Indian Railways: గత కొద్ది సంవత్సరాలుగా భారతీయ రైల్వే సంస్థ గణనీయమైన పురోగతి సాధిస్తున్నది. ఇప్పటికే వందేభారత్ ఎక్స్ ప్రెస్, నమో భారత్ రైళ్లు అందుబాటులోకి రాగా, త్వరలో వందే భారత్ స్లీపర్ రైళ్లు పట్టాలెక్కబోతున్నాయి. మరోవైపు బుల్లెట్ రైళ్లు, హైడ్రోజన్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది కేంద్ర ప్రభుత్వం. వేగంగా, సురక్షితంగా ప్రయాణీకులను గమ్య స్థానాలకు తీసుకెళ్లేలా చర్యలు తీసుకుంటున్నది. అయితే, 2027 నాటికి ముంబై- అహ్మదాబాద్ కారిడార్ లోబుల్లెట్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని భావించింది. ఈ మార్గంలో జపనీస్ షింకన్ సెన్ బుల్లెట్ రైళ్లను ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది. అయితే, ఈ బుల్లెట్ రైళ్ల సేకరణకుసంబంధించిన ఒప్పందాలు ఖరారు చేయడంలో జాప్యం కావడంతో ఇప్పట్లో సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు.
హైస్పీడ్ కారిడార్ లో వందేభారత్ రైళ్లు
బుల్లెట్ రైళ్ల రాక ఇప్పట్లో సాధ్యం అయ్యేలా కనిపించకపోవడంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గంటకు 280 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించే వందేభారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నది. ఇందుకోసం అవసరం అయ్యే సిగ్నలింగ్ వ్యవస్థ కోసం బిడ్లను ఆహ్వానించింది. స్వదేశీ బుల్లెట్ రైళ్లుగా అభివృద్ధి చేయబడుతున్నవందే భారత్ రైళ్లను నడపడానికి సిగ్నలింగ్ వ్యవస్థ కోసం.. నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ టెండర్లను ప్రకటించింది. టెండర్ డాక్యుమెంట్ ప్రకారం.. కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ రైలు సిగ్నలింగ్ వ్యవస్థను తయారు చేయడంతో పాటు ఇన్ స్టాల్ చేయాల్సి ఉంటుంది. సిగ్నలింగ్ వ్యవస్థ మెయింటెనెన్స్ బాధ్యలను నిర్వహించాల్సి ఉంటుంది. ఇది షింకన్‌సెన్ రైళ్ల కోసం రూపొందించిన జపనీస్ DS-ATC సిగ్నలింగ్ వ్యవస్థ మాదిరిగా కాకుండా, యూరోపియన్ ట్రైన్ కంట్రోల్ సిస్టమ్ (ETCS) లెవల్-2 మాదిరిగా ఉంటుంది.
Read Also: వందే భారత్ స్లీపర్ రైల్‌కు బుల్లెట్ ప్రూఫ్ విండోలు? రైల్వేశాఖ ఏం చెప్పిందంటే?
కాంట్రాక్ట్ వ్యవధి 7 సంవత్సరాలు
ETCS-2 కోసం కాంట్రాక్ట్ వ్యవధి పని అప్పగించిన తేదీ నుంచి ఏడు సంవత్సరాలు ఉంటుంది. ఈ కారిడార్ లో ETCS-2 ని ఏర్పాటు చేయడం వల్ల ఈ మౌలిక సదుపాయాలను మున్ముందు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు, 2027లో ఈ ట్రాక్‌లో వందే భారత్ రైళ్ల కార్యకలాపాలను ప్రారంభించాలని ఇండియన్ రైల్వే భావిస్తున్నది.
నిజానికి షింకన్ సెన్ రైళ్లు ఆగస్టు 2026 నాటికి సూరత్- బిలిమోరా సెక్షన్ లో అందుబాటులోకి వస్తాయని గతంలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రైళ్లు 2030 లోగా వచ్చే అవకాశం కనిపించడం లేదు. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2033 నాటికి బుల్లెట్ రైళ్ల కల నెరవేరే అవకాశం ఉంది. అయితే, వందేభారత్ రైళ్లు పని చేస్తున్నప్పుడు కూడా షింకన్‌సెన్ రైళ్ల కోసం జపనీస్ సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. 2030 లేదంటే ఆ తర్వాత షింకన్ సెన్ E-10 సిరీస్ రైళ్లను అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.
Read Also: అన్ని లైన్లలో.. ఏ ట్రాక్ మీదకు వెళ్లాలనేది లోకో పైలెట్‌కు ఎలా తెలుస్తుంది?