Vande Bharat Express: దేశ అత్యాధునిక రైళ్లలో ఒకటైన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మరోసారి వార్తల్లోకి వచ్చింది. కానీ ఈసారి దురదృష్టకర ఘటనతో వార్తల్లో నిలిచింది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నుండి రేవా వెళ్తున్న వందే భారత్ రైలు పై ఒక నిర్మాణంలో ఉన్న వంతెన నుండి ఇనుప రాడ్లు కూలిపోవడంతో, పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. అయితే ప్రయాణికులు భయాందోళనకు లోనయ్యారు కానీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
ఎక్కడ, ఎప్పుడు జరిగింది ఈ ఘటన?
ఈ ఘటన ఆబేదుల్లాగంజ్ రైల్వే స్టేషన్ సమీపంలో, రాత్రి సమయంలో చోటు చేసుకుంది. రాణి కమలాపతి స్టేషన్ భోపాల్ నుండి బయలుదేరిన కొద్దిసేపటికే ఈ ఘటన చోటు చేసుకుంది. తుఫాను, గాలులు, వర్షం కారణంగా నిర్మాణంలో ఉన్న వంతెనపై ఏర్పాటు చేసిన ఇనుప రాడ్లు ఊడి రైలు పట్టాలపై పడిపోయాయి. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అక్కడే ఉండటంతో, కొన్ని రాడ్లు నేరుగా కోచ్‌లపై పడిపోయాయి.
ప్రమాద తీవ్రత..
వందే భారత్ వంటి వేగంగా వెళ్లే రైలు మీద ఇలాంటి భారీ ఇనుప రాడ్లు పడితే, దాని దెబ్బ తాళలేక రైలు పట్టాలు తప్పే అవకాశముండేది. అదృష్టవశాత్తూ, ఆ సమయంలో రైలు వేగం తక్కువగా ఉండటంతో ప్రమాదం పెద్దదిగా మారలేదు. కొన్ని కోచ్‌ల కిటికీలు పగిలిపోయాయి, తలుపులు జామ్ అయ్యాయి, కానీ ప్రయాణికులకు గాయాలు లేకపోవడం ఊపిరి పీల్చుకునే విషయం.
ఈ ఘటన తర్వాత రైలును అక్కడే నిలిపివేశారు. కోచ్‌ల మధ్య ఇరుక్కుపోయిన ఇనుప రాడ్లను కత్తిరించేందుకు రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగింది. తలుపులు తెరవకపోవడం, కిటికీలు పగలగొడటం వలన కొందరు ఊపిరాడక భయపడ్డారు. కానీ రైల్వే సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. వందే భారత్ వంటి ఆధునిక రైళ్లు వేగంగా ప్రయాణించేందుకు రూపొందించబడినవే. కానీ వాతావరణం ప్రభావం, మానవ తప్పిదం, నిర్మాణ ప్రాంతాల పక్కన నుండి రైళ్లు వెళ్లడం వంటి అంశాల విషయంలో మరింత జాగ్రత్త అవసరం.
Also Read: AP Govt on Ration: ఇప్పటికే మీకు రేషన్ కార్డు ఉందా? ఇవి తెలుసుకోండి.. లేకుంటే?
తక్షణం స్పందించిన రైల్వే..
ఈ ఘటనపై కేంద్ర రైల్వే శాఖ అత్యవసరంగా స్పందించింది. ప్రమాదం జరిగిన ప్రదేశానికి సీనియర్ అధికారులు, భద్రతా విభాగం సిబ్బంది, టెక్నికల్ టీములు చేరుకున్నాయి. ప్రయాణికుల భద్రతకు మళ్లీ పునర్విమర్శ చేస్తూ, నిర్మాణ ప్రాజెక్టుల భద్రతా ప్రమాణాలను మళ్లీ సమీక్షించాలని నిర్ణయించారు. వంతెన నిర్మాణం చేస్తున్న కంపెనీపై కూడా విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై ఇనుప రాడ్లు పడిన సంఘటన, పెద్ద ప్రమాదం తృటిలో తప్పిన ఘటనగా చరిత్రలో నిలుస్తోంది.