Vande Bharat Express Hits New Milestone: 2025-26 ఆర్థిక సంవత్సరంలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు మంచి ఆదరణ లభించింది. ప్రయాణీకుల వినియోగం గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది దాదాపు 3.98 కోట్ల మంది ప్రయాణికులు ఈ రైళ్లలో ప్రయాణించినట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. గత ఏడాది 2.97 కోట్లతో పోలిస్తే సుమారు 34 శాతం ఎక్కువ మంది ప్రయాణించారు. వేగం, సౌకర్యం, ఆధునిక సదుపాయాల కారణంగా ఈ రైళ్లపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది.
వందే భారత్ సేవలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు లక్షకు పైగా ట్రిప్పులు నడిచాయి. ఈ కాలంలో మొత్తం 9.1 కోట్లకు పైగా ప్రయాణికులు ఈ రైళ్లను వినియోగించారు. స్వదేశీ సాంకేతికతతో తయారు చేసిన ఈ సెమీ హైస్పీడ్ రైలు,తొలిసారి 2019 ఫిబ్రవరిలో న్యూఢిల్లీ-వారణాసి మార్గంలో అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచి దేశ వ్యాప్తంగా పలు మార్గాల్లో విస్తరించింది. ప్రస్తుతం సుమారు 150 వందేభారత్ రైళ్లను నడుస్తున్నాయి.
ప్రస్తుతం న్యూఢిల్లీ-వారణాసి మార్గమే అత్యధిక రద్దీగా ఉన్నది. ఈ రూట్ లో ఇప్పటి వరకు 73 లక్షలకు పైగా ప్రయాణికులు ప్రయాణించారు. అలాగే న్యూఢిల్లీ నుంచి శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా వరకు నడిచే రైలు కూడా మంచి స్పందన పొందుతూ, సుమారు 56 లక్షల మందిని తమ గమ్యస్థానాలకు చేర్చింది. పుణ్యక్షేత్ర యాత్రలకు ఈ రైలు కీలక పాత్ర పోషిస్తోంది.
దక్షిణ భారతంలో కూడా వందే భారత్ రైళ్లకు మంచి డిమాండ్ కనిపిస్తోంది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య నడిచే రైలు సుమారు 48 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది. అలాగే చెన్నై నుంచి మైసూరు వరకు నడిచే మార్గంలో 36 లక్షలకు పైగా ప్రయాణికులు ఈ సేవలను ఉపయోగించుకున్నారు. ఈ మార్గాలు పర్యాటకానికి తోడ్పడటంతో పాటు, స్థానిక ఆర్థిక వ్యవస్థలకు కూడా ఊతమిస్తున్నాయి.
అటు సుదూర ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు 2026 జనవరిలో వందే భారత్ స్లీపర్ రైళ్లను కూడా ప్రారంభించారు. ఈ కొత్త సర్వీసు ప్రారంభమైన తొలి మూడు నెలల్లోనే మంచి ఆదరణ పొందింది. కేవలం 119 ట్రిప్పులలోనే సుమారు 1.21 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించారు. ఈ రైళ్ల ఆక్యుపెన్సీ రేటు 100 శాతం దాటాయి. రాత్రిపూట సౌకర్యవంతమైన ప్రయాణానికి ప్రజలు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో ఫుల్ ఆక్యుపెన్సీ సాధించింది.
వందే భారత్ రైళ్లు భారతీయ రైల్వేలో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయి. వేగవంతమైన ప్రయాణం, మెరుగైన సదుపాయాలు ప్రయాణికులలో మంచి నమ్మకాన్ని సంపాదించాయి. భవిష్యత్తులో మరిన్ని మార్గాల్లో ఈ రైళ్లు విస్తరించే అవకాశముండటంతో, దేశంలో రైల్వే ప్రయాణం మరింత ఆధునికంగా మారనుంది.
Read Also: ముంబై To బెంగళూరు.. 22 గంటల ప్రయాణం ఇక 16 గంటల్లోనే!