IndiGo 19th Anniversary: దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో 19వ సంవత్సరంలోకి అడుగు పెడుతోంది. ఈ సందర్భంగా దేశీయ, అంతర్జాతీయ మార్గాలలో ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది. ఇందులో భాగంగా ‘హ్యాపీ ఇండిగో డే సేల్’ ను ప్రారంభించింది. ఆగస్టు 3న లాంచ్ అయిన ఈ సేల్ లో దేశీయ విమాన ప్రయాణాలకు రూ.1,219, అంతర్జాతీయ ప్రయాణానికి రూ. 4,319 నుంచి ప్రారంభమయ్యే వన్ వే టిక్కెట్లను అందిస్తుంది. ఈ ఆఫర్ ఆగస్టు 6న రాత్రి 11:59 గంటల వరకు కొనసాగుతుంది. ఈ టికెట్లు తీసుకున్న ప్రయాణీకులు ఆగష్టు 10 నుంచి మార్చి 31, 2026 వరకు షెడ్యూల్ చేయబడిన టైమ్ లో ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ప్రయాణికులకు ముందస్తుగా ప్లాన్ చేసుకోవడానికి తగినంత సమయం ఉంటుంది.
యాడ్ ఆన్ లపై ధరల తగ్గింపు
రాయితీ ఛార్జీలతో పాటు, ఇండిగో పలు ప్రయాణ యాడ్ ఆన్ లపై ధరలను కూడా తగ్గిస్తోంది. ఈ ఆఫర్లు విమాన ప్రయాణాన్ని మరింత చౌకగా మార్చనున్నాయి.
⦿ సీట్ల ఎంపిక: ఎంపిక చేసిన మార్గాల్లో కేవలం ₹19 నుంచి సీట్ల ఎంపిక ఉంటుంది.
⦿ అదనపు లెగ్ రూమ్ (XL సీట్లు): దేశీయ విమానాలలో ₹500 నుంచి ప్రారంభం అవుతుంది.
⦿ అదనపు బ్యాగేజీ: 15 కిలోలు, 20 కిలోలు, 30 కిలోల స్లాబ్‌లపై 50% వరకు తగ్గింపు అందిస్తుంది.
⦿ ఫాస్ట్ ఫార్వర్డ్ సేవలు: చెక్-ఇన్ ప్రాధాన్యత, బ్యాగేజీపై 50% వరకు తగ్గింపు అందిస్తుంది.
⦿ 6E ప్రైమ్ & 6E సీట్ & ఈట్: బండిల్డ్ ప్రీమియం ఎంపికలపై 30% వరకు తగ్గింపు అందిస్తుంది.
⦿ జీరో క్యాన్సిల్ ప్లాన్: అంతర్జాతీయ విమానాలకు ₹999కే ఈ అవకాశం కల్పిస్తోంది.
ఈ ఆఫర్లు బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రయాణీకులకు ఎంతో మేలు కలిగించనుంది. మొత్తం ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది.
Read Also: వందే భారత్ స్లీపర్ రైలు సిద్ధం.. ముందు పరుగులు తీసేది ఈ రూట్ లోనే!
2006లో ఇండిగో సేవలు ప్రారంభం
2006లో ఇండిగో సేవలు ప్రారంభం అయ్యాయి. ప్రస్తుతం 400 కంటే ఎక్కువ విమానాలతో ఇండియాలో అతిపెద్ద క్యారియర్ గా మారింది. ఈ ఎయిర్ లైన్ 2,200 కంటే ఎక్కువ రోజువారీ విమాన సర్వీసులను అందిస్తుంది. 90 దేశీయ, 40 అంతర్జాతీయ గమ్యస్థానాలకు సేవలను కొనసాగిస్తుంది. 2024లో ఇండిగో 58 కొత్త విమానాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన సంస్థలలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో ఇండిగోను స్కైట్రాక్స్ 2025 వరల్డ్ ఎయిర్‌లైన్ అవార్డులలో ‘ఇండియా, సౌత్ ఏసియాలో ఉత్తమ విమానయాన సంస్థ అవార్డును పొందింది. ఇక తాజాగా ఆఫర్లు ఆగస్టు 6 వరకు ఓపెన్ లో ఉంటాయి. ఏడు నెలల పాటు ప్రయాణ తేదీలు ఉంటాయి.
Read Also: ఇకపై పావు గంట ముందే వందేభారత్ టికెట్ బుక్ చేసుకొవచ్చు.. కేవలం ఈ 8 రైళ్లలోనే!