Virat Kohli: అవార్డులు, రివార్డులు విరాట్ కొహ్లీకి కొత్త కాదు. తను వద్దనుకున్నా, తనెక్కడున్నా వెంటపడి మరీ వచ్చి వరిస్తుంటాయి. ఇప్పుడు తను టీ 20 ప్రపంచకప్ కోసం న్యూయార్క్ లో ఉన్నాడు. ప్రాక్టీస్ మ్యాచ్ లో ఆడలేదు. విశ్రాంతి తీసుకుంటూ గడిపాడు. ఈ ఖాళీ సమయంలో ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఐసీసీ ప్రతినిధులు కొహ్లీకి అందించారు. అంతేకాదు ‘ఐసీసీ మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్’ 2023 క్యాప్‌ను కూడా అందించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.
2012, 2017, 2018లో కూడా విరాట్… ఐసీసీ అవార్డు అందుకోవడం విశేషం. ఇకపోతే 2023లో… వన్డే ప్రపంచకప్ తో కలిపి 27 వన్డేలు ఆడిన విరాట్ 1377 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. హయ్యస్ట్ స్కోరు 166గా ఉంది.
అన్నింటికన్నా మించి పాకిస్తాన్ తో జరిగిన ఆసియా కప్ మ్యాచ్ చరిత్రలో నిలిచిపోతోంది. అందులో కొహ్లీ చివరివరకు పోరాడి 122 పరుగులు చేసి నాటౌట్ గా నిలవడమే కాదు.. భారత్ కి చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. అలాగే 2023 వన్డే వరల్డ్ కప్ లో 11 మ్యాచ్ లు ఆడి 765 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అంతేకాదు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంటు అవార్డు అందుకున్నాడు. ప్రపంచకప్ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు.
అవార్డులు, రివార్డులు అందుకునే విరాట్ కొహ్లీ ఇక టీ 20 ప్రపంచ కప్ 2024లో కూడా తన మార్కు చూపించాలని అభిమానులు కోరుకుంటున్నారు. కొహ్లీ గొప్పతనం ఏమిటంటే, పాకిస్తాన్ లో కూడా తనకి అభిమానులున్నారు. ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంటే మాత్రం కొహ్లీ అవుట్ అయిపోతే, వాళ్లు మ్యాచ్ గెలిచినంత సంబరపడిపోతుంటారు. తనొక్కడూ అవుట్ కావాలని అక్కడ ప్రార్థనలు కూడా చేస్తుంటారు.
Also Read: కొహ్లీని కొట్టే మొనగాడున్నాడా ? రికార్డుల రారాజు వెనుక ఉన్నవారెవరు ?
అదే అభిమానులు పాకిస్తాన్ తో కాకుండా ఇతర దేశాలతో మ్యాచ్ ఆడుతుంటే, తను ఇంకా ఎన్నో గొప్ప రికార్డులు సాధించాలని కోరుకుంటూ ఉంటారు. అది కొహ్లీ గొప్పతనమని నెటిజన్లు పేర్కొంటున్నారు.