Anitha Chowdary:సైబర్ నేరగాళ్ల నుండి అప్రమత్తంగా ఉండాలి అంటూ అధికారులు ఎంత చెప్పినా అటు సామాన్యులను మొదలుకొని ఇటు సెలబ్రిటీల వరకు పదేపదే మోసపోతూ తీరని ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో సినీ సెలబ్రిటీ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంది. విమాన టికెట్ బుకింగ్ పేరుతో ఏకంగా రూ.4.14 లక్షలు మోసపోయింది. మరి ఆమె ఎవరు? అసలేం జరిగింది? ఎలా మోసపోయింది? అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఆమె ఎవరో కాదు ప్రముఖ సినీనటి అనితా చౌదరి(Anitha chowdhary). యాంకరింగ్ తో కెరియర్ మొదలుపెట్టిన ఈమె సీరియల్స్ లో నటించి విపరీతమైన ప్రేక్షక ఆదరణ సొంతం చేసుకుంది. ఆ గుర్తింపుతోనే వెండితెరకు పరిచయమైంది. ముఖ్యంగా 1999లో ముప్పలనేని శివ దర్శకత్వంలో దగ్గుబాటి వెంకటేష్ నటించిన ‘రాజా’ సినిమాలో టీవీ యాంకర్ పాత్రలో తొలిసారి నటించింది. ఆ తర్వాత మురారి, సంతోషం, ప్రాణం, ఆనందం, నువ్వే నువ్వే, ఉయ్యాల జంపాల, వరుడు, నిన్నే ఇష్టపడ్డాను, మన్మధుడు ఇలా ఒక్కటేమిటి దాదాపు 60కి పైగా చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. లిటిల్ హార్ట్స్ సినిమాలో హీరో తల్లిగా నటించిన ఈమె.. ఇటు రాజు వెడ్స్ రాంబాయి చిత్రంలో కూడా కీలకపాత్ర పోషించారు. ప్రస్తుతం వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిన ఈమె తాజాగా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారు.
అసలు విషయంలోకి వెళ్తే.. అమెరికాలో ఉన్న తన కుమారుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్దామని ప్లాన్ చేసుకున్న ఈమె.. అందులో భాగంగానే వాషింగ్టన్ డీసీ కి వెళ్లి రావడానికి బిజినెస్ క్లాస్ విమాన టికెట్లు బుక్ చేసుకోవాలని అనుకుంది. అందులో భాగంగానే ఈనెల 12న ట్రావెల్ ఏజెన్సీ కోసం ఇంటర్నెట్ లో వెతకగా.. లో ఫ్లై ట్రావెల్స్ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ పేరు కనిపించింది. అందులోని రాజేష్ అనే ఏజెంట్ నెంబర్ కి సంప్రదించగా.. టికెట్ ధర రూ. 4,14,180 తెలిపారు. ఇక టికెట్ బుకింగ్ చేయాలి అంటే డెబిట్ కార్డ్ వివరాలు కావాలని బాధితురాలికి సూచించారు . వాళ్ళు పంపిన ఒక వ్యూ ఫార్మ్ లో అనిత తన డెబిట్ కార్డ్ వివరాలను కూడా నమోదు చేశారు.
also read:తరుణ్ కి ఈషా సరైన జోడీ.. పెళ్లి పై తల్లి క్లారిటీ!
అయితే ఆ సమయంలో ఆమె ఫోన్లో మాట్లాడుతూ బిజీగా ఉండగా నిందితుడు మొబైల్ కి వచ్చిన ఓటీపీలను కూడా చెప్పాలని సూచించాడు.. అయితే టికెట్ బుకింగ్ కోసమే అయి ఉంటుందని భావించిన ఆమె వెంటనే ఆ వివరాలను వెల్లడించడంతో ఇక క్లియర్ ట్రిప్ ద్వారా సుమారుగా రూ.4,14,180 డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. కానీ ఆ తర్వాత ఆమెకు టికెట్ల బుకింగ్ కి సంబంధించి ఎలాంటి ధ్రువీకరణ రాకపోవడంతో అప్రమత్తమైన అనిత వెంటనే బ్యాంకు కస్టమర్ కేర్ ని సంప్రదించి ఫిర్యాదు చేసింది. అనంతరం సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఏది ఏమైనా అనితా చౌదరి ఇప్పుడు నాలుగు లక్షలకు పైగా అమౌంట్ సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోవడంతో జాగ్రత్తగా ఉండాలి కదా అంటూ ఆమెకు సూచిస్తున్నారు.