Big Stories

Twitter employees: బాబోయ్.. మస్క్‌తో వేగలేం!

ఏ ట్విట్టర్ ఉద్యోగిని కదిపినా… ఇప్పుడు ఇదే సమాధానం. ఎందుకంటే… మస్క్ పెడుతున్న పని ఒత్తిడి ఓ రేంజ్ లో ఉంది మరి. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని ఎత్తేయడం, రోజూ 12 గంటల పాటు పనిచేయాలని చెప్పడం… కొత్త కొత్త టార్గెట్లు విధిస్తుండటంతో… ట్విట్టర్ సిబ్బంది మస్క్‌తో వేగలేమంటూ బావురుమంటున్నారు. అటు ఉద్యోగాన్ని వదిలేయలేక, ఇటు పనిభారం మోయలేక సతమతమవుతున్న ట్విట్టర్ ఉద్యోగులకు… ఇప్పుడు మస్క్ కొత్త అల్టిమేటం విని హార్ట్ ఎటాక్ వచ్చినంత పని అవుతోంది.

- Advertisement -

ఆర్థికంగా ట్విట్టర్ బలోపేతం కోసమంటూ… అటు పర్మినెంట్, ఇటు కాంట్రాక్ట్ ఉద్యోగులు కలిపి మొత్తం 8 వేల మందిని ఉద్యోగాల నుంచి పీకేసిన మస్క్… ఇప్పుడు సంస్థలోని సిబ్బంది మొత్తానికి అల్టిమేటం ఇచ్చాడు. కష్టపడి పనిచేస్తారా? లేక ఉద్యోగం వదిలేసి వెళ్లిపోతారా? అని గద్దిస్తున్నాడు. అంతేకాదు… కష్టపడి పనిచేస్తామని లిఖితపూర్వక హామీ ఇవ్వాలని మస్క్ ఉద్యోగులపై ఒత్తిడి పెంచుతున్నాడని అంతర్జాతీయ మీడియా అంటోంది. దీనికి సంబంధించి ఇ-మెయిల్‌ ద్వారా ఓ ఫారం కూడా పంపాడని చెబుతున్నారు. అందులో కూడా YES అనే బటన్‌ నొక్కడం తప్ప మరో ఆప్షన్‌ ఇవ్వలేదని చెబుతుండటం కొసమెరుపు. ఇ-మెయిల్ కు రిప్లై ఇవ్వడానికి డెడ్ లైన్ కూడా పెట్టిన మస్క్… స్పందించని ఉద్యోగులు 3 నెలల నోటీసు ఇచ్చి జాబ్ మానేయాలని హుకుం జారీ చేశాడని అంటున్నారు.

- Advertisement -

మస్క్ పంపిన ఇ-మెయిల్ చూసిన ఉద్యోగులు… దానికి ఓకే చెబితే భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందులు వస్తే పరిస్థితి ఏంటని చర్చించుకుంటున్నారు. చాలా మంది సాయం కోసం న్యాయనిపుణులను సంప్రదిస్తున్నారు. మస్క్ మరీ చండశాసనుడిగా ప్రవర్తించడంపై కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యోగులేమీ బానిసలు కాదని, వారితో ఇష్టం వచ్చినట్లు ఆడుకోవడం సరికాదని హితవు పలుకుతున్నాయి. మస్క్ అడిగిన దానికల్లా అంగీకరిస్తూ వెళ్తే… ఉద్యోగులు భవిష్యత్తులో మరిన్ని ప్రయోజనాలను కోల్పోవాల్సి రావొచ్చని హెచ్చరిస్తున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News