Indian Railways scheme: రైలు ప్రయాణం అంటే చాలా మందికి మధురమైన అనుభవం. కానీ జనరల్ కోచ్‌లో ప్రయాణం చేసే వారు ఎదుర్కొనే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా ఆహారం, నీటి సమస్యలు, సీటు కోసం పోటీ పడే పరిస్థితులు ఎప్పుడూ ఉండే టెన్షన్‌లుగా మారతాయి. ఇప్పుడు ఆ సమస్యలన్నింటికీ ఇండియన్ రైల్వే ఓ అద్భుత పరిష్కారం తీసుకొచ్చింది. ఇకపై జనరల్ కోచ్ ప్రయాణికులు సీటు వదిలి ఆహారం కోసం బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు.
☀ జనరల్ కోచ్ ప్రయాణికులకు AC తరహా సదుపాయాలు
ఇండియన్ రైల్వే ఇటీవల ప్రకటించిన కొత్త పథకం ప్రకారం, ఇకపై జనరల్ క్లాస్ కోచ్‌లలో కూడా సీటు వద్దకే ఫుడ్, వాటర్ సర్వీస్ అందించనున్నారు. ఇప్పటివరకు ఇలాంటి సదుపాయం ప్రధానంగా AC కోచ్ ప్రయాణికులకే పరిమితం అయ్యేది. అయితే ఇప్పుడు సామాన్య ప్రయాణికులకూ అదే సదుపాయాన్ని అందిస్తూ రైల్వే ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది.
☀ ఏం దొరుకుతుంది ఆ ఫుడ్ ప్యాక్‌లో?
కేవలం రూ.80లో రుచికరమైన భోజనం ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ఆ ప్యాక్‌లో పప్పు, అన్నం, కూర, రొట్టె, పచ్చడి వంటి వంటివి ఉంటాయి. ప్యాకింగ్ కూడా ప్రముఖ ఫుడ్ బ్రాండ్స్‌లా హైజీనిక్‌గా, ప్రొఫెషనల్‌గా ఉంటుంది. నాప్‌కిన్, స్పూన్ కూడా ప్యాక్‌లో కలిపి ఇస్తారు.
☀ ఎలా అందిస్తారు భోజనం?
సాధారణంగా ప్రయాణికులు భోజనం కోసం రైలు ఆగినప్పుడు తొక్కిసలాటలో దిగి కొనుక్కోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు వెండర్లు నేరుగా సీటు వద్దకే వచ్చి ఫుడ్ ప్యాక్స్ ఇస్తారు. దీంతో భోజనం కోసం లైన్‌లో నిలబడే ఇబ్బంది లేకుండా ప్రయాణికులు సౌకర్యంగా తినవచ్చు. సీటు వదిలి పోయే టెన్షన్ లేకుండా ప్రయాణం మరింత ఆనందంగా ఉంటుంది.
☀ ఏ ట్రైన్లలో మొదలైంది ఈ సదుపాయం?
ప్రస్తుతం ఈ సదుపాయం గోమతి ఎక్స్‌ప్రెస్, శ్రీనగర్ గంగానగర్ – న్యూ ఢిల్లీ ఇంటర్సిటీ, కైఫియాత్ ఎక్స్‌ప్రెస్, అయోధ్య ఎక్స్‌ప్రెస్, బరౌని – లోనీ, దర్భంగా – న్యూ ఢిల్లీ క్లోన్ ఎక్స్‌ప్రెస్ వంటి ముఖ్య రైళ్లలో అమలు చేయబడింది. త్వరలోనే ఈ సేవను మరిన్ని రైళ్లలో విస్తరించాలని రైల్వే ప్రణాళికలు వేస్తోంది.
Also Read: Indian Railways passengers: వందే భారత్ స్పీడ్.. రైల్వే రికార్డులు బద్దలు.. లెక్క ఎక్కువైంది బాస్!
☀ ఏ స్టేషన్లలో ఈ సదుపాయం?
న్యూ ఢిల్లీ స్టేషన్‌లో ప్రయాణికులకు రైలు పక్కనే టేబుల్ ఏర్పాటు చేసి భోజనం అందిస్తారు. అదే విధంగా వారణాసి, గోరఖ్‌పూర్, లక్నో స్టేషన్లలో కూడా ఇదే విధమైన సౌకర్యాలను ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
☀ ప్రయాణికుల స్పందన
ఈ కొత్త సదుపాయంపై సాధారణ కోచ్ ప్రయాణికులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక భోజనం కోసం టెన్షన్ అవసరం లేదు. రైలు ఆగే ప్రతి స్టేషన్ వద్ద తొక్కిసలాటలో తినటానికి సరైన ఆహారం కోసం ఇబ్బంది పడాల్సిన రోజులు పోయాయని కొందరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు AC కోచ్ ప్రయాణికుల మాదిరిగానే మాకు కూడా రుచికరమైన, శుభ్రంగా ప్యాక్ చేసిన భోజనం అందుతోందని మరో ప్రయాణికుడు ఆనందంగా చెప్పాడు. మరికొందరు జనరల్ కోచ్ ప్రయాణం కూడా ఇప్పుడు గౌరవప్రదంగా అనిపిస్తోంది. రైల్వే తీసుకువచ్చిన ఈ సదుపాయం నిజంగా అద్భుతమని ప్రశంసలు కురిపిస్తున్నారు.
☀ సామాన్య ప్రయాణికులకు.. చక్కని అవకాశం
సాధారణంగా జనరల్ కోచ్ ప్రయాణం కష్టాల పరంపరగానే భావించేవారు. కానీ రైల్వే తీసుకొచ్చిన ఈ పథకం ఆ ప్రయాణ అనుభవాన్ని సౌకర్యవంతంగా, గౌరవప్రదంగా మార్చేస్తోంది. ఇక భోజనం కోసం స్టేషన్ వద్ద తొక్కిసలాట, దిగి రైలు మిస్సయ్యే భయం లాంటివి ఉండవు.