Telangana Politics: సెప్టెంబర్ 6.. తెలంగాణ రాజకీయాలకు కీలక రోజు కాబోతోంది. ఒకపక్క ఇందిరాపార్క్ దగ్గర కాంగ్రెస్ మహాధర్నా. మరోపక్క ఎర్రవల్లిలో బీఆర్ఎస్‌ఎల్పీ మీటింగ్. రెండూ ఒకే రోజు. కేసీఆర్ ప్రతిపక్ష నేతగా రాజీనామా చేయాలన్నదే కాంగ్రెస్ డిమాండ్. వెయ్యి రోజులుగా అసెంబ్లీకి రాకుండా, ప్రజలకు దూరంగా ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని సీఎం రేవంత్ రెడ్డి.. కేసీఆర్‌ని నేరుగా టార్గెట్ చేశారు. అసెంబ్లీకి రాకపోయినా జీతం, భద్రత రూపంలో కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చవుతోందని కాంగ్రెస్ చెబుతోంది. మూసారంబాగ్ బ్రిడ్జ్ ప్రారంభం వేళ.. కేసీఆర్ రాజీనామాను డిమాండ్ చేస్తూ.. కాంగ్రెస్ శ్రేణులు ధర్నాలు, ఆందోళనలు, ర్యాలీలు చేయాలని పిలుపునిచ్చారు సీఎం. ఇవన్నీ.. ఇందిరాపార్క్ మహాధర్నాతో ముగియనున్నాయి. కేసీఆర్‌ను ఫెయిల్యూర్ ప్రతిపక్ష నేతగా.. ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాంగ్రెస్ లక్ష్యం. అయితే, కాంగ్రెస్ ఆరోపణలపై బీఆర్ఎస్ గట్టిగానే బదులిచ్చింది. కేసీఆర్ నిజంగా రాజీనామా చేస్తే వచ్చే పరిణామాలను రేవంత్ రెడ్డి తట్టుకోలేరని కేటీఆర్ ఎదురుదాడి చేశారు.