Special trains 2025: వినాయక చవితి పండగ వచ్చేసింది. ఈ పండుగ రోజుల్లో గ్రామాలకి వెళ్లే వారి సంఖ్య అధికం. గణేశుడి దర్శనంతో పాటు కుటుంబంతో కలిసి మెలసి ఆనందంగా జరుపుకొనే పండగలలో ఇదొకటి. అందుకే ప్రతి ఒక్కరూ సుదూర ప్రాంతాల నుండి స్వగ్రామాల దారి పడతారు. అయితే ఇక్కడ వచ్చే సమస్య ఏమిటంటే.. ప్రయాణం. ఈ సమయాల్లో ఎక్కువగా ట్రైన్ జర్నీకే ప్రయాణికులు ఆసక్తి చూపుతారు.
అటువంటి సమయంలో రద్దీ, టికెట్ దొరకకపోవడం, ప్రయాణ అసౌకర్యం ఇవన్నీ ఎన్నోసార్లు అనుభవించాల్సి వస్తుంది. అయితే ఈసారి మాత్రం కేంద్ర రైల్వే ముందుగానే భారీ ప్రణాళికతో రంగంలోకి దిగింది. ఈ ఏడాది గణపతి ఉత్సవాన్ని దృష్టిలో ఉంచుకొని మొత్తం 296 ప్రత్యేక గణపతి రైళ్లు నడపనుందని ప్రకటించింది. వాటిలో కొత్తగా 44 అదనపు రైళ్లు కూడా లైన్లోకి వచ్చాయి. కాంకవలి, సింధుదుర్గ్, రత్నగిరి, పణ్వేల్ వంటి కన్కణ్ ప్రాంతాలకు వెళ్లే వారికి ఇది నిజంగా శుభవార్తే!
☀ ఎల్టీటీ – సావంతవాడి స్పెషల్ రైళ్లు
ముఖ్యంగా ముంబయి నుంచి కన్కణ్ వైపు వెళ్లే వారికోసం ఎల్టీటీ – సావంతవాడి రూట్‌లో 8 బై-వీక్లీ రైళ్లు నడవనున్నాయి. ఆగస్టు 28, 31, సెప్టెంబర్ 4, 7 తేదీల్లో ఈ ప్రత్యేక రైళ్లు రెండు దిశల్లో ప్రయాణిస్తాయి. ఉదయం 8:45కి ఎల్టీటీ నుంచి బయలుదేరిన 01131 రైలు రాత్రి 10:20కి సావంతవాడికి చేరుతుంది. తిరుగు ప్రయాణమైన 01132 రైలు సావంతవాడి నుంచి రాత్రి 11:20కి బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 12:30కి ఎల్టీటీకి చేరుతుంది. ఈ రైళ్లు AC 3-tier, స్లీపర్ క్లాస్, జనరల్ క్లాస్ వంటివన్నీ కలిగి ఉంటాయి. దీని ద్వారా అన్ని తరగతులవారికీ ప్రయాణ సౌలభ్యం అందుబాటులోకి వస్తోంది.
☀ దివా – ఖేడ్ మార్గంలో MEMU రైళ్లు
పండుగ సమయంలో ఎక్కువగా తమ గ్రామాలవైపు పోయే వలసదారుల కోసం దివా – ఖేడ్ మార్గంలో 36 అదనపు MEMU రైళ్లు నడవనున్నాయి. ఇవి ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 9 వరకు ప్రతిరోజూ అందుబాటులో ఉంటాయి. దివా నుంచి మధ్యాహ్నం 1:40కి బయలుదేరే ట్రైన్, ఖేడ్ నుంచి ఉదయం 8:00కి బయలుదేరే ట్రైన్ ప్రయాణికులకు నిత్య సేవలుగా లభిస్తాయి.
☀ దివా – చిప్లున్ మధ్య సేవలు పెంపు
ఇక దివా – చిప్లున్ మార్గంలో ప్రస్తుతం ఉన్న 38 ట్రిప్‌లను 40కి పెంచారు. ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 10 వరకు ఈ రైళ్లు ప్రయాణికులకు మరింత సేవలను అందించనున్నాయి. వీటి ద్వారా మధ్యతరగతి, పేదవర్గాల ప్రజలకు ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది.
☀వెలంకన్నికి పుణ్యయాత్ర ప్రత్యేక రైళ్లు
వినాయక చవితి తర్వాత వచ్చే వెలంకన్ని ఫీస్ట్ కోసం యాత్రికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని, కేంద్ర రైల్వే వాస్కోడి గామా – వెలంకన్ని మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు తెలిపింది. 07361 నెంబర్ ట్రైన్ వాస్కో నుంచి ఆగస్టు 27, సెప్టెంబర్ 1, 6 తేదీల్లో రాత్రి 9:55కి బయలుదేరి, మూడవ రోజు ఉదయం 3:45కి వెలంకన్ని చేరుతుంది. తిరుగు ప్రయాణమైన 07362 ట్రైన్ ఆగస్టు 29, సెప్టెంబర్ 3, 8 తేదీల్లో వెలంకన్ని నుంచి రాత్రి 11:55కి బయలుదేరి, మూడవ రోజు ఉదయం 3:00కి వాస్కోకు చేరుతుంది. ఈ ట్రైన్ మడగావ్, హుబ్బళ్లి, బెంగుళూరు SMVT, సేలం, తంజావూరు, నాగపట్నం వంటి ప్రముఖ స్టేషన్ల వద్ద ఆగుతుంది. ఈ రైలు మొత్తం 20 కోచ్‌లతో ఉండనుండగా, అందులో 2 AC 2-tier, 4 AC 3-tier, 10 స్లీపర్, 2 జనరల్, 2 SLR కోచ్‌లు ఉంటాయి.
☀ బుకింగ్ సమాచారం ఇలా తెలుసుకోండి
ఈ పండుగ రద్దీ రోజుల్లో టికెట్‌లు ముందే బుక్ చేసుకోవడం ఎంతో అవసరం. అందుకే ప్రతి రైలు టైమింగ్‌లు, ఆగే స్టేషన్లు, టికెట్ వివరాల కోసం మీరు www.enquiry.indianrail.gov.in లేదా NTES యాప్ ద్వారా తనిఖీ చేయవచ్చు. ప్రయాణం సురక్షితంగా ఉండాలంటే ముందస్తు ప్రణాళిక తప్పనిసరి.
ఈ వినాయక చవితి వేళ రైల్వే శాఖ చేసిన ప్రత్యేక ఏర్పాట్లు అనేక మంది ప్రయాణికులకు ఊరటను అందించనున్నాయి. ముఖ్యంగా గ్రామాలకు వెళ్లే వలస కార్మికులు, పుణ్యయాత్రికులు ఈ ప్రత్యేక రైళ్ల సౌకర్యాన్ని వినియోగించుకుంటే ప్రయాణం మధురమైన అనుభవంగా మారుతుంది. ముందుగా ప్లాన్ చేసుకొని, టికెట్లు బుక్ చేసుకొని, గణేశుని ఆశీస్సులతో మీ గమ్యస్థానానికి సురక్షితంగా చేరండి!