తల్లి నాలుగు ఇళ్లు తిరిగి పాచిపనులు చేస్తుంటుంది.
కొడుకు చదువులకోసం ఆమె ఆరోగ్యాన్ని సైతం పణంగా పెట్టి డబ్బు కూడబెడుతుంది.
కొడుకు వీధి దీపం కింద చదువుకుని పెద్దవాడవుతాడు.
కట్ చేస్తే ఓ పెద్ద ఉద్యోగంలో చేరి తల్లి కష్టాలను తీరుస్తాడు.
ఇలాంటి సన్నివేశాలు కేవలం సినిమాల్లో ఎక్కువగా చూస్తుంటాం. నిజ జీవితంలో ఈ సంఘటనలు అరుదుగా జరుగుతుంటాయి. అలాంటి అరుదైన విజయగాధ ఆ యువకుడిది. పేరు బయటపెట్టకుండా తన కథను రెడిట్ లో పోస్ట్ చేశాడు. ఆ స్ఫూర్తిమంతమైన కథకు చాలామంది ఫిదా అయ్యారు. అతడి జీవితం ఆదర్శప్రాయం అని కొనియాడారు. కొడుకుని ఉన్నత స్థితికి చేర్చిన తల్లికి జేజేలు కొట్టారు.
అమ్మానాన్నకు దూరంగా..
బెంగళూరు సమీపంలోని ఓ చిన్న గ్రామంలోని ఓ చిన్న కుటుంబం అది. తల్లిదండ్రులు జీవనం కోసం బెంగళూరుకి వలస వెళ్లగా, తన అన్నతో కలసి అమ్మమ్మ వద్ద పెరిగాడు మన హీరో. బెంగళూరులో తన తల్లి పడిన కష్టాల్ని కూడా అతడు వివరించాడు. పగటిపూట ఇళ్లలో పాచిపని చేసిన తల్లి, రాత్రి ఓ దుస్తుల ఫ్యాక్టరీలో పనిచేసేదని, తమ చదువులకోసం ఆమె తన జీవితాన్ని త్యాగం చేసిందని వివరించాడు. తల్లి ప్రోత్సాహంతో, ఆమె పంపించిన డబ్బులతో అన్నదమ్ములిద్దరూ చదువుకున్నారు. ఇద్దరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఉచిత హాస్టల్ సౌకర్యం కోసమే తమ్ముడు పాలిటెక్నిక్ కాలేజీలో చేరాడు. ఆ తర్వాత అన్నకు పవర్ గ్రిడ్ కార్పొరేషన్లో ఉద్యోగం రావడంతో తమ్ముడి చదువుకి సాయపడ్డాడు. అలా తమ్ముడు బీటెక్ కంప్యూటర్స్ పూర్తి చేసి బెంగళూరులోని ఓ కంపెనీలో వెబ్ డెవలపర్ గా పనికి కుదిరాడు. ఉద్యోగపర్వం మొదలు పెట్టిన కాలంలో తాను నెలకు రూ.5వేలకు పనిచేశానని, ఇప్పుడు వెబ్ డెవలరప్ గా ఏడాదికి రూ.46 లక్షలు సంపాదిస్తున్నానని చెప్పాడు. ఏడాదికి రూ.46 లక్షల జీతం సాధారణం కావొచ్చు కానీ తనలాంటి వారికి అది ఎంతో ఎక్కువ అని వివరించాడు.
గతాన్ని మరచిపోలేదు..
వెబ్ డెవలపర్ గా మంచి పొజిషన్లో ఉన్న ఆ 35 ఏళ్ల వ్యక్తి తన పాత జీవితాన్ని మరచిపోలేదు. తనకోసం తన అన్న భవిష్యత్ కోసం తల్లి పడిన కష్టాన్ని కూడా మరచిపోలేదు. ఆ కష్టాన్ని, చిన్న తనంలో తాము అనుభవించిన బాధల్ని ఓ కథ రూపంలో అందరిముందు ఉంచాడు. ఆ స్టోరీ చదివిన ప్రతి ఒక్కరూ అతడిని అభినందిస్తున్నారు. అతడి తల్లిని మెచ్చుకుంటున్నారు. వ్యవసాయ కార్మిక కుటుంబంలో జన్మించి, ఏడేళ్లకే తల్లిదండ్రులకు దూరంగా ఉండాల్సి వచ్చినా తన లక్ష్యాన్ని సాధించిన తీరు స్ఫూర్తిదాయకం అంటున్నారు.
తల్లిదండ్రులు సంపాదించి ఇస్తుంటే జల్సాగా ఖర్చు పెట్టే కొడుకులు, వారి కష్టాన్ని తమ విలాసాలకోసం తగలేసే పుత్ర రత్నాలు చాలామందే ఉంటారు. కానీ తల్లిదండ్రుల శ్రమను వృథా చేయకుండా, తమ జీవితాలకు ఓ అర్థం, పరమార్థం ఉండేలా జాగ్రత్తపడే కొడుకులు అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన కొడుకుల్లో ఆ ఇద్దరు ఉన్నారు. అమ్మ కష్టాన్ని గుర్తుంచుకుని, అన్న ఆసరాని ఉపయోగించుకుని ఆ తమ్ముడు పైకెదిగాడు. ఒకప్పుడు సొంత ఇల్లు, ఉద్యోగం, కారు అనేవి తనకు కలగా ఉండేవని.. తాను చేరుకోలేని మైలురాళ్లుగా వాటిని భావించానని.. కానీ అవన్నీ ఇప్పుడు తనకు ఉన్నాయని అంటున్నాడు మన హీరో. ఉద్యోగం చేస్తూ అమెరికా, లండన్, కెనడా కూడా వెళ్లానని, అదంతా తన తల్లి చలవేనని గర్వంగా చెబుతున్నాడు.