Uber Motorhomes Services: ఉబెర్ ఇండియా తన సేవలను రోజు రోజుకు విస్తరిస్తోంది. ప్రయాణీకులకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని అందించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. ఇప్పటికే ఇంటర్ సిటీ సర్వీసులు అందిస్తున్న ఉబెర్.. మోటర్ హోమ్ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఇంటర్ సిటీ ప్రయాణాన్ని ప్రోత్సహించడానికి, ఉబెర్ ప్రత్యేకంగా రూపొందించిన మోటార్ హోమ్ లను పరిచయం చేయబోతోంది. ఇందులో భాగంగానే ఆగస్టు 7 నుంచి సెప్టెంబర్ 6 వరకు ఢిల్లీ-ఎన్‌సిఆర్ లో బుకింగ్ కోసం మోటార్ హోమ్ వాహనాలు అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించింది. బుకింగ్‌లు ఆగస్టు 4 నుంచి ప్రారంభించింది. వినియోగదారులు ఉబెర్ యాప్ లోని ప్రత్యేక ఐకాన్ ద్వారా ఈ సర్వీసును పొందే అవకాశం ఉంటుంది.
మోటార్ హోమ్ తో లగ్జరీ ప్రయాణం
ప్రతి మోటార్ హోమ్ లో 4 నుంచి 5 మంది ప్రయాణికులు జర్నీ చేసే అవకాశం ఉంటుంది. డ్రైవర్ తో పాటు మరో సహాయకుడు ఉంటాడు. ఈ వాహనంలో టెలివిజన్, మైక్రోవేవ్, లావేటరీ, మినీ-ఫ్రిజ్తో పాటు టాయిలెట్ సౌకర్యం కూడా ఉంటుంది. ఈ సేవల కోసం ముందుగా సీటు రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి ఉబెర్ ప్రస్తుత ఇంటర్ సిటీ సేవలకు అనుగుణంగా ఉంటాయి.
ఇంటర్ సిటీ ప్రయాణం మరింత కొత్తగా
గత సంవత్సరంలో, ముంబై–పుణె, ఢిల్లీ–ఆగ్రా, బెంగళూరు–మైసూర్, లక్నో–కాన్పూర్, అహ్మదాబాద్–వడోదర మధ్య ఇంటర్ సిటీ సేవలు మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. వారాంతాల్లో, దీపావళి, హోలీ, ఈద్, వేసవి పెళ్లిళ్ల సీజన్, పండుగల సమయంలో డిమాండ్ ఎక్కువగా ఉంది. శుక్రవారాల్లో ఎక్కువ రైడ్ బుకింగ్‌లు జరిగాయి. ముఖ్యంగా ట్రాఫిక్ తక్కువగా ఉన్నప్పుడు, ప్రయాణికులు తరచుగా విహారయాత్రలు, ఈవెంట్లు ప్లాన్ చేస్తున్నారు.
Read Also: ఇకపై పావు గంట ముందే వందేభారత్ టికెట్ బుక్ చేసుకొవచ్చు.. కేవలం ఈ 8 రైళ్లలోనే!
ఇక ఉబెర్ రైడ్ లు పలు రకాలుగా ఉంటాయి. రిలాక్స్ టూర్స్ , మతపరమైన తీర్థయాత్రలు, ఈవెంట్లకు హాజరు కావడానికి తరచుగా రౌండ్ ట్రిప్ బుకింగ్ చేసుకుంటున్నారు. వన్-వే ఇంటర్ సిటీ రైడ్ లు కుటుంబాన్ని సందర్శించే వినియోగదారులకు, వ్యాపారం కోసం ప్రయాణించే వినియోగదారులకు, రైలు, విమాన రవాణాకు లింక్ అయ్యే వినియోగదారులకు ఉపయోగించుకుంటున్నారు.
2013 నుంచి ఇండియాలో ఉబెర్ సేవలు
ఈజీ క్విక్ బ్రేక్స్, ఫ్యామిలీ విజిట్, సమావేశాల కోసం ఎక్కువ మంది రోడ్డు ప్రయాణాన్ని ఎంచుకుంటున్నట్లు ఉబెర్ వెల్లడించింది. ఈజీ ప్రయాణాల కోసం ఇంటర్ సిటీ సేవలను మరింత విస్తరిస్తున్నట్లు తెలిపింది. అందులో భాగంగానే మోటర్ హోమ్ లను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయం రోడ్ మొబిలిటీలో కీలక ముందడుగు కాబోతున్నట్లు వెల్లడించింది. ఇక ఉబెర్ 2013లో భారతదేశంలోకి ప్రవేశించింది. ఇప్పుడు 125 నగరాల్లో పని చేస్తోంది. రైడ్-హేలింగ్ కంపెనీ 3 బిలియన్లకు పైగా ట్రిప్పులను పూర్తి చేసింది. ఉబెర్ సేవల్లో ఇప్పుడు కార్లు, బైక్‌లు, ఆటోలు, బస్సులు ఉన్నాయి.
Read Also: బస్సు టికెట్ ధరకే విమాన ప్రయాణం, ఇండిగో అదిరిపోయే ఆఫర్లు!