భారతీయ రైల్వే ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రైల్వే వ్యవస్థగా గుర్తింపు తెచ్చుకుంది. నిత్యం లక్షలాది మంది ప్రయాణీకులకును గమ్యస్థానాలకు చేర్చుతుంది. అయితే, తరచుగా దేశంలో రైలు ప్రమాదాలు జరుగుతుంటాయి. వాటిల్లో ఎక్కువగా రైలు పట్టాలు తప్పిన ఘటనలే ఉంటాయి. వాస్తవానికి గత దశాబ్ద కాలంగా తీసుకుంటున్న భద్రతా చర్యల కారణంగా రైలు ప్రమాదాలు గణనీయంగా తగ్గినప్పటికీ అక్కడో ఇక్కడో ఎప్పుడో ఒకసారి ట్రైన్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. అయితే, రైలు పట్టాలు తప్పిన సమయంలో బోగీలన్నీ చెల్లాచెదురుగా పడిపోతాయి. ట్రాక్ కూడా దెబ్బతింటుంది. బోగీలను నేరుగా ట్రాక్ మీదికి తీసుకురావడం కష్టం. ముందుగా ట్రాక్ సరిచేసి, ఆ తర్వాత వాటిని పట్టాలెక్కించాల్సి ఉంటుంది. ఇంతకీ, రైల్వే బోగీలను మళ్లీ ఎలా ట్రాక్ ఎక్కిస్తారనేది ఇప్పుడు తెలుసుకుందాం..
పట్టాలు తప్పిన రైలును మళ్లీ ట్రాక్ ఎక్కించడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు. చాలా కష్టపడాల్సి ఉంటుంది. పట్టాలు తప్పిన రైలును మళ్లీ పట్టాల మీదకు తీసుకురావడానికి రీరైలర్లు అని పిలిచే ప్రత్యేక ఐరన్ టూల్స్ ను ఉపయోగిస్తారు. ఈ రీరైలర్ల వాలుగా ఉండే డిజైన్, రైలు చక్రాలను నెమ్మదిగా ట్రాక్ పైకి నడిపిస్తుంది. ఇది సాధారణంగా చిన్న పట్టాలు తప్పిన సంఘటనలలో సులభంగా జరుగుతుంది. కానీ, ప్రమాదం పెద్ద స్థాయిలో ఉన్నప్పుడు మరింత సమగ్రమైన క్లీనప్, మరమ్మత్తు పనులు అవసరమవుతాయి.
⦿ పరిస్థితిని అంచనా వేయడం: రైల్వే అధికారులు ముందుగా సంఘటన జరిగిన స్థలం, ఎంత వరకు రైలు పట్టాలు తప్పిందో అంచనా వేస్తారు.
⦿ రీరైలర్ల అమరిక: పట్టాలు తప్పిన రైలు చక్రాల దగ్గర రీరైలర్లు అనే లోహపు బ్లాకులను అమరుస్తారు.
⦿ బోగీని ట్రాక్ మీదికి తీసుకురావడం: రైలును నెమ్మదిగా ముందుకు కదిలిస్తున్నప్పుడు, రీరైలర్ల వాలుగా ఉండే ఉపరితలంపైకి చక్రాలు వచ్చి నెమ్మదిగా ట్రాక్‌లోకి తిరిగి ఎక్కేలా చేస్తాయి.
⦿ సర్దుబాటు: అవసరమైతే, రైలును సరైన స్థానానికి తీసుకురావడానికి, ట్రాక్ పై సరిగ్గా ఉండేలా చూడటానికి అదనపు సహాయం, టైల్స్ ఉపయోగిస్తారు.
⦿ పెద్ద సంఘటనల విషయంలో: కొన్నిసార్లు రైలు పట్టాలు తప్పిన ఘటనలు చాలా భారీగా ఉంటాయి. అలాంటి సమయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముందుగా బోగీలను పట్టాల మీది నుంచి పక్కకు జరుపుతారు. ఆ తర్వాత ట్రాక్ లను సరి చేస్తారు. ట్రాక్ లు రెడీ అయిన తర్వాత ముందుగా భద్రతా చర్యలో భాగంగా టెస్ట్ రైలును నడిపిస్తారు. అంతా ఓకే అనుకున్న తర్వాత బోగీలను పట్టాలు ఎక్కిస్తారు.
నిజానికి పట్టాలు తప్పిన రైలును తిరిగి పట్టాల మీదకు తీసుకురావడం అనేది ఎంతో కష్టమైన పని. దీనికి శిక్షణ పొందిన సిబ్బందితో పాటు ప్రత్యేక పరికరాలు అవసరం అవుతాయి. అయితే, రైలు పట్టాలు తప్పిన ఘటన స్థాయిని బట్టి పని ఎంత సేపట్లో కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది? అనేది అధికారులు ముందుగానే అంచనా వేస్తారు. దానికి అనుగుణంగా పనులు చేపడుతారు. గంటల నుంచి రోజుల వరకు సమయం పట్టే అవకాశం కూడా ఉంటుంది.
Read Also: ఇండియాలోనే అతి చిన్న ప్లాట్‌ఫాం కలిగిన రైల్వే స్టేషన్ ఇదే.. అంత చిన్నదా?