Kissik Talks:తెలుగు చలనచిత్ర నటులు , నిర్మాత, మాజీ పార్లమెంట్ సభ్యుడు మాగంటి మురళీమోహన్ (Murali Mohan) తాజాగా దీపావళి సందర్భంగా బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ (Kissik Talks) కార్యక్రమానికి అతిథిగా వచ్చారు. నవంబర్ 8వ తేదీన బిగ్ టీవీ ఛానల్ వేదికగా రాత్రి 8 గంటలకు ఆదివారం నాడు ప్రసారమయ్యే ఈ ఫుల్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని నిర్వాహకులు విడుదల చేశారు. ఇందులో పాల్గొన్న ఆయన దానాలు చేయడం పై, అలాగే అతిగా దానం చేసే వారిపై కూడా తన అభిప్రాయాలను పంచుకున్నారు.
ఇంటర్వ్యూలో భాగంగా హోస్ట్ వర్ష మాట్లాడుతూ.. “ఎక్కువగా దానాలు చేయడం మంచిదేనా?” అని ప్రశ్నించగా..”.. “దానాలు చేయడం మంచిదే. కానీ ఆ దానం చేయడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. పేద విద్యార్థులను, బాగా చదువుకునే విద్యార్థులను, మంచి మార్కులు ఉన్న వాళ్ళని, లారీ డ్రైవర్లు, బస్ డ్రైవర్లు , వ్యవసాయం చేసుకునే కూలీలు అలాంటి వాళ్లను నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పటివరకు సుమారుగా 1000 మందికి పైగా నేను సహాయాన్ని అందించాను” అంటూ తన దానధర్మాల గురించి చెప్పుకొచ్చారు.
మురళీ మోహన్ ఛారిటబుల్ ట్రస్ట్ ను ఏర్పాటు చేసి ఆర్థికంగా వెనుకబడిన వేలాదిమంది ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నారు. టెన్త్ క్లాస్, ఇంటర్మీడియట్ లలో 85 శాతానికి పైగా మార్కులు సాధించి, ప్రవేశ పరీక్షలలో మంచి మార్కులు తెచ్చుకున్న పేద విద్యార్థుల ఆర్థిక పరిస్థితిని పరిశీలించి.. ఆ తర్వాత ఈ ట్రస్ట్ వారిని దత్తత తీసుకుంటుంది. ఇక ఇప్పటివరకు సుమారుగా 10,000 మందికి పైగా ఇంజనీరింగ్ , మెడిసిన్ విద్యార్థులను దత్తత తీసుకొని వారి చదువుకు అయ్యే పూర్తి ఖర్చులను కూడా ఈ ట్రస్ట్ భరించడం నిజంగా ప్రశంసనీయం అనే చెప్పాలి.
also read:జీవితసత్యం చెప్పిన మురళీమోహన్.. మరి ఎందుకు ఈ పాకులాట!
ఇకపోతే ఈయన దానం చేయడమే కాదు సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా తరచూ పాల్గొంటూ ఉంటారు. సమాజంలో అవయవ దానం పై అవగాహన పెంచేందుకు చొరవ తీసుకున్నారు. అంతేకాదు తన మరణాంతరం కళ్ళను దానం చేసేందుకు చిరంజీవి ఐ అండ్ బ్లడ్ సెంటర్ కు ఆయన అంగీకార పత్రం కూడా ఇవ్వడం గమనార్హం.