Kissik Talks: కిస్సిక్ టాక్స్ 75వ ఎపిసోడ్ సెలబ్రేషన్స్ సందర్భంగా జరిగిన సంభాషణలో సరదా, కామెడీతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. ఫైమా, యాదమరాజు, విష్ణుప్రియ, డెమోన్ పవన్, వర్ష తదితరులు పాల్గొన్న ఈ వేడుకల్లో ఒకరినొకరు ఆటపట్టించుకుంటూనే తమ అనుభవాలను పంచుకున్నారు. ముఖ్యంగా యాదమరాజు , సోనియా ఆకుల ఫైమాలు పెళ్లి తర్వాత కుటుంబ బంధాల్లో వచ్చే మార్పులపై జరిగిన చర్చ ఆసక్తికరంగా సాగింది.
అయితే ఈ సరదా సంభాషణల మధ్య ఫైమా మాట్లాడుతూ. తమ కుటుంబంలో నలుగురు అమ్మాయిలే ఉన్నారని, అందుకే తాను తన తల్లిదండ్రులను ఒక కొడుకులా చూసుకున్నానని ఆమె చెప్పింది. అమ్మాయిగా పుట్టినా తల్లిదండ్రుల బాధ్యతను తీసుకోవడంలో తాను ఎప్పుడూ వెనుకడుగు వేయలేదని క్లారిటీ ఇచ్చింది.
పెళ్లి తర్వాత మాత్రం ఆ బాధ్యతలో ప్రవీణ్ రూపంలో కొత్త వ్యక్తి చేరాడని ఆమె చెప్పింది. తన స్థానాన్ని అల్లుడు తీసుకున్నాడని, కేవలం అల్లుడిగా కాకుండా కుటుంబానికి కొడుకులా మారాడని వివరించింది. సాధారణంగా పెళ్లి తర్వాత అమ్మాయి తన పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్లడం మాత్రమే కాదు.. ఆమె కుటుంబంతో తన భర్తకు కూడా ఒక కొత్త బంధం ఏర్పడుతుంది. ఆ బంధం ఎలా బలపడుతుందో ఆమె అనుభవం ద్వారా బయట పెట్టింది.
మొదట్లో తన కుటుంబం తనను ఎలా అర్థం చేసుకుంటుందో అనే భయం ఉండేదని, తాను చేసే కొన్ని విషయాలను వాళ్లు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉందేమో అనిపించేదని తెలిపింది. ముఖ్యంగా పెళ్లి తర్వాత తాను మారిపోయానని లేదా కుటుంబాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నానని ఎవరైనా అనుకుంటారేమో అనే సందేహం కూడా తనలో ఉండేదని చెప్పింది.
కానీ కాలం గడిచేకొద్దీ పరిస్థితులు మారాయని ఆమె వివరించింది. తాను ఎప్పుడూ తన కుటుంబాన్ని మానిప్యులేట్ చేయలేదని, వాళ్లను బలవంతంగా తన ఆలోచనలకు అనుగుణంగా మార్చే ప్రయత్నం చేయలేదని స్పష్టం చేసింది. బదులుగా ఒక్కో విషయాన్ని నెమ్మదిగా అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్లానని చెప్పింది. అదే సమయంలో కుటుంబ సభ్యులు కూడా తన నిర్ణయాలను అర్థం చేసుకోవడం ప్రారంభించారని వివరించింది.
సనాతన ధర్మాన్ని తాను అనుసరిస్తున్న విషయాన్ని కూడా ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించింది. తన జీవితంలో తాను పాటిస్తున్న విధానాన్ని చూసి ఇప్పుడు కుటుంబ సభ్యులు కూడా అర్థం చేసుకున్నారని, దానిపై తాను గర్వంగా ఉన్నానని చెప్పింది. ముఖ్యంగా తన కుటుంబం మొత్తం ఇప్పుడు తనపై గర్వపడుతోందని చెప్పడంతో షో కాస్త ఎమోషనల్ గా సాగింది.