TDP Leaders : కాకినాడ జిల్లా తునిలో టీడీపీ నేత, మాజీ ఎంపీపీ పొల్నాటి శేషగిరిరావుపై దాడి ఘటన ఏపీలో పెనుదుమారం రేపుతోంది. వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలపై దాడులు చేయడం సంస్కృతిగా మారిందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో అరాచకం పాలన నడుస్తోందని మండిపడుతున్నారు.
అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పొల్నాటి శేషగిరిరావును టీడీపీ సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, చినరాజప్ప పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి దాడిశెట్టి రాజాపై యనమల తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రత్యర్థి పార్టీ నేతలను అడ్డుకోవడానికి తునిలో ఒక ఆర్గనైజేషన్ పని చేస్తుందన్నారు. దాడిశెట్టి రాజా మంత్రి అయ్యాక ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ దాడికి ప్రభుత్వం, సీఎం జగన్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ దాడి వెనుక ఉన్న వ్యక్తులను పట్టుకోవాలన్నారు.
సీఎం జగన్ గొడ్డలిపోటును రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు వారసత్వంగా తీసుకున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. మంత్రి దాడిశెట్టి రాజా అనుచరులే టీడీపీ నేతపై గొడ్డళ్లతో దాడి చేశారని ఆరోపించారు. ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను నిలదీస్తున్న టీడీపీ నేతలను అణిచివేసేందుకు దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. తుని నియోజకవర్గంలో ఒక వర్గానికి అన్యాయం చేస్తున్న వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వ చర్యలను నిలదీస్తున్నందుకే శేషగిరిరావును చంపడానికి ప్రయత్నించారని ఆరోపించారు. హత్యలు, దాడులు చేసే ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయాలని అచ్చెన్న పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వాన్ని తెచ్చుకోవాలన్నారు. ఈ కేసులో నిందితులను
కటకటాల వెనక్కి పంపే వరకు పోరాడతామని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.