Ajith Kumar:ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) గురించి విషయాలు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకవైపు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే.. మరొకవైపు తనకు ఇష్టమైన రేసింగ్ లో తన అభిరుచిని చాటుకుంటూ దూసుకుపోతున్నారు. అయితే ఇప్పుడు ఈయన సడన్గా చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. తాను ఏదో ఒక రోజు బలవంతంగా సినిమాలకు దూరం కావొచ్చని, అజిత్ ఓ ఇంటర్వూలో పాల్గొని తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఎప్పుడు ఏం జరుగుతుందో మనం చెప్పలేము. సినిమాల నుంచి రిటైర్మెంట్ పై నేనేమీ ప్లాన్ చేయట్లేదు. కానీ బలవంతంగా తప్పుకోవాల్సిన రోజు మాత్రం రావచ్చు. ఉదయాన్నే నిద్ర లేచి బ్రతికి ఉండడమే ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. అందుకే ప్రతి క్షణాన్ని కూడా ఆస్వాదించాలి అనుకుంటున్నాను” అంటూ అజిత్ తెలిపారు. ప్రస్తుతం అజిత్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
అజిత్ కుమార్ సినిమాలు..
ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అజిత్ కుమార్ ఇవాళ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మొదటి రెండు రోజుల్లోనే పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు కూడా భారీగానే వచ్చాయి. ఈ సినిమా విడుదలైన అతి తక్కువ సమయంలోనే రూ. 200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీకి కూడా సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ ద్వారా ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. మే 8వ తేదీన నెట్ ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ కి వస్తున్నట్లు మేకర్స్ కూడా ప్రకటించారు. మొత్తానికి అయితే థియేటర్లలో భారీగా సందడి చేసిన ఈ సినిమా.. అటు ఓటీటీ వేదికగా కూడా ఆడియన్స్ ను మెప్పించడానికి సిద్ధమవుతోంది. మరి ఓటీటీలో ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.
క్షేమంగా కోలుకున్న అజిత్..
ఇటీవల కార్ రేసింగ్ లో భాగంగా వరుసగా ప్రమాదాలకి గురవుతున్న అజిత్.. దేవుడు దయతో ఎటువంటి గాయాలు కాకుండానే బయటపడుతున్న విషయం తెలిసిందే. కానీ ఇటీవల ఆయనకు పద్మభూషణ్ అవార్డు లభించింది. రాష్ట్రపతి చేతులమీదుగా అజిత్ పద్మభూషణ్ అవార్డును తీసుకొని తిరిగి చెన్నై ఎయిర్ పోర్ట్ లో దిగగా.. వెంటనే ఆయనను చూడడానికి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో తొక్కిసలాట జరగగా.. ఆ సమయంలో ఆయన కాలికి ప్రమాదమైందని హాస్పిటల్లో చేరారని తెలిపారు. ఇక ఇటీవల ఆయన డిశ్చార్జ్ కూడా అయినట్లు సమాచారం. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లు తెలుస్తోంది.