Kalki – Lucky Bhaskar:ఈ మధ్యకాలంలో సినిమాలలో కంటే బుల్లితెరపైనే సినిమాలను ఎక్కువగా ఆదరిస్తున్నారని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే వెండితెరపై భారీ సక్సెస్ అందుకున్న సినిమాలు, టెలివిజన్ రంగంలో వెనుకబడిపోతుంటే, థియేటర్లో ఒక మోస్తారుగా మెప్పించిన సినిమాలు టెలివిజన్ రంగంలో అత్యధిక రేటింగ్ సాధిస్తూ సంచలనం సృష్టిస్తూ ఉంటాయి. ఉదాహరణకు గతంలో ‘ఖలేజా’ సినిమా థియేటర్లలో డిజాస్టర్ గా నిలిచినా.. ఇప్పటికీ మంచి టిఆర్పి రేటింగ్ తో బుల్లితెరపై దూసుకుపోతూ ఉంటుంది. ఇదిలా ఉండగా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సినిమాలలో ‘కల్కి 2898AD’ సినిమా కూడా ఒకటి. నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో ప్రభాస్(Prabhas ), అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), దీపికా పదుకొనే (Deepika Padukone), శోభన(Shobhana ) , కమలహాసన్ (Kamal Hassan) వంటి భారీతారాగణంతో వచ్చిన చిత్రం ఇది. భవిష్యత్తుకు మహాభారతంను జత చేసి దర్శకుడు రూపొందించిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.1,000 కోట్లకు మించి కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక కల్కి విడుదలైన చాలా రోజుల తర్వాత వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ అయింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా బుల్లితెరపై మాత్రం ఫ్లాప్ గా నిలిచిందని చెప్పవచ్చు.
బుల్లితెరపై కల్కిను వెనక్కి నెట్టిన లక్కీ భాస్కర్..
సాధారణంగా చిన్న సినిమాలు కూడా మొదటిసారి టెలికాస్ట్ అయిన సమయంలో మినిమం 5.0,6.0రేటింగ్ తో దూసుకుపోతుంటే, కల్కి మాత్రం జీ తెలుగులో టెలికాస్ట్ అయ్యి, కేవలం 5.26 రేటింగ్ మాత్రమే సొంతం చేసుకుంది. వాస్తవానికి వెండితెరపై ఈ సినిమాకి వచ్చిన క్రేజ్ ను చూసి జీ తెలుగు సంస్థ భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. కానీ టెలికాస్ట్ అయిన సమయంలో వచ్చిన రేటింగ్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ అయిన దుల్కర్ సల్మాన్ (Dulquer Salman) , మీనాక్షి చౌదరి (Meenakshi Choudhary)ల మూవీ ‘లక్కీ భాస్కర్’. ఈ సినిమా టెలివిజన్ పై మంచి రేటింగ్ తో దూసుకుపోతోంది. స్టార్ మా టీవీలో స్ట్రీమింగ్ అయిన ఈ లక్కీ భాస్కర్ సినిమాకి దాదాపు 8.48 టిఆర్పి రేటింగ్ లభించింది. గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిన్న సినిమాలలో ఒకటిగా నిలిచిన లక్కీ భాస్కర్.. థియేటర్లలో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇక్కడ ఓటీటీ స్ట్రీమింగ్ లో కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న లక్కీ భాస్కర్ టెలివిజన్ ప్రీమియర్ లో కూడా భారీ రేటింగ్ దక్కించుకుంది. దీన్ని బట్టి చూస్తే ప్రభాస్ కల్కి సినిమా కంటే దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ సినిమాను బుల్లితెరపై ఎక్కువ మంది చూడడం ఆశ్చర్యంగా మారింది అంటూ నెటిజన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు.
ఆశ్చర్యపోతున్న నెటిజన్స్..
ఇకపోతే థియేటర్లు, ఓటీటీ లో చూసినా.. కొన్ని సినిమాలను టీవీలో చూడడానికి ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే కల్కి సినిమాను థియేటర్లలో సూపర్ హిట్ చేసి, ఓటిటి శాటిలైట్ లో మాత్రం ప్రేక్షకులు ఆదరించలేదు అయితే బుల్లితెరపై చూస్తే బాగోదనే అభిప్రాయం కూడా ప్రేక్షకులలో ఉండడం వల్లే రేటింగ్ తక్కువగా నమోదయి ఉంటుందని సమాచారం.