About Pahalgam: కాశ్మీర్‌ను భూమిపై స్వర్గంగా పిలుస్తారు. ఇక్కడి ప్రకృతి సౌందర్యం, మంచుతో కప్పబడిన పర్వతాలు, అందమైన లోయలు కాశ్మీర్ అందాన్ని మరింత పెంచుతాయి. ఇక్కడి ప్రశాంతమైన సరస్సులు, పచ్చని తోటల గురించి చెప్పడానికి మాటలు చాలవు. కాశ్మీర్ ప్రకృతి మనకు ప్రసాదించిన అమూల్యమైన బహుమతి మాత్రమే కాదు.. గొప్ప సంప్రదాయాల సంగమం కూడా. కాశ్మీర్ సంస్కృతి కూడా చాలా గొప్పది.
కాశ్మీర్‌లోని ఈ విషయాలే దేశం, ప్రపంచం నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తాయి. అనేక చోట్ల హిల్ స్టేషన్లు ఉన్నప్పటికీ.. ప్రయాణం చేయడానికి ఇష్టపడే చాలా మంది ఖచ్చితంగా జమ్మూ కాశ్మీర్‌ను ఒకసారి సందర్శించాలని కోరుకుంటారు. ఇతర ప్రదేశాలతో పోలిస్తే జమ్మూ కాశ్మీర్‌కు వెళ్లడం కాస్త ఖరీదే. నిజానికి, జమ్మూ కాశ్మీర్ వెళ్లడానికి ఎక్కువ సమయం పడుతుంది. ప్రయాణ బడ్జెట్ కూడా ఎక్కువగా ఉండాలి.
కాశ్మీర్‌లో చూడటానికి చాలా గొప్ప ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడి ప్రకృతి అందాలను చూడటానికి రెండు కళ్లు సరిపోవు. రాజధాని శ్రీనగర్‌తో పాటు, కత్రా, పహల్గాం, గుల్‌మార్గ్, సోనామార్గ్ మొదలైన ప్రాంతాల్లో అనేక టూరిస్ట్ స్పాట్‌లు ఉన్నాయి. ముఖ్యంగా పహల్గామ్ యొక్క ప్రకృతి సౌందర్యం చూపరును ఆకట్టుకుంటుంది. అందుకే ఈ ప్రదేశానికి ప్రతి రోజు వేలల్లో టూరిస్టులు వస్తారు. ఇంతకీ పహల్గామ్ ప్రత్యేకలు ఏమిటి ? టూరిస్టులు ఎక్కువగా రావడానికి గల కారణాలు ఏమిటి అనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పహల్గామ్ విశేషాలు:
పహల్గాం ఒక అద్భుతమైన హిల్ స్టేషన్. దీనిని “వాలీ ఆఫ్ షెపర్డ్స్” (గొర్రెల కాపరుల లోయ) అని కూడా పిలుస్తారు. ప్రకృతిసౌందర్యం, నదులు, పర్వతాలు, అడవులు, గ్లేసియర్‌లు దీనికి ప్రత్యేక ఆకర్షణలు.
చూడదగిన ముఖ్యమైన ప్రదేశాలు:
1. చందన్వాడి:
చందన్వాడి పహల్గామ్ నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది అమర్నాథ్ యాత్రలో మొదటి స్టాప్ . ఏప్రిల్ – జూన్ మధ్య ఇక్కడ తెల్లటి మంచు పలకలు ఇక్కడి కొండలపై ఏర్పడతాయి. చందన్వాడిలో మంచుతో ఆడుకోవడం, ఫోటోలు తీయడం, ప్రకృతి మధ్య సమయం గడపడంలో వారికి చాలా సరదాగా ఉంటుంది. సమ్మర్ లో కూడా ఇక్కడ చల్లదనం ఉంటుంది. దీని వల్ల ఈ స్థలం మరింత ప్రత్యేకంగా కనిపిస్తుంది.
2. బైసరన్ లోయ:
బైసరన్ లోయను “మినీ స్విట్జర్లాండ్” అని కూడా పిలుస్తారు. పహల్గామ్ నుండి 5 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేస్తే ఇక్కడికి చేరుకోవచ్చు . చుట్టూ ఎత్తైన పైన్ చెట్లు, విశాలమైన పొలాలు, మంచుతో కప్పబడిన శిఖరాలు ఈ లోయను మరింత అందంగా కనిపించేలా చేస్తాయి. ఇక్కడికి చాలా మంది పిక్నిక్ కోసం వస్తుంటారు. గుర్రపు స్వారీ చేయడానికి కూడా ఇక్కడ అవకాశం ఉంటుంది. చుట్టుపక్కల కొండలను కూడా ఆస్వాదించవచ్చు.
3. శేషనాగ్ సరస్సు:
శేషనాగ్ సరస్సు పహల్గాం నుండి 27 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అమర్‌నాథ్ యాత్రకు వెళ్ళే మార్గంలో ఇది వస్తుంది. ఈ సరస్సు అన్ని వైపులా మంచు పర్వతాలతో చుట్టుముట్టబడి ఉంటుంది.మీరు ప్రశాంతతను ఇష్టపడి, జనసమూహానికి దూరంగా ప్రకృతితో కొంత సమయం గడపాలనుకుంటే.. ఈ ప్రదేశం మీకు సరైనది.
Also Read: ఉగ్ర దాడి ప్రభావం.. వెల వెల బోతున్న టూరిస్ట్ స్పాట్‌లు
4. అరు లోయ:
పహల్గాం నుండి కేవలం 12 కి.మీ దూరంలో ఉన్న అరు లోయ, ట్రెక్కింగ్, క్యాంపింగ్ , ఫోటోగ్రఫీకి చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి పచ్చదనం, ప్రవహించే లిడ్డర్ నది , స్వచ్ఛమైన గాలి మనసును ఉల్లాసపరుస్తాయి. అరు సమీప ప్రాంతాల్లో నివసించే ప్రజలు కూడా పర్యాటకులకు చాలా నచ్చుతారు. మీరు శబ్దాలకు దూరంగా ఉండాలనుకుంటే అరు వ్యాలీ మంచి ప్రదేశం కావచ్చు.
5. కోలహోయ్ హిమానీనదం:
కొలహోయ్ గ్లేసియర్ అద్భుతమైన ప్రదేశం. ఇది పహల్గామ్ నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడికి చేరుకోవడానికి కొంచెం ట్రెక్కింగ్ చేయాలి. కానీ మార్గం చాలా అందంగా ఉంటుంది. ఈ ప్రదేశం ముఖ్యంగా ప్రకృతి సౌందర్యంతో పాటు కొంచెం థ్రిల్‌ను కోరుకునే సాహస ప్రియులకు అనువైనది.