Rasagnya Reddy:ఈ ఏడాది సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు వైవాహిక బంధం లోకి అడుగుపెడుతున్నారు. కొంతమంది ప్రేమించుకుని అధికారికంగా అభిమానులతో ఈ విషయాన్ని పంచుకుంటే.. మరికొంతమంది నిశ్చితార్థం చేసుకొని సర్ప్రైజ్ ఇస్తున్నారు. ఇంకొంతమంది పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. ఇలా మొత్తానికైతే తమ జీవితాలలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతూ ఇటు అభిమానులను కూడా సంతోషపరుస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో బుల్లితెర నటి తన బాయ్ ఫ్రెండును పరిచయం చేస్తూ.. పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమవుతున్నట్లు ప్రకటించింది.
ఆమె ఎవరో కాదు గుప్పెడంత మనసు సీరియల్ లో సాక్షి పాత్ర పోషించిన రసజ్ఞ రెడ్డి (Rasagnya reddy) . రసజ్ఞ రీతూ అని కూడా పిలవబడే ఈమె.. తెలుగు టెలివిజన్ సినీ రంగాలలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది.. ఈటీవీలో ప్రసారమైన ‘మజిలీ’ అనే సీరియల్ తో నటిగా అరంగేట్రం చేసిన ఈమె నా పేరు మీనాక్షి సీరియల్ లో కూడా నటించి ఆకట్టుకుంది. ఆ తర్వాత గుప్పెడంత మనసు సీరియల్ లో సాక్షి పాత్ర ద్వారా మరింత ఆదరణ సొంతం చేసుకుంది. నవంబర్ 11 1995న తెలంగాణలో హైదరాబాదులో జన్మించిన ఈమె నటనలోకి రాకముందు రాష్ట్రస్థాయి భాస్కర్ బాలు క్రీడాకారిణిగా పలు అవార్డులు కూడా సొంతం చేసుకుంది.
అలాంటి రసజ్ఞ ఇప్పుడు తన తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఏడు అడుగులు వేయడానికి సిద్ధమయింది. ఈ మేరకు అతడితో కలిసి దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది రసజ్ఞ. తన బాయ్ ఫ్రెండ్ పెళ్లి చేసుకుంటావా అని అడగగా దీనికి ఆమె సర్ప్రైజ్ అవుతూ ఎస్ చెప్పింది. ఇక ఈ ఫోటోలను అధికారికంగా తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకుంటూ ఈ విషయాన్ని అభిమానులతో షేర్ చేసింది. రసజ్ఞ తన బాయ్ ఫ్రెండ్ తన వేలికి ఉంగరం తొడుగుతున్న ఫోటోని షేర్ చేస్తూ..” నిజం చెప్పాలంటే జరగాల్సిన విధంగానే అంతా జరిగిపోయినట్లు అనిపిస్తోంది. మనం మన ప్రణాళికలను మనమే వేసుకుంటాం.. ఏ పనులు ఎలా జరగాలో కలలు కంటాం..
అయితే మిగిలినదంతా దేవుడికే వదిలేస్తాం.. ఆయన నాకోసం ఇంతకంటే అందమైనది రాస్తున్నారని నాకు అసలు తెలియదు. ఈ క్షణం కేవలం ఒక ప్రపోజల్ మాత్రమే కాదు.. దేవుడి నిర్ణయం ఎల్లప్పుడూ ప్రత్యేకమైనదే. ముఖ్యంగా ఆయన ప్రణాళికలు మనం కూడా ఊహించిన దాని కంటే గొప్పగా ఉంటాయని ఈ సంఘటన నాకు గుర్తు చేసింది. ఈ అందమైన కొత్త అధ్యాయానికి , జీవితాంతం నిలిచే ప్రేమకు నేను ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను ” అంటూ తెలిపింది.మొత్తానికైతే వివాహానికి సిద్ధమవుతున్నట్లు అభిమానులతో ప్రకటించింది రసజ్ఞ. అయితే ఆమె వివాహం చేసుకోబోతున్న తన బాయ్ ఫ్రెండ్ ముఖాన్ని మాత్రం ఆమె రివీల్ చేయలేదు.
also read:సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన నటి అనిత చౌదరి..ఎన్ని లక్షలంటే?
రసజ్ఞ రెడ్డి కెరియర్ విషయానికి వస్తే.. ఎదలోయల్లో ఇంద్రధనస్సు, మౌన పోరాటం వంటి సీరియల్స్ లో నటించిన ఈమె 2021 లో విడుదలైన ‘నేడే విడుదల’ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత ఖుషి, రొమాంటిక్ గర్ల్ ఫ్రెండ్ , నన్ను దోచేశావే వంటి వెబ్ సిరీస్ లలో కూడా నటించింది . ఇకపోతే రసజ్ఞకు ఇదివరకే నిశ్చితార్థం జరిగింది. ఇక పెళ్లి చేసుకోవాల్సిన సమయంలో విభేదాలు రావడంతో విడిపోయినట్లు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇప్పుడు మరో వ్యక్తితో పెళ్లికి సిద్ధమవుతోంది ఈ ముద్దుగుమ్మ.