Kissik Talks:చలనచిత్ర రంగ పరిశ్రమలో విలక్షణ నటనతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్నారు మురళీమోహన్ (Murali Mohan). నటుడిగానే కాకుండా జయభేరి గ్రూపు అధినేతగా పలు చిత్రాలను నిర్మించి, మంచి ఆదరణ సొంతం చేసుకున్న ఈయన.. అటు రాజకీయ రంగ ప్రవేశం కూడా చేసి 2014 లోకసభ ఎన్నికలలో రాజమండ్రి నియోజకవర్గం నుండి గెలిచి, రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడిగా బాధ్యతలు కూడా చేపట్టారు. ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఈయనది అందవేసిన చేయి.. సినిమాల ద్వారా అటు పొలిటికల్ పరంగా సంపాదించిన ప్రతి రూపాయిని కూడా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టి.. ల్యాండ్ కే ల్యాండ్ మార్క్ గా తన పేరును మార్చుకున్నారు. అలాంటి మురళీ మోహన్ బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ కార్యక్రమానికి దీపావళి స్పెషల్ ఎపిసోడ్ సందర్భంగా విచ్చేశారు.
ఇందులో ఎన్నో విషయాలు పంచుకున్న ఆయన ఇటు సినిమాలు మొదలుకొని.. అటు రాజకీయాల వరకు అలాగే తన బిజినెస్ విషయంపై కూడా స్పందించి ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఇంటర్వ్యూలో భాగంగా.. హోస్ట్ వర్ష ప్రశ్నిస్తూ..” ఎప్పుడైనా సరే మీరు ఆవేశంలో మాట్లాడినప్పుడు ఆ మాటల కారణంగా ఏదైనా నెగెటివిటీ ఎదుర్కొన్నారా?” అని ప్రశ్నించింది. “పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేటప్పుడు కచ్చితంగా కొన్ని రకాల నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తాయి. పాలిటిక్స్ పైన నాకు ఆసక్తి లేకపోయినప్పటికీ ఎన్టీ రామారావు గారు మీద ఉన్నటువంటి అభిమానం, భక్తి, ప్రేమతోనే రాజకీయరంగ ప్రవేశం చేశాను”.
ఆ రోజుల్లో తెలుగు వాళ్లను మద్రాసిగా గుర్తించే వాళ్లే తప్ప ఒక తెలుగువాడిగా గుర్తించలేదు. అలాంటి సమయంలో ఎన్టీ రామారావు గారు తన బట్టలను కూడా తీసేసి ఖాకీ బట్టలు వేసుకొని.. తెలుగువాడు అంటే ఏంటో.. తెలుగు వాడి గొప్పతనం ఏంటో.. తెలుగు వాడి పౌరుషమేంటో దేశం అంత తిరిగి చెప్పాలి మనం అనే పట్టుదల ఆయనలో చాలా ఉండేది. అయితే ఆయన మీద భక్తితోనే నేను కూడా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేటప్పుడు.. నేను మాట్లాడిన కొన్ని మాటల కారణంగా నెగెటివిటీని ఎదుర్కొన్నాను” అంటూ అసలు విషయం చెప్పారు మురళీమోహన్. మొత్తానికైతే తనకు ఇష్టం లేకపోయినా రాజకీయాల్లోకి ఎన్టీఆర్ వల్లే వెళ్లానని చెప్పిన ఈయన.. అక్కడ వచ్చిన నెగిటివిటీని కూడా భరించక తప్పలేదు అంటూ తనదైన శైలిలో చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
also read:నితీష్ తివారీ రామాయణ పార్ట్ -1 మూవీ రివ్యూ..ఈ దృశ్యకావ్యం మెప్పించిందా?
“రాజకీయాల్లోకి వచ్చే యువతకు మీరు ఎలాంటి సలహా ఇస్తారు?” అని వర్షా అడగగా.. “డబ్బులు కావాలని పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారా? లేదా పేరు కోసం పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారా? అనే విషయాన్ని ఆలోచించుకున్న తర్వాతనే రాజకీయాల్లోకి వెళ్లాలి” అంటూ తన అనుభవం పూర్వకంగా చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా ఈ మధ్యకాలంలో ఎక్కువగా రాజకీయరంగ ప్రవేశం చేయడానికి యువత ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలోనే మురళీమోహన్ ఇలాంటి సలహా ఇచ్చారు. మురళీమోహన్ మాట్లాడిన పూర్తి వివరాలకి సంబంధించిన విషయాలు తెలియాలి అంటే దీపావళి సందర్భంగా నవంబర్ 8వ తేదీన రాత్రి 8 గంటలకు బిగ్ టీవీ ఛానల్ వేదికగా ప్రసారమయ్యే ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే.