Bindas Brothers: టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్స్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో భాస్కర్(Bhaskar), జ్ఞానేశ్వర్ (Gyaneswar) ఒకరు. వీరి అసలు పేర్లతో పిలిస్తే బహుశా ఎవరికీ గుర్తుకు రాకపోవచ్చు కానీ పటాస్ బిందాస్ బ్రదర్స్(Bindas Brothers) అంటే మాత్రం టక్కున వీరు అందరికీ గుర్తుకు వస్తారు. బుల్లితెరపై ప్రసారమౌతూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న కార్యక్రమాలలో పటాస్(Patas) కార్యక్రమం ఒకటి ఈ కార్యక్రమం ఎంతోమందికి మంచి జీవితాలను ప్రసాదించిందని చెప్పాలి. పటాస్ కార్యక్రమం ద్వారా ఫేమస్ అయిన వారిలో భాస్కర్, జ్ఞానేశ్వర్ కూడా ఒకరు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వీరు తమ కెరియర్ ఎలా ప్రారంభమైంది, ఏంటి అనే విషయాల గురించి అభిమానులతో పంచుకున్నారు.
ఇంటర్ ఫెయిల్..
నిజానికి వీరిద్దరూ బ్రదర్స్ కాదని బావ బావమరుదులు అవుతామని ఈ సందర్భంగా తెలిపారు. అయితే తాను ఇంటర్ ఫెయిల్ అయ్యానని భాస్కర్ తెలిపారు. ఇంటర్ ఫెయిల్ అయిన తర్వాత ఏదో ఒక పని చేసుకోవడం కోసం క్యాటరింగ్ వెళ్ళాం, వాటర్ బాటిల్ మోయడం ఇలా ఎన్నో రకాల పనులు చేసామని తెలిపారు. అయితే అన్నపూర్ణ స్టూడియోలో పటాస్ కార్యక్రమానికి ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి వెళ్ళాం. అక్కడికి వెళ్తే సుమారు 700 మంది ఆడిషన్ కి వచ్చారని తెలిపారు. ఇలా వారందరిని దాటుకొని మేము ఆడిషన్స్ ఇచ్చి సెలెక్ట్ అయ్యామని తెలిపారు.
బంధువుల నుంచి విమర్శలు…
ఇలా పటాస్ కార్యక్రమానికి సెలెక్ట్ అయ్యామంటూ ఫోన్ రావడంతో ఇక మేము సెలబ్రిటీలు అయిపోయామని మా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అక్కడికి వెళ్తే మరో వంద మందిని ఆడిషన్స్ చేశారని, ఆ వంద మందిలో ఏడుగురిని సెలెక్ట్ చేసి మాకు పటాస్ కార్యక్రమంలో ఛాన్స్ కల్పించారు అంటూ భాస్కర్ తెలిపారు. ఇక మేము టీవీలలో కనిపించేసరికి మా బంధువులందరూ షాక్ అయ్యారు. కొంతమంది అవసరమా ఇండస్ట్రీలోకి వెళ్లడం అంటూ విమర్శించారు, మరి కొంతమంది మంచి నిర్ణయమే అంటూ పొగిడారని తెలిపారు. ఇక మేము టీవీలలో కనిపించేసరికి వీడికి బాగా డబ్బు ఉంది అదీ, ఇదీ అని మాట్లాడేవారు. ఇలా బయట జనాల దృష్టిలో మేము పెద్ద సెలబ్రిటీలు అయినప్పటికీ మా దగ్గర డబ్బులు మాత్రం ఉండేవి కాదని అప్పట్లో ఒక్కో ఎపిసోడ్ కు 2000 మాత్రమే ఇచ్చేవారు.
వర్షం వస్తే ఇల్లంతా నీళ్లే…
ఈ 2000లో 200 కట్ చేసుకుని 1800 మాత్రమే రెమ్యూనరేషన్(Remuneration) ఇచ్చే వారని భాస్కర్ తెలిపారు. ఇక అప్పుడు మేము రేకుల ఇంట్లో ఉండే వాళ్ళం, వర్షం వస్తే ఇంట్లో ఉండటానికి కూడా లేకుండా మొత్తం వర్షం నీళ్లు నిండిపోయేవి అలా ఎన్నో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నామని తమ కన్నీటి కష్టాలను ఈ సందర్భంగా తెలియజేశారు. అయితే ఇప్పుడు మాత్రం సొంత ఇంటి కల నెరవేరిందని, పటాస్ కార్యక్రమం మా జీవితాన్ని మార్చేసింది అంటూ ఈ సందర్భంగా బిందాస్ బ్రదర్స్ వారి జీవితాల గురించి, జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.