ట్విట్టర్ కొన్న మరుక్షణమే.. అప్పటిదాకా సంస్థ సీఈఓగా చేసిన పరాగ్ అగర్వాల్ ను తొలగించాడు… మస్క్. ఆ తర్వాత పిట్ట కంపెనీతో ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నాడు. ఓవైపు ఉద్యోగుల్ని పీకేస్తూనే… మరోవైపు ఉన్న ఉద్యోగులనూ వేధిస్తున్నాడు. ట్విట్టర్ దివాళా తీయకూడదంటే తాను చెప్పినట్టే చేయాలని అందర్నీ ఇబ్బంది పెడుతున్నాడు… మస్క్. దాంతో… ట్విట్టర్ వైపు కన్నెత్తి చూడాలంటేనే భయపడిపోతున్నారు… ఉద్యోగులు. అందుకే… మస్క్ ట్విట్టర్ ని కొని మూడు వారాలు గడిచిపోయిన తర్వాత కూడా… ఆ కంపెనీకి సీఈఓగా పనిచేసేందుకు ఎవరూ ముందుకురావడం లేదు.
ట్విట్టర్ సీఈఓగా ఉండేందుకు మస్క్ కూడా విముఖంగా ఉన్నాడు. తాను ట్విట్టర్ సీఈఓగా ఉండాలని అనుకోవట్లేదని డెలావర్ కోర్టుకు తెలిపాడు… మస్క్. ట్విట్టర్‌తో తన సమయాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నానని, సంస్థను నడిపేందుకు సమర్థుడైన వ్యక్తి కోసం వెతుకుతున్నామని… త్వరలోనే కొత్త సీఈఓను నియమిస్తానని మస్క్ కోర్టుకు తెలియజేసినట్లు చెబుతున్నారు.
మరోవైపు… ట్విట్టర్ సీఈఓగా ఆ కంపెనీ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే మళ్లీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని సాగుతున్న ఊహాగానాలకు… జాక్, చెక్ పెట్టాడు. ట్విట్టర్ సీఈఓగా బాధ్యతలు చేపట్టే అవకాశం వస్తే అంగీకరిస్తారా? అన్న ఓ నెటిజన్ ట్విట్ కు బదులిచ్చిన జాక్ డోర్సే… అలాంటి అవకాశమే లేదని స్పష్టం చేశారు. దాంతో… సహ వ్యవస్థాపకుడిగా ట్విట్టర్లో తన ప్రస్థానం మొదలుపెట్టి… అందులోనే 15 ఏళ్లు పని చేసిన జాక్, స్వయంగా ట్విట్టర్ సీఈవో అయ్యే ప్రసక్తే లేదని చెబుతున్నాడని… ఇక మస్క్ దెబ్బకు కొత్త వ్యక్తి ఎలా ముందుకు వస్తాడని నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు. ట్విట్టర్ నుంచి ఉద్యోగం కోల్పోయిన, ఆ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు ఇప్పటికే మస్క్ తీరుపై విసిగిపోయి ఉన్నారని… ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్విట్టర్ కు కొత్త సీఈవోను వెతికిపట్టుకోవడం, మస్క్ కు అంత ఈజీ కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.