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అయ్యప్ప భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రైల్వేశాఖ అధికారులు పెద్ద సంఖ్యలో ప్రత్యేక రైళ్లను నడిపేందుకు నిర్ణయించారు.
Read Also: 7 స్టార్ హోటల్ ను తలదన్నే లగ్జరీ రైలు, టికెట్ ధర ఎంతో తెలిస్తే మతిపోవాల్సిందే!