ఇరవై ఏళ్ల ఒక యువకుడికి తనకంటూ సొంత దేశం ఉండాలని కోరిక ఉండేది. తాను అధ్యక్షుడిగా అవ్వాలని కోరుకునేవాడు. కానీ 20 ఏళ్లకే అధ్యక్షుడిగా మారడం చాలా కష్టం. అయినా కూడా తన కలను నిజం చేసుకున్నాడు. ఎలాగో తెలుసా? ఒక భూమిని తనదిగా చెప్పుకొని ఒక దేశాన్ని సృష్టించాడు. ఆ దేశానికి ఒక పేరు పెట్టాడు. కొన్నాళ్ళకు ఆ దేశానికి పౌరులు వచ్చి స్థిరపడడం ప్రారంభించారు. అలా అతడు ఆ దేశానికి అధ్యక్షుడిగా మారిపోయాడు. ఇదేమి సినిమా కాదు నిజంగా జరిగినదే.
దేశం పేరు ఇదే
బ్రిటన్ కు చెందిన 20 ఏళ్ల డేనియల్ జాక్సన్ ప్రపంచంలోనే అతి పిన్న వయసు అధ్యక్షుడిగా మారాడు. క్రొయేషియా, సెర్బియా దేశాల మధ్య ఒక వివాదాస్పద భూమి ఉంది. ఆ భూమి తమ దంటే తమదని రెండు దేశాలు వాదులాడుకున్నాయి. చివరికి ఆ భూమిని అనాధలా వదిలేసాయి. ఆ భూమిలోనే తన దేశాన్ని సృష్టించాడు డేనియల్. ఆ దేశానికి ది ఫ్రీ రిపబ్లిక్ ఆఫ్ వెర్డిస్ అనే పేరు పెట్టాడు. ఆ దేశానికి తనని తానే అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు.
ఈ దేశం 125 ఎకరాల్లో వ్యాపించి ఉంటుంది. మొత్తం అడవి ప్రాంతమే. ఏ దేశం కూడా దీన్ని అధికారింగా తమ భూమి అని చెప్పుకోలేదు. అందుకే డేనియల్ ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. ఈ దేశానికి సొంత జెండా కరెన్సీ భాషా కూడా ఏర్పాటు చేశాడు. అలాగే చిన్న క్యాబినెట్ కూడా ఉంది. అలాగే ఈ దేశానికి సొంత పౌరసత్వం కూడా ఉంది. దీనిలో ఇప్పటివరకు 400 మంది పౌరులు ఉన్నారు.
దేశ కరెన్సీ, భాష
వెర్డిస్ దేశానికి చెందిన కరెన్సీ యూరోలలో ఉంటుంది. అలాగే ఇక్కడ అధికారిక భాషగా ఇంగ్లీష్, క్రొయేషియా, స్పానిష్ ఉన్నాయి. ఎందుకంటే బ్రిటన్, సెర్బియా, క్రొయేషియ దేశాలకు చెందిన ప్రజలు మాత్రమే వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. కాబట్టి ఆ మూడు భాషలను అధికారిక భాషగా ప్రకటించాడు.
డేనియల్ కు 14 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి అతని స్నేహితులతో కలిసి సొంత దేశం ఉండాలని, ఆ దేశానికి తాను అధ్యక్షుడి అవ్వాలని కోరుకునేవాడు. అతని కోరిక చెప్పినప్పుడు అందరూ తిట్టేవారు. వెర్రివాడు అంటూ కామెంట్ చేసేవారు. 18 ఏళ్ల వయసులో అతడు ఈ వివాదాస్పద భూమిని గుర్తించి ఆ దేశానికి చట్టాలను రూపొందించడం ప్రారంభించాడు. తర్వాత జెండాను సృష్టించాడు. అలాగే తనకు సొంత బృందాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అతడిని క్రొయేషియా ప్రభుత్వం జీవితాంతం దేశం నుండి బహిష్కరించింది. డేనియల్ తన సొంత దేశమైనా వెర్డిస్ లో నివసించడు. అతను బ్రిటన్ నుండే ఆన్లైన్లో ఈ దేశాన్ని నడిపిస్తాడు. అతడు తన లక్ష్యం అధికారం కాదని తాను ఆ దేశంలో సాధారణ పౌరుడు గానే ఉంటానని చెబుతున్నాడు.
దేశానికి పాస్‌పోర్ట్
దేశానికి వెళ్లాలనుకునే వారు అ దేశ పాస్ పోర్ట్ కోసం అప్లై చేసుకోవాల్సి వస్తుంది. అలాగే ఆ దేశ పౌరసత్వం కూడా అంత సులువుగా రాదు. ఇప్పటివరకు 400 మందికి మాత్రమే ఆమోదం లభించింది. ఇప్పుడు డేనియల్ తన దేశం కోసం వైద్యులు, పోలీసులు వంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నాడు. అయితే వెర్డిస్ దేశానికి చెందిన పాస్ పోర్టు అంతర్జాతీయ ప్రయాణాలకు ఉపయోగించకూడదు. ప్రస్తుతం డేనియల్ బ్రిటన్ లో నివసిస్తున్నాడు.
డేనియల్ ఒకరోజు తాను మళ్ళీ వెర్డిస్ కు వచ్చి అక్కడ ఎన్నికలు నిర్వహిస్తానని, అలా ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని స్థాపిస్తానని చెబుతున్నాడు. అతను చెబుతున్న ప్రకారం క్రొయేషియా ఈ భూమిని ఎప్పటికీ తమదని క్లెయిమ్ చేయదని ఆశిస్తున్నాడు. కాబట్టి ఆ దేశం ఎప్పటికైనా అలాగే ప్రత్యేకంగా నిలిచి ఉంటుందని అతని కోరిక.