Anchor Lobo:ప్రస్తుత కాలంలో సినీ సెలబ్రిటీలు సినిమాల కంటే బయట విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పుడు తాజాగా యాంకర్ లోబో అలియాస్ మహమ్మద్ ఖయ్యూమ్ వార్తల్లో నిలిచారు. ఈయనకు జనగామ కోర్టు ఏడాది జైలు శిక్షతోపాటు రూ.12,500 జరిమానా విధించింది. ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. 2018లో లోబో కారు నడుపుతూ హైదరాబాద్ వస్తుండగా.. జనగామ జిల్లా నడిగొండ వద్ద ఆటోని ఢీకొట్టాడు. దీంతో ఆటోలో ఉన్న పెంబర్తి మణెమ్మ, మేడే కుమార్ మరణించారు. అటు కారు కూడా బోల్తాపడడంతో లోబో తోపాటు అందులో ఉన్న పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కేస్ నిన్న విచారణకు రాగా కోర్టు తీర్పు వెలువరించింది. అలా కోర్టు తీర్పుతో లోబో ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించబోతున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి దీనిపై లోబో ఎలా స్పందిస్తారో చూడాలి.
అసలేం జరిగిందంటే?
జనగామ జిల్లా రఘునాథపల్లి సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సై నరేష్‌ల కథనం ప్రకారం.. 2018 మే 21న ఓ టీవీ ఛానల్ తరఫున వీడియో చిత్రీకరణ కోసం లోబో బృందం రామప్ప, లక్నవరం, భద్రకాళి చెరువు, వేయిస్తంభాల ఆలయం తదితర ప్రాంతాల్లో పర్యటించింది. అనంతరం లోబో స్వయంగా కారు నడుపుతూ వరంగల్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా.. రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద ఎదురుగా వచ్చిన ఆటోను ఢీకొట్టారు. ఆటోలో ప్రయాణిస్తున్న ఖిలాషాపురం గ్రామానికి చెందిన మేడె కుమార్, పెంబర్తి మణెమ్మలు తీవ్ర గాయాలతో మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. కారు కూడా బోల్తా పడటంతో లోబోతో పాటు బృంద సభ్యులకు స్వల్ప గాయాలయ్యాయి. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అప్పట్లో రఘునాథపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఏడేళ్ల తర్వాత వెలువడిన తీర్పులో.. ఇద్దరి మృతికి కారణమైన లోబోకు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.12,500 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చినట్లు పోలీసులు వివరించారు.
లోబో కెరియర్..
లోబో విషయానికి వస్తే 1982 జూలై 17వ తేదీన హైదరాబాద్లో జన్మించారు. 2015లో అర్షియాను వివాహం చేసుకున్న ఈయన హైదరాబాదులో నివసిస్తున్నారు. టాటూ ఆర్టిస్టుగా కెరియర్ మొదలుపెట్టి.. ఆ తర్వాత యాంకర్ గా తన ప్రయాణాన్ని మార్చుకున్నారు. డ్రెస్సింగ్, మేకప్ కి ప్రసిద్ధి చెందిన లోబో అనేక టెలివిజన్ షోలలో కనిపించి, యాంకర్ గా సత్తా చాటారు బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 రియాలిటీ షోలో భాగమైన ఈయన.. ఐదవ సీజన్లో కామెడీ స్థానాన్ని భర్తీ చేశాడు.. ముఖ్యంగా తన వ్యవహార శైలితో అందరినీ ఎలా అయితే నవ్వించాడో.. హౌస్ లో ఉన్న ఆడవాళ్లను కూడా తెగ ఏడిపించేవాడు. పైగా హౌస్ లోపల ఉన్న కంటెస్టెంట్లతో పాటు ప్రేక్షకులకు మజా పంచిన ఈయన ఐదవ సీజన్ కి బెస్ట్ ఎంటర్టైనర్ అనే పేరును కూడా దక్కించుకున్నారు. ఇకపోతే అప్పుడప్పుడు ఈయన వ్యవహార శైలి విచిత్రంగా ఉండడంతో పలువురుతో గొడవలు దిగాడు. మరీ ముఖ్యంగా నటి ప్రియాతో ఒక రేంజ్ లో ఫైట్ చేశాడు . అప్పటివరకు ప్రేక్షకులను అలరించిన లోబో అనూహ్యంగా కంటెస్టెంట్స్ తో గొడవ పెట్టుకొని తన క్యారెక్టర్ ని కూడా బ్యాడ్ చేసుకున్నారు. దాంతో కొద్దిరోజులకే ఇతడు ఎలిమినేట్ అవ్వడంతో.. తనది ఫేక్ ఎలిమినేషన్ అని సీక్రెట్ రూమ్ లో ఉండి, మళ్ళీ హౌస్ లోకి అడుగుపెట్టారు. తర్వాత తన క్లోజ్ ఫ్రెండ్ రవితో కూడా గొడవ పెట్టుకుని హౌస్ నుంచి బయటకు వచ్చారు.
లోబో నటించిన చిత్రాలు..
అలా బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా పాల్గొనడమే కాకుండా యాంకర్ గా కూడా పలు వ్యవహరించిన ఈయన.. సినిమాలలో కూడా పనిచేశారు. ఇది మా ప్రేమ కథ, కుమారి 21ఎఫ్ , పైసా వంటి చిత్రాలలో నటించారు. ప్రముఖ సీనియర్ కమెడియన్ ఆలీకి సమీప బంధువు కూడా.. ఇతనికి హైదరాబాదులో టాటూ పార్లర్ కూడా ఉంది.