Hyderabad Crime: స్వేచ్ఛ బ్యూరో: కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా గోల్కొండ జోన్ పోలీసులు శనివారం తెల్లవారుఝామున మంగళ్ హాట్ స్టేషన్ పరిధిలో విసృతస్థాయిలో తనిఖీలు జరిపారు. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో వాహనాలు, గ్యాస్ సిలిండర్లతోపాటు మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మంగళ్ హాట్ ప్రాంతాన్ని అడ్డాగా చేసుకుని కొంతమంది ఏళ్ల తరబడిగా గంజాయి దందా చేస్తున్న విషయం తెలిసిందే. చెప్పాలంటే ఇక్కడి నుంచే గంజాయి గ్రేటర్ మొత్తంలో సరఫరా అవుతోంది.
దాంతోపాటు అక్రమంగా మద్యం అమ్మటం వంటి కార్యకలాపాలు కూడా ఇక్కడ సాధారణమే. ఈ క్రమంలోనే గోల్కొండ జోన్ డీసీపీ చంద్రమోహన్ శనివారం తెల్లవారుఝామున స్టేషన్ పరిధిలోని ప్రాంతాల్లో దాడులు జరిపించారు. దీంట్లో అదనపు డీసీపీ కృష్ణ గౌడ్, గోషామహల్ ఏసీపీ సుదర్శన్, కుల్సుంపురా ఏసీపీ తిరుపతి, మంగళ్‌హాట్ ఇన్ స్పెక్టర్ రాఘవేంద్ర, అడిషనల్ ఇన్ స్పెక్టర్ మహేందర్ తోపాటు జోన్ పరిధిలోని సీఐలు, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ సిబ్బంది మొత్తం 184 మంది పాల్గొన్నారు.
Also Read: వచ్చే సంక్రాంతికి ‘నందమూరి’ ఊచకోత…బాలయ్య ప్లానింగ్ వేరే లెవల్!
జుమ్మేరాత్ బజార్ నుంచి లాలాభవన్ వరకు.. అక్కడి నుంచి కున్నా పాన్ షాప్ వరకు.. లాలా తాలీమ్ నుంచి టక్కర్ వాడీ వరకు, బుధే బాబా హనుమాన్ ఆలయం నుంచి లోయర్ ధూల్ పేట పరిసర ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు జరిపారు. ఈ క్రమంలో సరైన పత్రాలు లేని 28 ద్విచక్ర వాహనాలు, అక్రమంగా నిల్వ చేసిన 49.4లీటర్ల విస్కీ, బీరు సీసాలు, 22 కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు, 12 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు, 79 చిన్న గ్యాస్ సిలిండర్లను సీజ్ చేశారు. ప్రజల్లో భద్రతా భావాన్ని పెంచటం, అసాంఘిక శక్తులపై నిఘా ఉంచటంతోపాటు నేరస్తుల్లో భయాన్ని కల్పించటమే ఈ దాడుల ఉద్దేశ్యమని డీసీపీ చంద్రమోహన్ చెప్పారు.