భారత్ లో విస్తృతమైన రైల్వే నెట్ వర్క్ ఉంది. సుమారు లక్ష కిలో మీటర్ల మేర రైల్వే లైన్లు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా 7800 పైగా రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవలే మిజోరాంలో మొదటి రైల్వే లైన్ తో పాటు సైరంగ్ రైల్వే స్టేషన్ ను ప్రారంభించారు. అటు మణిపూర్ మొదటి రాజధాని ఎక్స్ ప్రెస్ ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లలో కొన్ని యూనిక్ స్టేషన్లు ఉన్నాయి. వాటలో ఒకటి ఒడిశాలోని బన్స్పాని ఉంది. ఈ రైల్వే స్టేషన్ అత్యంత ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది దేశంలోనే అతి చిన్న ప్లాట్ ఫామ్ రైల్వే స్టేషన్!
దేశంలోని అతి చిన్న రైల్వే స్టేషన్ ఒడిశా జోడా మునిసిపాలిటీ పరిధిలో ఉన్న బన్స్పాని రైల్వే స్టేషన్ (BSPX). దీని పొడవు కేవలం 140 మీటర్లు. ఈ స్టేషన్ కు ఒకే ఒక ప్లాట్ ఫామ్ ఉంది.ఇక్కడ రైలు ఏ ప్లాట్ ఫామ్ మీదికి వస్తుందో తెలుసుకునేందుకు సైన్ బోర్డును చూడాల్సిన అవసరం లేదు. అద్భుతమైన పచ్చదనం, అందమైన ప్రకృతి దృశ్యాల మధ్య ఎంతో అందంగా ఉంటుంది. నిజాముద్దీన్, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ల లాంటి రద్దీగా ఉండే స్టేషన్లకు భిన్నంగా ఇది చాలా ప్రశాంతంగా ఉంటుంది. తక్కువ సంఖ్యలో రైళ్లు రాకపోకలు కొనసాగిస్తాయి. దాని పరిమాణం కారణంగా, బన్స్పాని రైల్వే స్టేషన్ లో చిన్న ప్యాసింజర్ రైళ్లు, ఎంపిక చేసిన కోచ్‌లు మాత్రమే అక్కడ ఆగుతాయి. ప్రస్తుతానికి, ఈ స్టాప్ లో కేవలం మూడు రైళ్లు మాత్రమే సేవలు అందిస్తున్నాయి:
1.బ్రహ్మాపూర్-టాటానగర్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ (20892)
2.బార్బిల్-పూరి ఎక్స్‌ప్రెస్ (18415), పూరి-బార్బిల్ ఎక్స్ ప్రెస్ (18416)
3.టాటానగర్-విశాఖపట్నం సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ (20815)
ఇక ఈ రైల్వే స్టేషన్ లో ప్రయాణీకులకు అవసరమైన ప్రాథమిక సౌకర్యాలు ఉన్నాయి. వెయిటింగ్ హాల్, టాయిలెట్స్ అందుబాటులో ఉన్నాయి.
Read Also: వేగంగా వస్తున్న.. వందే భారత్ ముందుకు దూకిన కుక్క.. తర్వాత జరిగింది ఇదే!
ఇక ఈ రైల్వే స్టేషన్ చిన్నగా ఉన్నప్పటికీ, ఒడిశాలోని మారుమూల ప్రాంతాలను, ముఖ్యంగా కియోంఝర్ జిల్లాలోని పెద్ద రైల్వే నెట్ వర్క్ కు అనుసంధానించడంలో ఈ స్టేషన్ కీలక పాత్ర పోషిస్తుంది. వాస్తవానికి, ఈ స్టేషన్ ఇనుప ఖనిజం లాంటి సరుకు రవాణాకు సపోర్టు చేసేలా నిర్మించబడింది. ఇనుపు ఖనిజం ఈ ప్రాంతంలో సమృద్ధిగా లభిస్తుంది. రైల్వే స్టేషన్ స్థనిక ప్రజలకు జీవనాడిగా కొనసాగుతుంది. గ్రామీణ ప్రాంతాలను పెద్ద పట్టణాలు, నగరాలతో కనెక్ట్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మొత్తంగా ఈ రైల్వే స్టేషన్ భారతీయ రైల్వేలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అతి చిన్న రైల్వే స్టేషన్ గా ముద్ర వేయించుకుంది.
Read Also: పూరికి నేరుగా వందే భారత్ రైలు.. ఎక్కడి నుంచి అంటే?