Tirumala Tirupati Devasthanam: తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. ఫిబ్రవరి 2026కు సంబంధించిన దర్శనం టికెట్లను రేపు విడుదల చేయనున్నట్లు తెలిపింది. అటు వసతి కోటాను కూడా రేపు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది. ఈ టికెట్లను ఎలా బుక్ చేసుకోవాలి? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల( సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ)కు సంబంధించిన ఫిబ్రవరి నెల కోటాను నవంబర్ 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం నవంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు నవంబర్ 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు పేమెంట్ చేసిన వారికి టికెట్లు మంజూరవుతాయి.
శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవం టికెట్లను 21న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటా టికెట్లు మధ్యాహ్నం 3 గంటలకు విడుదలకానున్నాయి.
అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. అటు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. అటు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లు నవంబర్ 25న ఉదయం 10 గంటలకు విడుదల చేయబడతాయి. తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు సూచించారు.
Read Also: ప్రపంచమంతా అంతమైనా.. ‘వారణాసి’ మాత్రం చెక్కు చెదరదు, శివయ్యే స్వయంగా…