VinFast New Electric Scooters: ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి అడుగుపెట్టిన వియత్నాం సంస్థ విన్‌ఫాస్ట్ (VinFast) ఇప్పుడు ఇండియన్ టూ వీలర్ మార్కెట్‌పై దృష్టి పెట్టింది. వచ్చే ఏడాది దేశీయ మార్కెట్లో మూడు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఇవో (Evo), క్యో (Kyo), కైనెట్ (Kinet) అనే మూడు వియత్నామీస్ మోడళ్ల ఆధారంగా వీటిని అభివృద్ధి చేయనుంది. అయితే, భారత్‌లోకి వచ్చే స్కూటర్లు వియత్నాంలో అమ్ముతున్న మోడళ్ల మాదిరిగా ఉండవు. మన రోడ్లకు, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా వీటిలో పలు మార్పులు చేయనున్నారు.
భారత్‌లో విడుదలయ్యే స్కూటర్ల ఛాసిస్, డిజైన్‌లో మార్పులు ఉంటాయని విన్‌ఫాస్ట్ వెల్లడించింది. ముఖ్యంగా మన రోడ్ల పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అందించేలా వీటిని రూపొందిస్తున్నారు. అలాగే, పెద్ద బూట్ స్పేస్ కూడా ఉండే అవకాశం ఉంది. వీటి పేర్లు సైతం మారవచ్చని తెలుస్తోంది. మూడు స్కూటర్లలోనూ హబ్ మౌంటెడ్ మోటార్లను ఉపయోగించనున్నారు. అయితే, వాటి పనితీరు ఒకేలా ఉండదు. ఈ మోడళ్లను స్థానికంగానే తయారు చేయనున్నారు.
ఈ మూడు స్కూటర్లలో ఇవో అత్యంత సరసమైన మోడల్‌గా నిలవనుంది. వియత్నాం వెర్షన్‌లో ఇది రెండు తొలగించగల బ్యాటరీలతో వస్తుంది. మొత్తం బ్యాటరీ సామర్థ్యం 3kWh. ఇందులోని మోటార్ గరిష్టంగా 2.45kW శక్తిని అందిస్తుంది. గంటకు 70 కిలోమీటర్ల గరిష్ట వేగంతో పాటు 165 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది. సీటు కింద 12 లీటర్ల స్టోరేజ్, LCD స్క్రీన్, ముందు డిస్క్ బ్రేక్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
క్యో స్కూటర్‌లో కూడా 3kWh బ్యాటరీ ఉంటుంది. అయితే, దీని మోటార్ 3kW గరిష్ట శక్తిని అందిస్తుంది. దీని క్లెయిమ్ చేసిన రేంజ్ 160 కిలోమీటర్లు. 14 అంగుళాల చక్రాలు, 21 లీటర్ల అండర్‌సీట్ స్టోరేజ్, TFT డిస్‌ప్లే, కీలెస్ ఫంక్షనాలిటీ, హిల్ హోల్డ్ లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
ఈ మూడింటిలో కైనెట్ అత్యంత శక్తివంతమైన స్కూటర్. ఇందులో 5.2kW మోటార్ ఉండగా, గరిష్ట వేగం గంటకు 90 కిలోమీటర్లు. 0-50 కిలోమీటర్ల వేగాన్ని ఆరు సెకన్లలోపే అందుకుంటుంది. అయితే, దీని రేంజ్ 145 కిలోమీటర్లు ఉంటుంది. 22 లీటర్ల స్టోరేజ్ స్పేస్ కూడా ఉంది.
వచ్చే ఏడాది ఈ మూడు స్కూటర్లు భారత మార్కెట్లోకి రానున్నాయి. అయితే, ధరలు, బ్యాటరీ సామర్థ్యం, రేంజ్ లాంటి ఇండియన్ వెర్షన్ వివరాలను విన్‌ఫాస్ట్ ఇంకా వెల్లడించలేదు. మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఇవి టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్, ఏథర్, ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోటీ పడనున్నాయి.
Read Also: మార్కెట్లోకి వచ్చిన 6 నెలల్లోనే ఔట్.. పల్సర్ 180 మళ్లీ దొరకదా?