Indian Railways Ticket Booking: ప్రయాణీకులకు భారతీయ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ఎంపిక చేసిన వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లలో.. తమ స్టేషన్ కు చేరుకోవడానికి కేవలం 15 నిమిషాల ముందు టికెట్లను బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఈ సదుపాయాన్ని అందించేందుకు భారతీయ రైల్వే ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్(PRS)లో కొన్ని మార్పులు చేసింది. ప్రయాణీకుల అనుభవాన్ని మెరుగుపరచడం, వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు మార్గం మధ్యలోని స్టేషన్లలో ఇబ్బంది లేని కరెంట్ బుకింగ్‌లను క్రమబద్ధీకరించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది.
8 వందే భారత్ రైలు టికెట్ బుకింగ్
దక్షిణ రైల్వే (SR) జోన్ నడుపుతున్న వందే భారత్ రైళ్లలో ముందుగా ఈ అవకాశాన్ని కల్పిస్తోంది. “దక్షిణ రైల్వే పరిధిలో నడిచే 8 వందే భారత్ రైళ్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోబడింది. ఈ రైళ్లు ఆయా స్టేషన్ల నుంచి బయల్దేరే 15 నిమిషాల ముందు వరకు మార్గం మధ్యలోని స్టేషన్లలో కరెంట్ రిజర్వేషన్లను చేసుకునే అవకాశం ఉంది” అని సౌత్ రైల్వే ప్రకటించింది. నిజానికి గతంలో ఈ సౌకర్యం పరిమితంగా ఉండేది. ఆ తర్వాత రైలు బయలుదేరిన తర్వాత టికెట్లు బుక్ చేసుకునే అవకాశాన్ని రద్దు చేశారు.
కొత్త రూల్ ప్రకారం, మార్గం మధ్యంలో వందే భారత్ రైళ్లలో సీట్లు ఖాళీ అయినప్పుడు ఆయా స్టేషన్లలో కరెంట్ బుకింగ్ కోసం అవకాశం కల్పిస్తున్నారు. దీనివల్ల ప్రయాణీకులకు లాభం కలగనుంది. రైళ్లలో ఆక్యుపెన్సీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. తాజాగా వందేభారత్ రైలు రావడానికి 15 నిమిషాల ముందు టికెట్లు బుక్ చేసుకోవడానికి 8 రైళ్లకు అవకాశం కల్పించారు.
⦿ రైలు నంబర్ 20631 మంగళూరు సెంట్రల్-తిరువనంతపురం సెంట్రల్ వందే భారత్ ఎక్స్ ప్రెస్
⦿ రైలు నంబర్ 20632 తిరువనంతపురం సెంట్రల్-మంగళూరు సెంట్రల్ వందే భారత్ ఎక్స్ ప్రెస్
⦿ రైలు నంబర్ 20627 చెన్నై ఎగ్మోర్-నాగర్ కోయిల్ వందే భారత్ ఎక్స్ ప్రెస్
⦿ రైలు నంబర్ 20628 నాగర్ కోయిల్ – చెన్నై ఎగ్మోర్ వందే భారత్ ఎక్స్ ప్రెస్
⦿ రైలు నంబర్ 20642 కోయంబత్తూర్-బెంగళూరు కాంట్. వందే భారత్ ఎక్స్ ప్రెస్
⦿ రైలు నంబర్ 20646 మంగళూరు సెంట్రల్-మడ్గావ్ వందే భారత్ ఎక్స్ ప్రెస్
⦿ రైలు నంబర్ 20671 మధురై-బెంగళూరు కాంట్ వందే భారత్ ఎక్స్ ప్రెస్
⦿ రైలు నంబర్ 20677 డాక్టర్ ఎంజిఆర్ చెన్నై సెంట్రల్-విజయవాడ వందే భారత్ ఎక్స్ ప్రెస్
Read Also: వీడు ఎవడండి బాబు.. రైల్వే ప్లాట్‌ఫాం మీదకు ఏకంగా కారుతో వచ్చేశాడు!
వందే భారత్ రైళ్లలో ప్రయాణీకుల ఆక్యుపెన్సీ ఎంత?
ప్రస్తుతం, దేశంలోని పలు మార్గాల్లో మొత్తం 144 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకారం, వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు అన్ని మార్గాల్లో 100 శాతానికి పైగా ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి.
Read Also: వందే భారత్ స్లీపర్ రైలు సిద్ధం.. ముందు పరుగులు తీసేది ఈ రూట్ లోనే!