జానపద గాయనిగా మంచి గుర్తింపు పొందిన 25 ఏళ్ల గాయని మైథిలి ఠాకూర్.. ఇప్పుడు బీహార్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అలీనగర్ స్థానం నుంచి పోటీ చేసిన ఆమె, RJD అభ్యర్థి బినోద్ మిశ్రాపై 84,915 ఓట్ల ఆధిత్యంతో ఘన విజయం సాధించింది. ఈ అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఏనాడు బీజేపీ విజయం సాధించని సీటులో తొలిసారి జయకేతనం ఎగురవేసింది. బీహార్ లో అత్యంత పిన్న వయసున్న ఎమ్మెల్యేగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఏడాది జూలైలోనే ఆమెకు పాతికేళ్లు నిండాయి. బీహార్ లో 2005లో చివరిసారిగా తౌసీఫ్ ఆలం అనే 26 ఏళ్ల యువతి స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించింది. ఆ తర్వాత ఆర్జేడీకి చెందిన తేజస్వి యాదవ్ కూడా 26 ఏళ్ల వయసులో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ రికార్డులన్నీ బ్రేక్ చేస్తూ మైథిలి అతి చిన్న వయసులో ఎమ్మెల్యేగా ఎన్నికైంది.
గాయనిగా బీహార్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మైథిలి, ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత తన పాత వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆమె ఒకప్పుడు ఇండియన్ ఐడల్ ఆడిషన్ కు వెళ్లి రిజెక్ట్ అయ్యింది. నాటి ఆడిషన్ వీడియో ఇప్పుడు నెట్టింట్ హల్ చల్ చేస్తుంది. ఆమె అప్పట్లోనే రాముడికి సంబంధించిన పాట పాడింది. కానీ, ఆ షోలో ఉన్న జడ్జిలకు ఆమె పర్ఫార్మెన్స్ అంతగా నచ్చలేదు. ఆమెను సెలెక్ట్ చేయలేదు. ఆ షోలో రిజెక్ట్ అయ్యినా, ఇప్పుడు ఆమె ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెడుతుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అపజయం అనేది విజయాలను ఆపలేదంటున్నారు.
Without debating about her Qualification, her choice, pros n cons…
Today, She Contested Bihar Assembly Elections.
She is the BJP Candidate from Alinagar Seat. #MaithiliThakur 🔥 pic.twitter.com/9ouaBwba1k
— ✎𝒜 πundhati🌵🍉🇵🇸 (@Polytikles) November 14, 2025
మైథిలి ఎన్నికల ప్రచారంలో ఆమె కుటుంబం కీలక పాత్ర పోషించింది. ఆమె తమ్ముళ్ళు తబలా ఆర్టిస్ట్ రిషవ్, చిన్నవాడు అయాచి, ప్రచారం అంతటా ఆమెతో పాటు పాల్గొన్నారు. ర్యాలీలలో జానపదాలను పాడుతూ ప్రజలను ఆకట్టుకున్నారు. కళాత్మక వారసత్వానికి ప్రసిద్ధి చెందిన మిథిలాలో వారికి మంచి గుర్తింపు రావడంలో ఆ పాటలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. వారికి మద్దతుగా ఆమె మామలు, నంద్ కిషోర్ ఝా, సుమిత్ ఝా, అలీనగర్ అంతటా ప్రచార ప్రణాళికలను రూపొందించారు.
మైథిలి ఠాకూర్ సోదరులు చాలా కాలంగా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ముఖ్యంగా రామచరితమానస్ పారాయణాలతో కూడిన ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆన్ లైన్ లో మిలియన్ల కొద్ది వ్యూస్ అందుకున్నాయి. మైథిలి చక్కటి పాటలతో అటల్ మిథిలా సమ్మాన్, లోక్ మత్ సుర్ జ్యోత్స్న జాతీయ సంగీత అవార్డుతో సహా అనేక అవార్డులను అందుకుంది. 2019లో, ఆమె, ఆమె సోదరులను ఎన్నికల సంఘం మధుబనికి బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించింది. ఇప్పుడు ఆమె అలీనగర్ నుంచి తొలిసారి బీజేపీ అభ్యర్థిగా గెలిచి.. బీహార్ అసెంబ్లీలో అతి చిన్న వయసున్న ఎమ్మెల్యేగా అడుగు పెట్టబోతోంది.
Read Also: సూరత్ బుల్లెట్ రైలు స్టేషన్ కు ప్రధాని మోడీ, పనుల పురోగతిపై సమీక్ష!